World Meditation Day 2024: ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
World Meditation Day 2024: మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ధ్యానం ఎంతో మేలు చేస్తుంది. దీన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు నేడు మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధ్యానం మానసిక వికాసానికి ఎలా దోహదపడుతుందో ఇప్పుడు చూద్దాం..
Benefits of Meditation: ధ్యానం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వానికి సహకరిస్తుంది. రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందించే ధ్యానం ప్రాధాన్యం గుర్తించిన ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 21ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ఈ క్రమంలో నేడు తొలి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐరాస నిర్వహించే ప్రతి దినోత్సవానికి ఏటా ఒక నేపథ్యం (థీమ్)ను ఎంచుకుంటారు. ఈ ఏడాది మెడిటేషన్ డే థీమ్‌గా ‘ఇన్నర్ పీస్-గ్లోబల్ హార్మోని’ (అంతర్గత శాంతి- ప్రపంచ సామరస్యం)ను నిర్ణయించారు.
ఎలా ప్రారంభమైంది?
2024 నవంబర్ 29న జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేశారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంపొందించడంతో పాటు ఉన్నత మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఆస్వాదించడం ప్రతి ఒక్కరి హక్కు అని గుర్తు చేసుకోవడానికి ఈ రోజును యూఎన్ఓ ప్రకటించింది. ధ్యానం, యోగా ఆరోగ్యానికి, శ్రేయస్సుకు పరిపూర్ణమైన విధానాలుగా గుర్తించింది.
ఐరాస ప్రధాన కార్యాలయంలో భారత్ వేడుక
ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ధ్యానం అంటే ఏంటి?
భారత్‌లో పురాతన కాలం నుంచి ధ్యానాన్ని సాధన చేస్తున్నారు. నేటి యుగంలో మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత వికాసం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ధ్యానం ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. ధ్యానం అంటే ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించి ప్రశాంతంగా ఉండటం. ఏకాగ్రతతో ఒకే అంశంపై ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. నిరాశ, ఆందోళనలతో పోరాడానికి సాయపడుతుంది. ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. తద్వారా శారీరక సాంత్వన కూడా కలుగుతుంది.
ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ధ్యానంతో అనేక మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీనిని సాధన చేస్తున్నారు. ముఖ్యంగా మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ద్వారా మానసిక, శారీరకంగా మెరుగుదల ఉంటుంది. డబ్ల్యూహెచ్‌వో ధ్యానాన్ని ముఖ్యమైన కోపింగ్ మెకానిజం (ఒత్తిడిని జయించే ప్రక్రియ)గా గుర్తించింది.