Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump – Elon Musk: ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అంటున్న మస్క్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , టెస్లా చీఫ్‌ మస్క్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు తగ్గినట్టే తగ్గి రెచ్చిపోతున్నారు. ఆప్త మిత్రుల నుంచి బద్దశత్రువులుగా మారిపోయారు. వీళ్లిద్దరి గొడవ అమెరికాకు ఏమాత్రం మేలు చేయదని ఆ దేశ రాజకీయ , ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం వచ్చిందంటూ ట్రంప్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన ట్వీట్‌ను మస్క్‌ తొలగించారు

Donald Trump - Elon Musk: ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అంటున్న మస్క్‌
Donald Trump - Elon Musk
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2025 | 7:43 PM

ట్రంప్‌- ఎలాన్‌ మస్క్‌ మధ్య రాజీ కుదరినట్టే కుదిరి బెడిసికొడుతోంది. నువ్వా ? నేనా ? అన్న రీతిలో ఇద్దరి మధ్య ఫైట్‌ కొనసాగుతోంది. అదే సమయంలో ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టును మస్క్‌ తొలగించారు. అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం వచ్చిందంటూ మస్క్‌ పోస్టు పెట్టారు. సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్‌ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు. త్వరలో దీనిపై అన్ని వివరాలు వెల్లడిస్తానని ట్వీట్‌ చేశారు. కాని ఆకస్మాత్తుగా ఆ ట్వీట్‌ను తొలగించారు మస్క్‌.

ఇద్దరి మధ్య రాజీ కుదిరితేనే దేశానికి మంచిది

ట్రంప్‌-మస్క్‌ మధ్య గొడవలు అమెరికా ఆర్ధిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆ దేశ ఆర్ధికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరితేనే దేశానికి మంచిదంటున్నారు. అమెరికా ప్రజలు దేశంలో కొత్త పార్టీని కోరుకుంటున్నారని , ట్రంప్‌ను గెలిపించి తాను తప్పు చేశానని అంటున్నారు మస్క్‌. తాను కష్టపడితేనే ట్రంప్‌ విజయం సాధించాడని ఆయన చెప్పకుంటున్నారు. ఇప్పటికైనా ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని , జేడీ వాన్స్‌కు దేశ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని మస్క్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

ఎలాన్‌ మస్క్‌ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదంటున్న ట్రంప్

మస్క్‌ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి తన దగ్గర సమయం లేదంటున్నారు ట్రంప్‌. తాను చాలా బిజీగా ఉన్నానని , చైనా, రష్యా, ఇరాన్‌ సంబంధించిన విషయాలపై పనిచేస్తునట్టు చెప్పుకొచ్చారు. ఎలాన్‌ మస్క్‌ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని , ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నట్టు తెలిపారు. మస్క్‌ చాలా సబ్సిడీలు పొందారని , చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారని , దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవవసరం ఉందని ట్రంప్‌ ఓ హెచ్చరిక పంపించారు. మస్క్‌ లేకపోయినా తమ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.

ట్రంప్‌ను గెలిపించినందుకు, ట్రంప్‌ కోసం 2వేల కోట్ల డాలర్లు ఖర్చుపెట్టినందుకు తనకు లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్న బాధలో ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు. మస్క్‌ టెస్లా షేర్లు 50 శాతం దాకా పడిపోయాయి. ట్రంప్‌ ట్యాక్స్‌ వార్‌ కారణంగా టెస్లా కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయేలా ఉన్నాయి. ఓవైపు.. చైనా ఎలక్ట్రిక్‌ కార్ కంపెనీ BYDతో పోటీ పడదామనుకుంటే.. ట్రంప్‌ నిర్ణయాలతో సీన్‌ రివర్స్‌ అయింది. పోనీ.. ట్రంప్‌తో స్నేహం మంచి పేరు తీసుకొచ్చిందా అంటే అదీ లేదు. రేప్పొద్దున రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ట్రంప్‌తో స్నేహం చేసినందుకు చెడ్డపేరే వస్తుందనేది మస్క్‌ ఫీలింగ్‌. ఇన్ని కారణాలున్నాయ్‌ కాబట్టే.. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌ అయింది.

కొత్త పార్టీ దేశానికి అవసరం అంటున్న మస్క్‌

డెమోక్రాట్లు , రిపబ్లికన్లతో అమెరికన్లకు న్యాయం జరగడం లేదంటున్నారు మస్క్‌. కొత్త పార్టీ దేశానికి అవసరం అంటున్నారు. దీనిపై ‘ఎక్స్‌’ వేదికగా ఓటింగ్‌ నిర్వహించారు. 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ‘ది అమెరికా పార్టీ’ అంటూ ఆయన చేసిన పోస్ట్‌ సంచలనం రేపుతోంది. మస్క్‌ కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటూ అమెరికాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ట్రంప్‌- మస్క్‌ గొడవలతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో వేచి చూడాలి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయానికి తానే కారణమని మస్క్‌ చేసిన వ్యాఖ్యలను ట్రంప్‌ తప్పుపట్టారు. ఎవరి సాయం లేకుండానే తాను గెలిచినట్టు ప్రకటించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ(డోజ్‌) నుంచి తప్పించినందుకే మస్క్‌కు తనపై కోపంగా ఉందన్నారు.