మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (JeM) ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు ఉగ్ర సంస్థ కోలుకోలేని దెబ్బతింది భారీ నష్టాలను చవిచూసింది. తాజాగా కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టిన ఉగ్రవాదులు సరికొత్త నాటకానికి తెరలేపారు.

కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భీకర దాడికి దిగింది. ఈ వైమానిక ఆపరేషన్‌లో జైషే మహమ్మద్ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడుల్లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం సర్వనాశనమైంది. అతని తమ్ముడు, చెల్లెలు, సొంత కొడుకుతో పాటు మనవరాళ్లు కూడా మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి మసూద్ అజర్ బయటకు రావడానికి తీవ్రంగా భయపడుతున్నాడు.
మసూద్ అజార్ ఎక్కడ? అనారోగ్యమా లేక నాటకమా?
భారత దాడుల తర్వాత మసూద్ అజర్ జనాల కంట పడకుండా తలదాచుకున్నాడు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’ అతనిని అత్యంత రహస్య ప్రదేశంలో దాచి ఉంచింది. మసూద్ అజర్ ఆరోగ్యం బాగోలేక బయటకు రాకపోవడంపై పాకిస్తాన్ లో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని జైషే, ఐఎస్‌ఐ పక్కా ప్లాన్ వేసాయి. తాజాగా ‘సానుభూతి’ అస్త్రాన్ని వాడటం మొదలుపెట్టారు. మసూద్ అజర్ అనారోగ్యం, కుటుంబ సభ్యుల మరణాలను కొత్త రిక్రూట్మెంట్ల ముందు వివరిస్తున్నారు. అజర్ దేశం కోసం, సంస్థ కోసం ఎంతో ‘త్యాగం’ చేశాడని నమ్మిస్తున్నారు. ఆ నష్టానికి ప్రతీకారం తీర్చుకోవాలని యువతను ఉసిగొల్పుతున్నారు.
మరింత ప్రమాదకరంగా మసూద్ ప్రసంగాలు!
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌తో పోలిస్తే… మసూద్ అజర్ చాలా డేంజర్. అతని ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉంటాయి. అతను రాసిన పుస్తకాలు, ఆడియో టేపులను ఇప్పుడు యువతను బ్రెయిన్‌వాష్ చేయడానికి ఐఎస్ఐ వాడుతోంది . భారత్‌లో ఉన్న రహస్య మాడ్యూల్స్‌కు ఈ ప్రచార సామగ్రిని పంపుతోంది . మసూద్ అజర్ పేరుతో దాడులు చేయడానికి కొత్త రిక్రూటర్లు ఉత్సాహం చూపేలా ఐఎస్‌ఐ బ్రెయిన్‌వాష్ చేస్తోంది. ఈ వ్యూహం ద్వారా ఐఎస్‌ఐ రెండు విధాలుగా లబ్ధి పొందాలని చూస్తోంది. మసూద్ అజర్ పేరును ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చూడటం. భారత్‌లో ఏదైనా ఉగ్రదాడి జరిగితే, ఆ పాపం పాకిస్థాన్‌పై పడకుండా తప్పించుకోవడానికి ‘సింపథీ డ్రామా’ ఆడటం.
భారత నిఘా వర్గాలు ఈ కుట్రను ముందే పసిగట్టి, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టాయి. మరి ఈ సరికొత్త ప్రమాదాన్ని భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది!