AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran – Israel War: ఇరాన్ అంతు చూస్తాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన.. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం..

ఇరాన్‌ పాలకులకు వార్నింగ్‌ ఇచ్చారు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు. ఇరాన్‌లో నిరంకుశ పాలనను అంతంచేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించారు. ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు చేసిన నెతన్యాహు.. తగిన గుణపాఠం చెబుతామని తేల్చిచెప్పారు. పోరాడతాం.. కచ్చితంగా గెలిచి తీరుతాం అన్నారు

Iran - Israel War: ఇరాన్ అంతు చూస్తాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన.. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం..
Iran Israel War
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2024 | 7:59 AM

Share

మరో యుద్ధం ప్రారంభమైంది.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ మెరుపు దాడి చేసింది. ఏకకాలంలో 102 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రభుత్వం గాల్లోనే సగం క్షిపణులను అడ్డుకున్నది.. పౌరులు షెల్టర్లలో ఉండాలని ప్రకటన జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో సైరన్ లు మోగాయి.. అంతా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లారు. బంకర్ల నుంచి బయటకు రావొద్దంటూ ్రభుత్వం ప్రకటించింది. ఒకవైపు ఇరాన్‌ మిస్సైల్స్‌… మరోవైపు టెర్రరిస్టుల కాల్పులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రభుత్వం.. ఇరాన్ ను ఇక ఎవ్వరూ కాపాడలేరంటూ ప్రకటించింది. ఈ క్రమంలో.. ఇరాన్‌ పాలకులకు వార్నింగ్‌ ఇచ్చారు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు. ఇరాన్‌లో నిరంకుశ పాలనను అంతంచేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించారు. తగిన గుణపాఠం చెబుతామని, పోరాడతాం.. కచ్చితంగా గెలిచి తీరుతాం అంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్‌ చర్యలు మొత్తం మధ్య ఆసియానే ప్రమాదంలోకి నెట్టేశాయి.. మధ్య ఆసియా మొత్తాన్ని.. ఇరాన్‌ యుద్ధంలోకి తీసుకొచ్చిందని.. ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ దాడులకు ఇరాన్‌ పర్యవసానాలు ఎదుర్కోక తప్పదంటూ పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇరాన్‌పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది ఇజ్రాయెల్.. తీవ్ర స్థాయిలో ఇరాన్‌ను హెచ్చరించిన ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్‌.. ఇరాన్‌పై విరుచుకుపడతామంటూ ప్రకటించారు. ఇరాన్‌తోపాటు మిడిల్‌ ఆసియా మొత్తం ఎటాక్స్‌ చేస్తామని ప్రకటించారు. ఇరాన్‌ వైపు నుంచి 180 మిస్సైల్స్‌ వచ్చినట్టు ప్రకటించిన ఇజ్రాయెల్‌.. దాదాపు అన్నింటిని మధ్యలోనే నిర్వీర్యం చేశామని ప్రకటించింది. క్షిపణుల్లో కొన్ని భూమిపైకి చేరుకుని విధ్వంసం సృష్టించాయని.. ఏ స్థాయిలో నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని ప్రకటించారు.

ఇరాన్‌ దాడిలో చనిపోయింది ఒక్కరేనని.. అది కూడా జెరికో పట్టణంలోని పాలస్తీనా వ్యక్తి అని ఇజ్రాయెల్‌ పేర్కొంది.. ఇరాన్‌ మిస్సైళ్లు ఏం చేయలేకపోయాయని.. ఇరాన్‌ ప్రమాదకర, విధ్వంసక దేశం అంటూ పేర్కొంది.. మిడిల్‌ ఈస్ట్‌లోనే కాదు, ప్రపంచ దేశాల అస్థిరతకు కారణం ఇరాన్‌ అంటూ పేర్కొంది..

ఇరాన్ అప్రమత్తం..

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో ఇరాన్‌ అలర్ట్ అయింది.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేని సురక్షిత ప్రాంతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు, ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్ హెచ్చరికలు చేశారు. ఇది శాంపిల్‌ మాత్రమే.. అసలు దాడులు త్వరలో ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. యుద్ధం ఇష్టం లేదు.. కానీ దేశ రక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై ఎటాక్‌ చేశామన్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమంటూ మసౌద్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమని.. తమ బలాన్ని తక్కువ అంచనా వేయొద్దంటూ మసౌద్ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ కు సాయం చేస్తాం..

దాడుల నేపథ్యంలో అమెరికా సైతం అప్రమత్తమైంది.. ఇప్పటికే మద్దతు ప్రకటించిన అమెరికా.. తమ సైన్యం కూడా యుద్ధభూమిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు ఎలాంటి సాయాన్నైనా అందిస్తామని ప్రకటించింది. వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహారిస్‌తో చర్చించిన అధ్యక్షుడు బైడెన్‌.. ఇజ్రాయెల్ కు సాయం చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌ను కాపాడటానికి యూఎస్‌ మిలటరీ సహాయ పడుతుందన్నారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు అమెరికా ట్రాక్‌ చేస్తోందని చెప్పారు. దాడుల నేపథ్యంలో పలు యూరప్‌ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతున్నాయి. బ్రిటన్‌, ఆస్ట్రేలియా ఇజ్రాయెల్ కు మద్దతు తెలిపారు.

ఐక్యరాజ్యసమితి అలర్ట్..

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంపై ఐక్యరాజ్యసమితి అప్రమత్తమైంది. ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర భేటీ అవుతోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ జరిపిన మిసైల్‌ దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంపై చర్చించబోతోంది భద్రతామండలి. రెండు పక్షాల మధ్య పోటాపోటీ హెచ్చిరకలు, ప్రకటనల నేపథ్యంలో భద్రతామండలి ఏం చెబుతుందో అన్నది కీలకంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..