Iran: ఇరాన్‌కు ఆమె శాపం!.. నెట్టింట వైరలవుతున్న 2004 నాటి విషాద గాథ
ఆగస్టు 15, 2004 ఉదయం, ఇరాన్‌లోని నేకా నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశానికి చెందిన 16 ఏళ్ల బాలికను అంతా చూస్తుండగానే బహిరంగ కూడలిలో ఉరితీశారు. అంతే.. ఒక్కసారిగా ఇరాన్ అట్టుడికింది. ఆ బాలికకు జరిగినది దారుణమంటూ ప్రపంచదేశాలు సైతం గొంతెత్తాయి. కానీ అప్పటికే ఓ నిండు జీవితం బలైంది. ఆ బాలిక పేరే అతేఫా సహాలేహ్. ఆమెకు ఇరాన్ న్యాయస్థానం అమలు చేసిన ఉరిశిక్షసంచలనం రేపింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ అతేఫా గురించిన చర్చ నెట్టింట వైరలవుతోంది. ఇరాన్ తాజా పరిస్థితులకు ఆమె మరణమే కారణమంటూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలింతకీ ఏం జరిగింది?..

ఇజ్రాయెల్‌తో జరుగుతున్న హింసాత్మక ఘర్షణల కారణంగా వందలాది మంది ఇరానియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో 2004లో ఉరితీయబడిన 16 ఏళ్ల బాలిక అతేఫా సహాలేహ్ విషాద కథ ఇంటర్నెట్‌లో మరోసారి చర్చనీయాంశమైంది. ఇస్లామిక్ పాలనను శపించిందనే వాదనలతో ఆమె కథ విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ ఘటన తర్వాత ఆ దేశాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయని అక్కడి వారు మనశ్శాంతి కోల్పోయారని అంటున్నారు.
ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఉరిశిక్ష
ఆగస్టు 15, 2004 ఉదయం, ఇరాన్‌లోని నేకా నగరంలోని బహిరంగ కూడలిలో అతేఫా సహాలేహ్‌ను ఉరితీశారు. ఆమెకు “పవిత్రతకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు” మరణశిక్ష విధించారు. కోర్టు ఆమె వయసును 22 ఏళ్లని.. వ్యభిచార నేరానికి పాల్పడిందని అభివర్ణించింది. అయితే, అతేఫాకు వివాహం కాలేదు. ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలనేది కొందరి వాదన. ఇరానియన్ చట్టం ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని ఉరితీయకూడదు. అతేఫాను ఉరితీయడానికి ఇరానియన్ కోర్టులు ఆమె వయస్సును తప్పుగా చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో చర్చ
జూన్ 17న, భారతీయ వినియోగదారుడు ఒకరు ఎక్స్ వేదికగా ఈ బాలిక కథను వివరంగా పంచుకున్నారు. తన పోస్ట్‌లో, “ఈ అమ్మాయిని ఉరితీసినప్పటి నుండి ఇరాన్‌లో ఎప్పుడూ శాంతి లేదు. అందుకే ఇరాన్‌ను ఈ అమ్మాయి శపించిందని ప్రజలు అంటున్నారు” అని పేర్కొన్నారు.
ఈ కథను వివరించిన తర్వాత, అతను “ఇదెక్కడి న్యాయం? ఇదేం చట్టం? ముస్లిం మెజారిటీ దేశాలలో ముస్లిం మహిళల జీవితాల వాస్తవ చిత్రం ఇదేనా?” అని ప్రశ్నించారు. ఇరాన్ వెలుపల ప్రపంచానికి చేరిన ఇటువంటి కేసు ఇది ఒక్కటేనని, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి అనేక దేశాలలో ఇలాంటి క్రూరమైన చట్టాల కారణంగా చాలా మంది అమాయక బాలికల ప్రాణాలు పోతున్నాయని అతను గుర్తు చేశారు.
ఇరాన్‌లో మహిళల హక్కులు
ఈ ఉరిశిక్ష ఆ సమయంలో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నైతికతకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు మరణశిక్షలు విధించే, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకునే పాలన దుర్వినియోగాలను ఇది బయటపెట్టింది. ఇరాన్‌లో మహిళలకు పురుషుల కంటే తక్కువ చట్టపరమైన హక్కులు ఉన్నాయి. వారి ప్రవర్తనను నైతికత పోలీసులు నిరంతరం గమనిస్తుంటారు. 2022లో, మహ్సా అమిని కస్టడీలో మరణించిన తర్వాత, దేశంలో మహిళలపై జరుగుతున్న క్రూరమైన ప్రవర్తనకు నిరసనగా ‘జాన్, జెండెగి, ఆజాది’ (స్త్రీ, జీవితం, స్వేచ్ఛ) అనే ఉద్యమం చెలరేగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
