Andhra Pradesh: నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడారు.. అంతలోనే ఊహించని ఘటన..
అందరూ స్నేహితులు.. ఒకే దగ్గర చదువుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ బాల విద్యార్ధులంతా కలిసి సరదాగా ఈతకు వెళ్లారు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ సరదా కాస్తా తీరని విషాదంగా మారింది. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి తాము మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు ఓ ఇద్దరు విద్యార్ధులు..

అందరూ స్నేహితులు.. ఒకే దగ్గర చదువుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ బాల విద్యార్ధులంతా కలిసి సరదాగా ఈతకు వెళ్లారు.. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ సరదా కాస్తా తీరని విషాదంగా మారింది. నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి తాము మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు ఓ ఇద్దరు విద్యార్ధులు… ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు గ్రామ శివారులోని నీటి గుంట వద్దకు ఈతకు వెళ్లారు. నీటి లోతు తెలియక ఆకాష్, ప్రశాంత్, అఖిల్ అనే ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా మునిగిపోసాగారు. వారి ఆర్తనాదాలు విన్న మిగిలిన ఇద్దరు స్నేహితులు మణిపాల్ (9వ తరగతి), వెంకట జయ చరణ్ (8వ తరగతి) ఏమాత్రం ఆలోచించలేదు. తమ ప్రాణాల కంటే స్నేహితుల ప్రాణాలే మిన్న అనుకున్నారు. వెంటనే నీటిలోకి దూకి, పోరాడి ఆ ముగ్గురినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ, దురదృష్టవశాత్తూ.. ఆ క్రమంలో అలసిపోయిన ఈ ఇద్దరు ‘బాల హీరోలు’ అదుపు తప్పి నీటిలో మునిగిపోయారు. చూస్తుండగానే మణిపాలు, జయ చరణ్ అనంత వాయువుల్లో కలిసిపోయారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు పరుగులు తీశారు. అప్పటికే విగతజీవులుగా పడి ఉన్న విద్యార్థులను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. “నాయనా.. స్నేహితులని కాపాడి నువ్వు వెళ్లిపోయావా?” అంటూ తల్లులు చేస్తున్న రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. సమాచారం అందుకున్న అద్దంకి రూరల్ సిఐ, కొరిశపాడు ఎస్ఐ, తహసీల్దార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న వయసులోనే ప్రాణాలకు తెగించి స్నేహితులను కాపాడిన ఈ విద్యార్థుల సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటే, వారు లేరన్న నిజం ఎర్రబాలెం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
