డాల్ఫిన్స్ వేటతో రక్తసిక్తమవుతున్న జపాన్ సముద్ర తీరం
జపాన్ మరోసారి వివాదాస్పద డాల్ఫిన్ వేటను మళ్లీ ప్రారంభించింది. ప్రతి ఏడాది వేటాడినట్టే ఈ ఏడాది కూడా డాల్ఫిన్స్‌ను వేటాడేందుకు సిద్ధమయ్యారు జపాన్ వాసులు. 2009లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ది కోవ్ డాక్యుమెంటరీ చిత్రం తర్వాత జపాన్‌లో అత్యంత పాశవికంగా జరుగుతున్న డాల్ఫిన్ వేట గురించి ప్రపంచానికి బాగా తెలిసింది. అత్యంత దారుణంగా వేటాడిన డాల్ఫిన్‌లను మాంసాహారంగా వినియోగించడం ఒక వంతయితే మరికొన్ని ఎక్వేరియంలకు, మెరైన్ పార్కులకు తరలించి లాభాలను ఆర్జించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ […]
జపాన్ మరోసారి వివాదాస్పద డాల్ఫిన్ వేటను మళ్లీ ప్రారంభించింది. ప్రతి ఏడాది వేటాడినట్టే ఈ ఏడాది కూడా డాల్ఫిన్స్‌ను వేటాడేందుకు సిద్ధమయ్యారు జపాన్ వాసులు. 2009లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ది కోవ్ డాక్యుమెంటరీ చిత్రం తర్వాత జపాన్‌లో అత్యంత పాశవికంగా జరుగుతున్న డాల్ఫిన్ వేట గురించి ప్రపంచానికి బాగా తెలిసింది. అత్యంత దారుణంగా వేటాడిన డాల్ఫిన్‌లను మాంసాహారంగా వినియోగించడం ఒక వంతయితే మరికొన్ని ఎక్వేరియంలకు, మెరైన్ పార్కులకు తరలించి లాభాలను ఆర్జించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధమైన వేటపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చినా వాటిని జపాన్ లెక్కచేయడం లేదు. డాల్ఫిన్, తిమింగలాలను అత్యంత పాశవికంగా చంపడంతో తైజీ తీరప్రాంతం రక్త సిక్తంగా మారిపోతుంది.
ఈ ఏడాది వేటను తైజీ తీరప్రాంతంలో ఆదివారం ప్రారంభించారు. అయితే డాల్ఫిన్ వేటకు వెళ్లిన పడవలు ఖాళీగా తిరిగి వచ్చాయని జపాన్ మీడియా తెలిపింది. ఇదిలా ఉంటే పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ది డాల్ఫిన్ ప్రాజెక్టు తెలిపిన వివరాల ప్రకారం ఐదు రిస్సో డాల్ఫిన్లు చంపబడ్డాయని తెలుస్తోంది. ఈ సీజన్ మొత్తానికి దాదాపు 1,700 కంటే ఎక్కువ డాల్ఫిన్‌లను చంపాలని లేక బంధించాలనేది వీరి లక్ష్యం. అత్యంత క్రూరంగా చంపుతూ వాటి ఉనికినే లేకుండా చేస్తున్నారని జపాన్ పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తమ జీవితాలు ఈ విధమైన వేటమీద మాత్రమే ఆధారపడి ఉన్నాయని తైజీకి చెందిన మత్య్సకారుడొకరు చెప్పారు. ఒక సీజన్ మొత్తం ఆరు నెలల కాలంపాటు ఉంటుంది. ఒక సర్వేలో వెల్లడైన విషయాన్ని బట్టి గత ఏడాది నుంచి డాల్ఫిన్, తిమింగలాల మాంసానికి డిమాండ్ తగ్గుతూ వచ్చింది. దీనికి కారణం ఈ జంతువులలో పాదరసం ఉన్నట్టుగా తేలడమే. మరోవైపు తైజీలో సజీవంగా పట్టుకున్న డాల్ఫిన్‌లను మెరైన్ పార్కులకు విక్రయించడం కూడా ఈ డిమాండ్ తగ్గడానికి మరో కారణం. అయితే తైజీ నుంచి వచ్చిన డాల్ఫిన్‌లను కొనుగోలు చేయవద్దంటూ వివిధ పార్కుల్లో సైతం ఒత్తిడి పెరిగింది.
తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ తిమింగలాలు, డాల్ఫిన్ వేటను కొనసాగించడంపై జపాన్ విమర్శలను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ నిషేదం అమల్లో ఉన్నా వేటను మాత్రం ఆపలేదు. అంతర్జాతీయ తిమింగలం కమిషన్(ఐడబ్ల్యూసీ) నుంచి జపాన్ ఇదే విషయంలో వైదొలగింది. ఈ ఏడాది జూలై 1న తిమింగలాల వేట కోసం అనేక నౌకలు సముద్రంలో తిరుగుతూ ఉన్నాయి.