Pakistan Crisis: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం.. ముంబై దాడికి పాల్పడ్డ కసబ్‌పై పాక్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇటీవల తన ర్యాలీలో కుట్రతో కూడిన అజ్ఞాత లేఖను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. తనను అధికారం నుంచి దింపేందుకు విదేశాల నుంచి కుట్ర పన్నారని అన్నారు.
Pakistan Political Crisis: ఇటీవల తన ర్యాలీలో కుట్రతో కూడిన అజ్ఞాత లేఖను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ప్రస్తావించారు. తనను అధికారం నుంచి దింపేందుకు విదేశాల నుంచి కుట్ర పన్నారని అన్నారు. తన వద్ద ఒక లేఖ ఉంది, అందులో అన్ని రహస్యాలు దాగి ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ లేఖ విషయంలో ప్రతిపక్షాలు ఆయనను చుట్టుముట్టాయి. ఈ లేఖను ఇమ్రాన్ ఖాన్ బహిరంగపరచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, దీనిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్.. విదేశాంగ విధానం దృష్ట్యా ఈ లేఖను బహిరంగంగా పంచుకోలేనని ఆయన చెప్పారు. పాక్ ప్రభుత్వం(Pak Government) దానిని ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపేందుకు ప్రతిపాదించింది.
గతంలో కూడా ప్రపంచ శక్తులు పాకిస్థాన్‌లోని ప్రభుత్వాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఎవరి ముందు తల వంచను అన్న ఆయన.. అవిశ్వాస తీర్మానం విఫలమవుతుందన్నారు. బలూచిస్థాన్ అవామీ పార్టీ (బీఏపీ) ఎంపీలు తనతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే తాను ప్రభుత్వంలో చేరతానని చెప్పారు. ఇదిలావుంటే, పాకిస్థాన్ ముస్లిం లీగ్ క్వాయిడ్ (పీఎంఎల్ క్యూ)కి పంజాబ్ సీఎం పదవిని ఇవ్వడంపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, చాలా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పద్దన్నారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి అసద్ ఉమర్ కూడా విలేకరులతో మాట్లాడుతూ, ఆ కుట్ర లేఖను చీఫ్ జస్టిస్ ఒమర్ అటా బండియాల్‌తో పంచుకోవడానికి ఇమ్రాన్ ఖాన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రధాని ఈ లేఖను ఆర్మీ అధికారులు, కేబినెట్ సభ్యులతో పంచుకున్నారని తెలిపారు.
ఇదిలావుంటే, పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ప్రభుత్వానికి మిత్రపక్షమైన ఎంక్యూఎం ప్రతిపక్ష పార్టీలతో వెళ్లడంతో కష్టాలు పెరిగిపోవడంతో పతనం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు నేతలు విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. ముంబై దాడి నిందితుడు అజ్మల్ కసబ్ ఇంటి చిరునామాను నవాజ్ షరీఫ్ భారతదేశానికి ఇచ్చాడని పాకిస్తాన్ హోం మంత్రి షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు పాకిస్థాన్‌లో రాజకీయ కలకలం రేగింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. అతను లేఖను చూపించడానికి MQMకు చెందిన ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీ, BAP ఖలీద్ మగసిని ఆహ్వానించారు. కానీ వారు ఆహ్వానాన్ని తిరస్కరించారు. MQM, BAP ఇప్పుడు PM ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షంతో ఉన్నాయి. పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ప్రభుత్వం నుంచి వైదొలగనున్న MQM సభ్యుడు, న్యాయశాఖ మంత్రి ఫరూగ్ నసీమ్, ఐటీ మంత్రి అమీన్ ఉల్ హక్ కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం MQM నాయకుడు ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీతో ప్రతిపక్షాల సంయుక్త విలేకరుల సమావేశం కూడా ఉంది.