AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ఫోన్ కాల్.. మంటలు రేపింది.. ఒక్క ఫోన్ కాల్.. ఏకంగా ప్రదాని పీఠానికే సెగ పెట్టింది!

థాయ్‌లాండ్ వైరల్‌ న్యూస్‌కు కేరాఫ్‌గా మారుతోంది. అక్కడి వంటకాలు వైరలే.. అక్కడి పాటలు వైరలే.. అక్కడి మసాజ్ సెంటర్లు వైరల్.. బీచులు అంతకన్నా వైరల్.. ఒకప్పుడు థాయలాండ్ పేరు చెబితే అందరికి గుర్తుకు వచ్చేది మసాజ్ సెంటర్లు. బ్యాంకాక్ బీచులు. ఇప్పుడీ కంట్రీ పేరు చెబితే.. మనకు గుర్తుకు వచ్చేది.. ఇటీవల ఫేమస్ అయిన అన్ననా పతియా అప్పట కేటియా సాంగ్..!

ఒక్క ఫోన్ కాల్.. మంటలు రేపింది.. ఒక్క ఫోన్ కాల్.. ఏకంగా ప్రదాని పీఠానికే సెగ పెట్టింది!
Paetongtarn Shinawatra
Balaraju Goud
|

Updated on: Jun 20, 2025 | 7:58 PM

Share

థాయ్‌లాండ్ వైరల్‌ న్యూస్‌కు కేరాఫ్‌గా మారుతోంది. అక్కడి వంటకాలు వైరలే.. అక్కడి పాటలు వైరలే.. అక్కడి మసాజ్ సెంటర్లు వైరల్.. బీచులు అంతకన్నా వైరల్.. ఒకప్పుడు థాయలాండ్ పేరు చెబితే అందరికి గుర్తుకు వచ్చేది మసాజ్ సెంటర్లు. బ్యాంకాక్ బీచులు. ఇప్పుడీ కంట్రీ పేరు చెబితే.. మనకు గుర్తుకు వచ్చేది.. ఇటీవల ఫేమస్ అయిన అన్ననా పతియా అప్పట కేటియా సాంగ్.

ఈపాట ఎంత వైరల్ అయిందో తెలుసుగా.. థాయ్‌లాండ్‌ మ్యూజిక్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో వైరల్ న్యూస్ ఆ దేశాన్నే షేక్ చేస్తోంది. ఒక్క ఫోన్ కాల్.. ఆ దేశంలో మంటలు రేపింది. ఒక్క ఫోన్ కాల్.. ఏకంగా ఆదేశ ప్రధానికి పదవి గండం తెచ్చిపెట్టింది. ఒక్క ఫోన్‌ కాల్..ఓ యువమహిళా నేత కేరీర్‌నే ప్రమాదంలో పడేసింది.

అధికారం చేపట్టిన పది నెలలకే థాయ్‌లాండ్‌ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు పదవీగండం పొంచి ఉంది. పొరుగు దేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్‌ కాల్‌ లీక్ అవడం.. ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తగా.. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామిగా ఉన్న పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది.

థాయ్‌లాండ్‌-కంబోడియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. ఇది ఈనాటిదేం కాదు. అయితే, కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌కు థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్‌ చేశారు. అంకుల్‌ అంటూ సంబోధిస్తూ.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్‌ ఆర్మీ కమాండర్‌ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ సంభాషణనే ఆమె పదవినే ప్రమాదంలో పడేసింది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

అయితే, వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్‌కాల్‌ సంభాషణ లీకైంది. సాధారణంగానే కంబోడియా-థాయ్‌లాండ్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. సరిహద్దు వివాదాల కారణంగా సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో ప్రధాని పొరుగు దేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత పక్షం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని ఫోన్‌తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి మిత్ర పక్షాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి.

థాయ్‌లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని తక్సిన్ కుమార్తె షినవత్రా. 2024 ఆగస్టు నెలలో ప్రధానమంత్రి పదవి చేపట్టారు షినవత్రా. 37 ఏళ్ల పటోంగ్‌టార్న్ షినత్రా, థాయ్ మాజీ ప్రధాన మంత్రి థాక్సిన్ షినవత్రా చిన్న కుమార్తె. ఆమె తండ్రితో పాటు, ఆమె అత్త యింగ్లక్ కూడా థాయిలాండ్ ప్రధానమంత్రిగా పని చేశారు. ఆమె ఆ దేశంలో అతి పిన్న వయస్కురాలు, అంతేకాదు రెండవ మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.

షినావత్రా తన కుటుంబంలో ఈ స్థానానికి చేరుకున్న మూడవ వ్యక్తి. ఆమె తండ్రి తక్సిన్ షినావత్రా 15 సంవత్సరాల ప్రవాసం తర్వాత గత సంవత్సరం దేశానికి తిరిగి వచ్చారు. తక్సిన్ 2001లో తొలిసారి థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ 2006లో జరిగిన తిరుగుబాటు తర్వాత బహిష్కరణకు గురయ్యారు. పటోంగ్‌టార్న్ షికవత్రా థాయ్ రాజకీయాల్లో బాగా ప్రాచుర్యం పొందారు. గత ఎన్నికల్లో ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ తీవ్రంగా ప్రచారం చేసింది. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఫ్యూ థాయ్ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది. అదే సమయంలో, ఆమె కుటుంబానికి థాయిలాండ్ రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. అందుకే ఆమెకు ప్రజల మద్దతు చాలా లభిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..