అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం ఆగుతుందని ప్రకటన..
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరేలా కనిపించడం లేదు. అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడమే కాకుండా.. వాషింగ్టన్‌కు 5 కఠిన షరతులను విధించింది. మోసం చేయడం అమెరికాకు అలవాటు అంటూ ఇరాన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఇరాన్ పెట్టిన ఆ 5 డిమాండ్లు ఏంటి? అనేది తెలుసుకుందాం..

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన 15 అంశాల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తమ షరతులు నెరవేరే వరకు అమెరికాకు బిగ్ షాకులు ఇస్తూనే ఉంటామని శపథం చేసింది. ఇరాన్ సీనియర్ అధికారులు ప్రెస్ టీవీతో మాట్లాడుతూ.. గతంలో జెనీవా చర్చల సమయంలో అమెరికా తమను రెండుసార్లు మోసం చేసిందని ఆరోపించారు. వాషింగ్టన్‌కు శాంతి పట్ల నిజమైన ఉద్దేశం లేదని, కేవలం తమ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనలు చేస్తోందని టెహ్రాన్ తెలిపింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28న జరిగిన దాడుల తర్వాత అమెరికాను నమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
ఇరాన్ ప్రధానంగా ఐదు డిమాండ్లు ఇవే
దురాక్రమణకు ముగింపు: అమెరికా మరియు ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు, హత్యలు తక్షణమే ఆగిపోవాలి.
భవిష్యత్తు రక్షణ హామీ: ఇరాన్‌పై మళ్లీ ఎప్పుడూ ఇలాంటి సైనిక దాడులు జరగవని పటిష్టమైన అంతర్జాతీయ హామీ ఉండాలి.
యుద్ధ పరిహారం: యుద్ధం వల్ల ఇరాన్ ఆస్తిపాస్తులకు, ప్రాణాలకు జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ స్పష్టమైన పరిహారం చెల్లించాలి.
ప్రాంతీయ శాంతి: కేవలం ఇరాన్‌తోనే కాకుండా ఈ ప్రాంతంలోని అన్ని ప్రతిఘటన సమూహాలపై దాడులు నిలిపివేయాలి.
హోర్ముజ్ సార్వభౌమాధికారం: హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ చట్టపరమైన సార్వభౌమాధికారాన్ని అధికారికంగా గుర్తించాలి.
ఫిబ్రవరి 28 దాడుల సెగ
2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో భారీ దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నత స్థాయి సైనిక అధికారులు మరణించారు. అప్పటి నుండి ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. అమెరికా ప్రతిపాదనలు క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఇరాన్ అభివర్ణించింది. క్షేత్రస్థాయిలో తమ పైచేయి సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం అమెరికా ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ ద్వారా చర్చలు జరుపుతున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తన పంతం వీడటం లేదు. హోర్ముజ్ జలసంధి గుండా కేవలం అపాయం లేని నౌకలను మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తాజాగా ప్రకటించడం అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది.
