వామ్మో..! ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై దాడికి ఇజ్రాయెల్ స్కెచ్.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌కు అన్ని దిక్కుల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌కు అన్ని దిక్కుల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. మరోవైపు ఇరాన్‌పై ప్రతీకారానికి ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది. ఇరాన్ భూభాగంలో ఉన్న ఆ దేశ అణు స్థావరాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతోందా? సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా? ఓవైపు రష్యా-యుక్రెయిన్.. మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్.. ప్రపంచం యుద్ధంలోకి దిగిపోయినట్లేనా? అని ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ మిస్సైళ్ల దాడులతో, ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగులుతోంది. రివెంజ్ తీర్చుకోవడానికి ఎదురుచూస్తోంది. అయితే అవి ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనేది టెన్షన్ రేపుతోంది. ఇరాన్‌లోని చమురు, సహజవాయువు క్షేత్రాలు, అణు స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకోనుందని సమాచారం. ఇరాన్‌ని ఆర్థికంగా, సైనికపరంగా దెబ్బతియ్యడం లక్ష్యం. ఇరాన్‌లో ఏ ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయనుందన్న ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పుట్టిస్తోంది.
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అమెరికా సలహా పాటిస్తారా? లేక పశ్చిమాసియా యుద్ధ వాతావరణం సృష్టిస్తారా? నెతన్యాహు వైఖరి చూస్తే మాత్రం బైడెన్ మాటలు పట్టించుకునేలా లేదనిపిస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయిల్ కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రతి దాడులు ప్రొఫెషనల్‌గా ఉండాలి తప్పా.. న్యూక్లియర్ సైట్స్ వరకు వెళ్ల వద్దని యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ పదేపదే నెతన్యాహూకి చెబుతున్నారు. లేటెస్ట్ ఫోన్ కాల్ లో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చిందని -THE POLITICO తన కథనంలో పేర్కొంది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం సృష్టించవద్దని బైడెన్ నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. నెతన్యాహు వినిపించుకోలేదంటోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని జీ7 దేశాధినేతలు ఖండించారు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. దాన్ని మాత్రం తాము సమర్థించబోమన్నారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్. ఇరాన్ తన పరిధులను దాటిందని, ఆ దేశంపై ఆంక్షలు విధిస్తామన్నారు. ఇదిలావుంటే, నెతన్యాహు ఇదే దూకుడుతో ఇరాన్‌పై ఎటాక్ చేస్తే.. యుద్ధం డిక్లేర్ చేసినట్టే! అంటున్నారు విశ్లేషకులు.
మరోవైపు లెబనాన్ సరిహద్దు గ్రామాల్లో ఇజ్రాయెల్ బలగాలకు, హెజ్బుల్లా ఫైటర్స్‌కు మధ్య భీకర పోరు జరుగుతోంది. హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర పోరాటం చేస్తోంది. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లాతో జరిగిన పోరులో ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. ఒకవైపు లెబనాన్‌లో.. మరోవైపు గాజా, సిరియాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. ఇరాన్ మిస్సైళ్ల దాడి తరువాత తమ దేశానికి విమానాల రాకపోకలను నిలిపివేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. వేలాదిమంది బంకర్లలో తలదాచుకుంటున్నారు.
ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమసిపోనేలేదు. ఆణుబాంబులు ప్రయోగిస్తామంటూ ఇరు దేశాలు తొడలు కొడుతున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్‌లు మిసైళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు అమెరికా, నాటో దేశాల మద్దతు, అలాగే ఇరాన్‌కు రష్యాతో పాటు అమెరికా వ్యతిరేక శక్తుల మద్దతు ఉంటుందనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధం దిశగా దారి తీస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమనే టాక్ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ వరల్డ్ వార్ 3 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.
గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా నుంచి హమాస్ జరిపిన దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హమాస్‌కు అండగా లెబనాన్ కేంద్రంగా పని చేసే హెజ్బొల్లా, యెమెన్ నుంచి పని చేసే హౌతీలు, ఇరాక్, సిరియా నుంచి మిలీషియాలు ఇజ్రాయెల్‌పై దాడులు జరుపుతున్నాయి. ఈ మొత్తం సంస్థలకు ఇరాన్ మద్దతు ఉందనేది ఇజ్రాయెల్ ఆరోపణ. ఇంతకాలం హమాస్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకొని గాజాపై భారీగా దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. అయితే, ఇంతకాలం ఇజ్రాయెల్ వ్యతిరేక సంస్థలను వెనకుండి నడిపించిన ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది. దీంతో ఇప్పుడు పశ్చిమాసియాలో అధికారికంగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది.
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఏ దేశం ఎవరి వైపు నిలవనున్నది అనే అంశం కీలకంగా మారింది. ఇజ్రాయెల్‌కు ప్రధాన మద్దతు అమెరికా నుంచి ఉంది. ఇరాన్ క్షిపణులను కూల్చేయాలని ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలను పంపిస్తోంది. యూకే, ఫ్రాన్స్‌తో పాటు నాటో దేశాల మద్దతు కూడా ఇజ్రాయెల్‌కు ఉండనుంది. ఇక, ఇరాన్‌కు సిరియా, లెబనాన్, యెమెన్ మద్దతు ఉంది. ఈజిప్ట్, టర్కీ కూడా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదికి చేరుకున్నప్పటికీ సమీప భవిష్యత్తులో యుద్ధానికి ముగింపు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ క్షిపణులు అందించాలనే యూకే నిర్ణయంపై రష్యా ఆగ్రహంగా ఉంది. తమ అణు విధానాన్ని మార్చుకుంటామని ఆ దేశం పదేపదే అమెరికా, నాటో దేశాలను హెచ్చరిస్తోంది. రష్యాకు పరోక్షంగా చైనా, ఉత్తర కొరియా మద్దతు ఉంది. ఇరాన్‌తోనూ రష్యాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, దాని మిత్ర దేశాలపై ఆగ్రహంగా ఉన్న రష్యా కనుక ఇరాన్‌కు మద్దతుగా నిలిస్తే మూడో ప్రపంచ యుద్ధానికి మరింత చేరువైనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టార్గెట్ 1 – ఇరాన్ ఆయువు పట్టు
- చమురు, సహజ వాయువు క్షేత్రాలు
- ప్రపంచం మొత్తంలో పది శాతం క్రూడాయిల్ ఉత్పత్తి
- 15 శాతం సహజ వాయువు ఉత్పత్తి
- 10 ప్రధాన క్రూడాయిల్ ఫీల్డ్స్
- డైలీ 2.4 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి
- 3 ప్రధాన ఆయిల్ రిఫైనరీలు
- ఇస్ఫాహన్ ప్లాంట్ – 3 లక్షల 70 వేల బ్యారెల్స్
- అబాదన్ రిఫైనరీ – 3 లక్షల 60 వేల బ్యారెల్స్
- బందర్ అబ్బాస్ – 3 లక్షల 20 వేల బ్యారెల్స్
టార్గెట్ – 2 ఇజ్రాయెల్
- * నటాంజ్ న్యూక్లియర్ సైట్
- అత్యంత రహస్యంగా నిర్మించిన అణు స్థావరం
- అండర్ గ్రౌండ్ ఫ్యూయెల్ ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్
- భూమిలో 3 అంతస్తుల దిగువన ఉంటుంది
- అణుబాంబుల్లో ఉపయోగించే యురేనియం శుద్ధి చేస్తారు
- 50 వేల సెంట్రిఫ్యూజ్‌లలో 11 వేలు పని చేస్తున్నాయి
- ఫోర్డో న్యూక్లియర్ సైట్
- క్వామ్ ప్రాంతంలో ఉండే అణు స్థావరం
- కొండను తొలిచి దీనిని నిర్మించారు
- ఇస్ఫాహన్ న్యూక్లియర్ సైట్
- ఇస్ఫాహన్ నగరం శివార్లలో ఉంటుంది
- ఫ్యూయెల్ ప్లేట్ ఫాబ్రికేషన్, యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ
- న్యూ క్లియర్ బాంబ్ తయారీకి ఉపయోగించే పరికరాలు
ఇవే కాకుండా, ఖొండాబ్, టెహ్రాన్ రీసెర్చ్ సెంటర్, బుషెహర్ లాంటి అణు స్థావరాలు కూడా ఉన్నాయి.
మరోవైపు, మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు షాక్ ఇచ్చాయి. భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇండెక్స్ డెరివేటివ్‌ల కొత్త రూల్స్ సహా పలు కారణాలతో.. సూచీలు మదుపర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. కొన్ని గంటల్లోనే మదుపర్లు దాదాపు 11 లక్షల కోట్లు నష్టపోయారు. ఇటు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన మదుపర్లను వెంటాడుతోంది. ముడిచమురు ధరలు పెరగడం కూడా ఇన్వెస్టర్ల భయానికి మరో కారణంగా తెలుస్తోంది.
యుద్ధం ఏ దేశానికీ మంచిది కాదు. యుద్ధంలో ఎవరు గెలిచినా రెండు దేశాలు నష్టపోవాల్సి వస్తుంది. నిజానికి, ఒక యుద్ధం కోసం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ సమయంలో, బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం ప్రారంభిస్తాయి. బంగారాన్ని ఎల్లప్పుడూ ఎమర్జెన్సీకి తోడుగా పరిగణిస్తారు. అలాంటిదే మరోసారి కనిపిస్తోంది. ఇజ్రాయెల్-ఇరాన్ టెన్షన్ మధ్య ఒక్క రోజులో బంగారం ధర రూ.1500 పెరిగింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలలో సుమారు 21 శాతం పెరుగుదల కనిపించింది. అంటే రూ.13 వేలకు పైగా పెరిగింది. గత ఒక నెలలో, ఇజ్రాయెల్‌తో మధ్యప్రాచ్య సంబంధాలు క్షీణించాయి. ఈ క్రమంలో పది గ్రాముల బంగారం ధర రూ.72,071 ఉండగా, నెల రోజుల్లో రూ.76,250కి పెరిగింది. అంటే గత నెలలో దాదాపు 4,200 పెరుగుదల కనిపించింది.
ఇజ్రాయిల్ – హమాస్, హెజ్‌బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడటంతో వార్ ఇక పీక్ స్టేజీకి చేరుకున్నట్లయింది. పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి