AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్‌లో చల్లారని ఉద్రిక్తతలు.. నివురుగప్పిన నిప్పులా మారిన పరిస్థితులు..!

బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉన్నాయి. మైనార్టీలే టార్గెట్‌గా అల్లరి మూక మరోసారి రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి హిందువుల రక్షణకు యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి..? అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్‌, బంగ్లా దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది.?

బంగ్లాదేశ్‌లో చల్లారని ఉద్రిక్తతలు.. నివురుగప్పిన నిప్పులా మారిన పరిస్థితులు..!
Violence Erupts In Bangladesh
Balaraju Goud
|

Updated on: Dec 20, 2025 | 9:21 PM

Share

బంగ్లాదేశ్‌ పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అరాచక శక్తుల ఆగడాల మితిమీరిపోతున్నాయి. వీరిని అడ్డుకోవడంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం విఫలమైంది. దీంతో సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న నెపంతో 25 ఏళ్ల హిందూ యువకుడు దీపూ చంద్రదాస్‌ను నిరసనకారులు క్రూరంగా కొట్టి చంపడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ అమానుష కాండపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో.. ఎట్టకేలకు యూనస్ ప్రభుత్వం కళ్లు తెరిచింది.

దీపూ చంద్రదాస్ హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అధికారికంగా ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో హిందువులపై జరుగుతున్న దాడులు ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. దీంతో హిందువులపై జరుగుతున్న హింసను అరికట్టాలని, బాధితులకు రక్షణ కల్పించాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల అల్లరి మూకలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఓ మీడియా ఆఫీసులపై దాడి చేసి.. 150 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. ఓ లాకర్‌ రూమ్‌ను బద్దలు కొట్టి… ఉద్యోగుల వస్తువులు చోరీ చేశారు.

మరోవైపు గతంలో బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు నిర్వహించారు. అత్యక్రియల్లో లక్షల మంది పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పార్లమెంటు భవనంలో హాదీ మృతదేహాన్ని ఉంచి.. ప్రార్థనలు నిర్వహించారు. మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న మార్గంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడి భారత హైకమిషన్ కీలక సూచనలు చేసింది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు ఆ దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్ – బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకు బలహీన పడుతున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఒకప్పుడు భారత్‌కు సహజ భాగస్వామి. కానీ గత ఏడాది నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. విద్యార్థుల నిరసనలు, హింసాత్మక ఘటనలు, షేక్ హసీనా దేశం వదిలి పారిపోవడం, ఆమె భారత్ లో తలదాచుకోవడం లాంటివి రెండు దేశాలకూ మధ్య దూరాన్ని పెంచాయి. దానికి తోడు తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ కూడా భారత్ తో కంటే పాకిస్తాన్ తోనే ఎక్కువ స్నేహాన్ని కోరారు. పాకిస్తాన్ తో కలిసి బంగ్లాదేశ్ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల విషయంలో చైనాకు అనుకూలంగా మాట్లాడడం లాంటివి కూడా దౌత్య సంబంధాలను దెబ్బ తీశాయి. బంగ్లాదేశ్‌లో చైనా జోక్యం ఎక్కువగా ఉందని బంగ్లాదేశ్‌ భారత్‌ మాజీ హైకమిషనర్‌ రంజన్‌ చక్రవర్తి అన్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు బంగ్లాదేశ్…రెండు దేశాలకు మధ్య ఉన్న బంగాళాఖాతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్‌ను రెచ్చగొడుతోంది. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..