NEPAL POLITICAL CRISIS: పొరుగుదేశంలో రాజకీయ సంక్షోభం.. చేజేతులా నాశనం చేసుకున్న ప్రధాని శర్మ?
నేపాల్ మరోసారి రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాది కాలంగా నేపాల్ ప్రభుత్వంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంటును అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ రద్దు చేశారు.
NEPAL POLITICAL CRISIS INTENSIFIED: నేపాల్ మరోసారి రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాది కాలంగా నేపాల్ ప్రభుత్వం (NEPAL GOVERNMENT)లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంటును అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ (BIDYA DEVI BHANDARI) రద్దు చేశారు. 2021 నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్ 12న మొదటి దశ , 19న రెండో దశ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అధ్యక్ష భవనం తెలిపింది. ఆపద్ధర్మ ప్రధాని కె.పి.శర్మ ఓలి (K P SHARMA OLI) గానీ, ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దేవ్‌బా (SHER BAHADUR DEVBAA) గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతినిధుల సభను అధ్యక్షురాలు రద్దు చేసినట్టు ఇందులో స్పష్టం చేశారు.
ఆపద్ధర్మ ప్రధాని ఓలి మంత్రివర్గం చేసిన సిఫారసు మేరకు అధ్యక్షురాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఓలి గత ఏడాది డిసెంబరులో పార్లమెంటు (NEPAL PARLIAMENT)ను రద్దు చేశారు. అప్పట్నుంచి నేపాల్ లో రాజకీయ సంక్షోభం మొదలైంది. ప్రచండ (PRACHANDA) నేతృత్వంలోని పార్టీ ఆయన ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రతినిధుల సభలో ఓలి మెజారిటీని నిరూపించుకోవాల్సి వచ్చింది. కానీ ఆ విశ్వాస పరీక్షలో ఆయన ఓడిపోయారు.
తనకు 153 మంది సభ్యుల మద్దతు ఉందంటూ ప్రధాని కె.పి శర్మ ఓలి ప్రకటించారు. ఈ మేరకు ఆయన అధ్యక్షురాలు భండారికి వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా కూడా అధ్యక్షురాలి దగ్గరకు వెళ్లి తనకు 149 మంది మద్దతుందని చెప్పారు. నేపాల్ పార్లమెంట్‌లో 275 మంది సభ్యులు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరం. కె.పి.శర్మ ఓలి బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ ప్రత్యామ్నాయంగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయనే ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు. అధ్యక్షురాలు తీసుకున్న చర్యపై రాజకీయ పార్టీలు ఇంకా స్పందించలేదు. మరోవైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ (CORONA SECOND WAVE) బలంగా ఉంది. కేసులు సగటున రోజూ 8వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఖాట్మండు (KHATMANDU) లోని ఆసుపత్రులన్నీ కోవిడ్ (COVID) పేషంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఒకే బెడ్ పై ఇద్దరు రోగులను ఉంచుతున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆక్సిజన్ (OXYGEN) కొరత తీవ్రంగా ఉండగా, వ్యాక్సినేషన్ (VACCINATION) ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. దీంతో ఒక వైపు రాజకీయ సంక్షోభం, మరోవైపు కరోనాతో దేశం అల్లాడుతుంది.
ఉప్పుకు.. పప్పుకు మన దేశం మీద ఆధారపడే నేపాల్.. మన దేశంలో కరోనా సెకెండ్ వేవ్ రాగానే సరిహద్దులు మూసేసి మరి కాస్త ఫోజ్ కొట్టింది. పోనీ అంతే నిక్కచ్చిగా తమ దేశాన్ని నేపాలీయులు (NEPALESE) చక్కబెట్టుకున్నారా అంటే అదీ లేదు.. ఓ వైపు రాజకీయ సంక్షోభం.. మరోవైపు కరోనా సెకెండ్ వేవ్.. వెరసి నేపాల్ ప్రస్తుతం అతలాకుతలం అవుతోంది. పార్లమెంటులో పెట్టిన విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ప్రధాని శర్మను బతిమాలి మరీ తిరిగి అదే సీటులో కూర్చోబెట్టిన దౌర్భగ్యపు ప్రజాస్వామ్యం నేపాల్‌లో రాజ్యమేలుతోంది. ఒకపక్క రాజకీయ అస్థిరత, మరోపక్క రోజురోజుకూ పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపాల్ ఇప్పట్లో కుదుటపడే జాడలు కనబడటం లేదు. గత డిసెంబర్‌లో పార్లమెంటు దిగువసభను రద్దు చేస్తూ శర్మ నిర్ణయం తీసుకున్నప్పట్నించి నేపాల్ సంక్షోభంలో పడిపోయింది. వాస్తవానికి అప్పటికి ప్రతినిధుల సభ ఎన్నికలకు ఇంకా సంవత్సరం గడువుంది. 275 మంది సభ్యులుండే సభలో అధికార పక్షమైన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (సీపీఎన్)కి 174 మంది సభ్యుల మద్దతుంది. అయితే పార్టీలో మరో బలమైన వర్గానికి నాయకుడిగా వున్న మాజీ ప్రధాని ప్రచండతో లోగడ కుదిరిన అవగాహనకు భిన్నంగా శర్మ సమస్త అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడంతో అతనికి ప్రచండకు మధ్య సంబంధాలు చెడిపోయాయి. తనను పదవినుంచి దించేందుకు ప్రచండ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రతినిధుల సభను శర్మ అనూహ్యంగా రద్దు చేశారు. దాంతో నేపాల్ రాజకీయ సంక్షోభంలో పడిపోయింది.
నేపాల్‌లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంది. మనదేశంలో సెకెండ్ వేవ్ ప్రారంభం కాగానే భారత్ నుంచి వచ్చే అన్ని మార్గాలను మూసివేస్తున్నట్లు అతి జాగ్రత్త చర్యల్లో భాగంగా నేపాల్ ప్రకటించింది. అయితేనేం.. నేపాల్‌ను కరోనా సెకెండ్ వేవ్ వదిలి పెట్టలేదు. అన్ని జిల్లాల్లో గత రెండు వారాలుగా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. కరోనా ఉధృతితో మన దేశంలో మళ్లీ ఆంక్షలు విధించడంతో నేపాల్ నుంచి వలస వచ్చని కూలీలు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్ళారు. ఈ వలస కూలీలు తమ దేశానికి తమ బాధలతో పాటు.. కరోనా వైరస్‌ను తీసుకెళ్ళారు. వలస జీవులు తమ దేశానికి చేరుకున్న తర్వాతే నేపాల్ కరోనా మరింత ఉగ్రరూపం దాల్చింది. ఏప్రిల్ నెలంతా ఆ దేశంలో వంద కేసులుండగా, ప్రస్తుతం రోజుకు 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నేపాల్‌లో నమోదవుతున్నాయి. వైద్య సదుపాయాలు లేవంటూ రోగులను ఆసుపత్రులు వెనక్కిపంపడం అక్కడ సర్వసాధారణమైపోయింది. సాధారణ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు మొదలుకొని ఆక్సిజన్, వెంటిలేటర్ వరకూ అన్నిటికీ కొరత వున్నదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. పర్యవసానంగా ప్రాణాలు కోల్పోతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది.
నేపాల్‌లో కరోనా పరీక్షలు (COVID TESTS)గానీ, క్వారంటైన్ కేంద్రాల (QUARANTINE CENTRES) నిర్వహణ గానీ లేదు. నిరుడు కరోనా విజృంభించినప్పుడు సైన్యం సాయం తీసుకున్న ప్రభుత్వం ఈసారి మాత్రం తగిన విధంగా స్పందించలేదు.. సరైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వైద్య రంగంపై కేంద్రీకరించాల్సిన ఈ తరుణంలో నేపాల్ రాజకీయ నాయకులు (NEPAL POLITICAL LEADERS) అధికారం కోసం వికృత క్రీడను ఆరంభించారు. 2020 డిసెంబర్‌లో పార్లమెంటు రద్దు చేసినప్పుడే శర్మ ఓలిని అందరూ దుయ్యబట్టారు. అప్పటికి కరోనా తీవ్రత తగ్గి కాస్త కుదుటపడుతున్నట్టు కనబడినా, నిర్లిప్తత పనికిరాదని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల్లో ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును ఎత్తిచూపారు. ఈ సలహాలను, సూచనలను నేపాల్ పాలక, ప్రతిపక్షాలు పెడచెవిన పెట్టాయి. దాంతో ప్రస్తుతం పరిస్థితి విషమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
శర్మ ఓలిని తప్పిస్తే అన్నీ సర్దు కుంటాయని విపక్షాలూ… వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కనివ్వరాదని ఆయన పట్టుదల ప్రదర్శించారు. ఈలోగా పార్లమెంటు రద్దు నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా వున్నదని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రతినిధుల సభను పునరుద్ధరించింది. మధ్యంతర ఎన్ని కల్లో విజయం సాధించి, ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించవచ్చని కలలుగన్న శర్మ ఓలి సుప్రీంకోర్టు (SUPREME COURT) తీర్పుతో ఖంగు తిన్నారు. అసలు సీపీఎన్(యూఎంఎల్), సీపీఎన్(మావోయిస్టు సెంటర్)లు విలీనమై ఆవిర్భవించిన సీపీఎన్ కూడా చెల్లుబాటు కాదని మరో తీర్పులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉమ్మడిగా వున్నప్పుడే అంతర్గత కలహాలతో సతమతమైన పార్టీ రెండుగా విడిపోయాక మాత్రం సమష్టిగా ఏం పనిచేస్తుంది? పర్యవసానంగా శర్మ ఓలి సర్కారు ఓడిపోయింది. మూడు రోజుల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ విపక్షాలను కోరినా ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలు సరిగ్గా వినియోగించుకోలేకపోయాయి. పర్యవసానంగానే మళ్లీ శర్మ ఓలియే ప్రధాని పదవిని అధిష్టించారు. కానీ నెలరోజుల్లో ఆయన తన బలనిరూపణ చేసుకోవాలన్న షరతు వుండడంతో ఆయన ఎంతో కాలం పదవిలో కొనసాగే పరిస్థితి కనిపించ లేదు.
మన దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభం కాగానే.. భారత్ (BHARAT)కు దూరం, చైనా (CHINA)కు దగ్గర అన్న సంకేతాలిచ్చిన నేపాల్ పట్ల మన దేశం సానుకూలంగానే వ్యవహరించింది. ఇప్పటి దాకా నేపాల్‌కు 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను మన దేశం సరఫరా చేసింది. మన దేశం పంపిణీ చేసిన 20 లక్షల వ్యాక్సిన్లు మినహా ఇతరత్రా టీకాల లభ్యత నేపాల్‌లో లేదు. స్థానికంగా వుండే ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి కావాలనే ప్రభుత్వం టీకాల కొరత సృష్టించిందని విమర్శలు రావడం నేపాల్‌లో నెలకొన్న అమానవీయ పరిస్థితికి అద్దం పడుతుంది. దక్షిణాసియాలో వేరే దేశాలతో పోలిస్తే దారుణమైన పేదరికంలో మగ్గుతున్న నేపాల్ ఇంతటి మహావిపత్తులో చిక్కుకోగా ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా అందుకు తగినట్టు స్పందించాలన్న ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోయాయి. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఎలాంటి చర్యలు అవసర మన్న అంశాన్ని గాలికొదిలి రాజకీయ ఎత్తుగడల్లోనే అవి పొద్దుపుచ్చాయి.
ఇప్పుడు మళ్లీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసిన శర్మ ఓలి ఏదో ఒరగబెడతారన్న భ్రమలు ఎవరికీ లేవు. కరోనా రానీయ కుండా కట్టడి చేయడానికి ప్రతి ఇంటి గుమ్మానికి జామ ఆకులు కట్టమని రెండు నెలల క్రితం పిలుపు నిచ్చి ఆయన నవ్వులపాలయ్యాడు. కాస్త హెచ్చుతగ్గులుండొచ్చుగానీ… వర్ధమాన దేశాల్లో చాలా చోట్ల నేపాల్ మాదిరే ప్రజాస్వామ్య వ్యవస్థలు నిరర్థక వేదికలుగా మారాయి. జవాబుదారీతనానికి తిలోదకాలిస్తున్నాయి. అంతా సజావుగా సాగినప్పుడు తమ ఘనతేనని చెప్పుకునే అధినేతలు, సంక్షోభం చుట్టుముట్టాక ప్రజలపైనో, ప్రకృతిపైనో నెపం వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీన్నుంచి సాధ్యమైనంత త్వరగా నేపాల్ ప్రజలు బయటపడాలని ఆకాంక్షించడం మినహా ఎవరూ చేయగలిగింది లేదు.
ALSO READ: రెండో డోసు ఎంత లేటైతే అంత మేలు.. అమెరికన్ సైంటిస్టుల తాజా అధ్యయనం ఫలితమిదే!
ALSO READ: కరోనా మరణాల లెక్కల్లో గందరగోళం.. అన్ని దేశాలు తప్పుడు లెక్కలిచ్చాయంటున్న డబ్ల్యూహెచ్ఓ
ALSO READ: ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి బైడెన్ శాశ్వత పరిష్కారం.. కొత్త ప్రతిపాదన ఇదే!