ఎడారిలో తుఫాన్.. కుంభవృష్టితో వరద.. నీట మునిగిన దుబాయ్ నగరం..

భూమ్మీద వాతావరణ మార్పుల ప్రభావం ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతోంది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు తయారవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో కురవాల్సిన వర్షాలు.. ఒకట్రెండు రోజుల్లోనే ఆకాశానికి చిల్లుపడ్డ మాదిరిగా కుమ్మరించేసి వెళ్లిపోతున్నాయి. భారతదేశం వీటన్నింటినీ గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటోంది. రుతుపవనాల ఆధారంగా వర్షాలు కురిసే దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఎడారుల్లో సైతం వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయి.

ఎడారిలో తుఫాన్.. కుంభవృష్టితో వరద.. నీట మునిగిన దుబాయ్ నగరం..
Floods In Dubai
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Srikar T

Updated on: Apr 17, 2024 | 11:01 AM

భూమ్మీద వాతావరణ మార్పుల ప్రభావం ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతోంది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు తయారవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో కురవాల్సిన వర్షాలు.. ఒకట్రెండు రోజుల్లోనే ఆకాశానికి చిల్లుపడ్డ మాదిరిగా కుమ్మరించేసి వెళ్లిపోతున్నాయి. భారతదేశం వీటన్నింటినీ గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటోంది. రుతుపవనాల ఆధారంగా వర్షాలు కురిసే దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఎడారుల్లో సైతం వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే ఎడారులు ఏర్పడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఎడారుల్లో ఏకంగా తుఫాన్లు, కుండపోత వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరిగింది. ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత నగరం దుబాయ్‌లో ఈ పరిస్థితి తలెత్తింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో సతమతమయ్యే ఎడారి ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయిందంటేనే ఎంతో ఉపశమనం లభిస్తుంది. అలాంటి ఓ నాలుగు చినుకుల వర్షం పడితే వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఇప్పుడు దుబాయ్‌లో జరిగింది ఇది కాదు. ఆకాశం మేఘావృతం అయింది అనే కంటే.. మేఘాలన్నీ కట్టకట్టుకుని దండయాత్రకు వచ్చాయి. చిరుజల్లులు కాదు.. ఆకాశగంగకు చిల్లు పెట్టి దుబాయి నగరాన్ని వరదలో ముంచెత్తాయి. కొన్ని నిమిషాల వ్యవధిలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రోజు మొత్తమ్మీద కురిసిన వర్షం ఏకంగా 142 మిల్లీమీటర్లుగా లెక్కించింది. ఇది దుబాయ్ నగరం ఏడాది మొత్తంలో అందుకునే సగటు వర్షపాతం కంటే చాలా ఎక్కువ. ఏడాదికి సగటున అక్కడ కురిసే వర్షపాతం 94.7 మిల్లీమీటర్లు కాగా.. సోమవారం ఒక్కరోజే ఆ సంఖ్యను దాటి 142 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఒక్కసారిగా మారిన వాతావరణం, అది సృష్టించిన బీభత్సంతో దుబాయి నగరం చిగురుటాకులా వణికిపోయింది. తుఫాను గాలుల వేగానికి బాల్కనీల్లోని వస్తువులు గాలిపటాల మాదిరిగా ఎగిరిపోయాయి. వరద నీరు పోటెత్తి రోడ్లను ముంచెత్తింది. అంతేకాదు, ప్రపంచంలోనే రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నీట ముంచేసింది. అనేక అంతర్జాతీయ రూట్లకు ట్రాన్సిట్ పాయింట్‌గా మారిన దుబాయ్ విమానాశ్రయం.. అనేక విమానాలను దారిమళ్లించాల్సి వచ్చింది. రన్‌వే మీద ఉన్న విమానాలు పడవల్లా మారి నీటిపై తేలియాడాయి. తుఫాను వెలిసిన వెంటనే మళ్లీ సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ.. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ప్రకృతి వైపరీత్యం మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వరదనీటితో మునిగిపోయిన రన్‌వేలు, వాటిపై వెళ్తున్న విమానాలు, పార్కింగ్ బేలో నీటిలో నిలిచిన విమానాల దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయానికి చేరుకునే అన్ని రహదారులు కూడా నీట మునిగిపోయాయి. అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.

కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వంటి భవంతులు సైతం వరదనీటిలో మునిగిపోయాయి. బుర్జ్ ఖలీఫా వంటి ప్రపంచంలోనే ఎత్తైన భవనాన్ని మేఘాలు తాకాయి. భారీ ఉరుములతో కూడిన మెరుపులు ఆ భవనాన్ని తాకాయి. కొన్ని మెట్రో స్టేషన్లలో ఏకంగా మోకాలి లోతు వరకు వరదు నీరు చేరింది. అనేక నివాస ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ప్రకృతి వైపరీత్యం సృష్టించిన బీభత్సం కేవలం దుబాయి నగరానికి మాత్రమే పరిమితం కాలేదు, సమీపంలోనే ఉన్న బహ్రైన్ కూడా తుఫాను ధాటికి విలవిల్లాడింది. ఊహించని ఈ పరిణామాలతో షాక్ తిన్న అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ యంత్రాంగం దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. బుధవారం వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇంట్లో కూర్చుని పనిచేయగల ఉద్యోగాల విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంట్లో నుంచే పనిచేయాలని) ఆదేశాలు జారీ చేసింది.

దుబాయ్ కంటే ముందు ఒమన్ తీరాన్ని తాకిన తుఫాను కారణంగా ఆ దేశంలో 18 మంది మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 10 మంది పాఠశాల విద్యార్థులు కావడం విషాదకరం. ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది. యునైటెడ్ నేషన్స్‌కు సంబంధించిన COP28 సదస్సు నిర్వహించిన ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాలు వాతావరణ మార్పులపై హెచ్చరించాయి. భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఫలితంగా అతివృష్టి, భీకర తుఫాన్లు, వరదలు సంభవిస్తాయని తెలిపాయి. అన్నట్టుగానే ఆ రెండు దేశాలు ఇప్పుడు తీవ్రమైన వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని ఆంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..