గొప్ప కళాకారుడు.. మంచి కమెడియన్.. కానీ ఆ మిస్టేక్ కారణంగా.. తీవ్ర యాతనతో..
మిమిక్రీ మూర్తి (కొమ్ము నర్సిమూర్తి) సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు, మిమిక్రీ కళాకారుడు. ఆయన జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టి, తనదైన అనుకరణలు, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఆయన స్వస్థలం హనుమకొండ జిల్లా, పరకాల మండలం, నాగారం..

తెరపై నవ్వులు పూయించి, అద్భుతమైన మిమిక్రీ ప్రదర్శనలతో, బుర్ర కథలతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరించిన ప్రముఖ హాస్యనటుడు మిమిక్రీ మూర్తి ప్యాంక్రియాస్ సమస్యలతో కారణంగా 2022లో ఈ లోకాన్ని వీడారు. తాను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై ఆయన.. ఆ సమయంలో ఓ ఎమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మిమిక్రీ మూర్తి తన సుదీర్ఘ కెరీర్‌లో సుమారు 3000 స్టేజ్ షోలు, 250 జబర్దస్త్ ఎపిసోడ్‌లు, దాదాపు 60 సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. అయితే, 2019లో తనకు క్లోమ గ్రంథి (ప్యాంక్రియాస్) సమస్య మొదలైందని, ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేయడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయని అప్పుడు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ తన చికిత్సకు ఆటంకం కలిగించిందని, అదే సమయంలో ఆర్థికంగానూ ఇబ్బందులు పడినట్లు వివరించారు. ఈ ఆరోగ్య సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో, ఒక డాక్టర్ సూచన మేరకు అధిక మోతాదులో (10,000 mg బదులు 25,000 mg) మందులు వాడటం వల్ల తన శరీరం నుంచి కొవ్వు కరిగి, అనూహ్యంగా బరువు తగ్గానని పేర్కొన్నారు. క్లోమ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక, బరువు తగ్గడం సాధారణమని ఆయన వెల్లడించారు. అనుకోకుండా తగ్గిన బరువు, తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లు తనను మానసికంగా ఎంతో వేదనకు గురిచేశాయని మూర్తి చెప్పారు. మిమిక్రీ మూర్తి బాలేడు, చివరి దశలో ఉన్నాడు, బ్రతకడం కష్టం అంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రచారం కావడంతో మరింత కుంగిపోయానని తెలిపారు. అయితే, ఈ కష్టకాలంలో సినీ పరిశ్రమతో పాటు పలువురు కళాకారులు తనకు అండగా నిలిచారని మూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా తనను ఎంతో ఆదుకున్నారని, ఆమెను మహాతల్లిగా అభివర్ణించారు. అలాగే, మిమిక్రీ కళాకారుల సంఘం, చంద్రముఖి చంద్రశేఖర్ వంటి మిత్రులు తన వైద్య చికిత్సకు, ఆర్థిక సహాయానికి పెద్దఎత్తున కృషి చేశారని ప్రశంసించారు. సమాజంలో ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే, అతని పరిస్థితిని అర్థం చేసుకోకుండా అతను అయిపోయాడు అని తీర్పునివ్వడం సరైంది కాదని మూర్తి అభిప్రాయపడ్డారు.
మిమిక్రీ మూర్తి, జబర్దస్త్ షో తో పాటు ఎన్నో వేదికలపై తన ప్రదర్శనలతో మంచి కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఎవరినైనా అనుకరించే టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. కొన్నేళ్లు మూర్తి ప్యాంక్రియాస్ సమస్యతో తీవ్ర యాతన పడ్డారు. ఈ మహమ్మారి నుండి బయటపడటానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో చివరికి ప్రాణాలు వదిలారు. 2018 వరకు బుల్లితెరపై చురుకుగా ఉన్న మూర్తి, ఆ తర్వాత ప్యాంక్రియాస్ క్యాన్సర్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత 3 సంవత్సరాలలో తన వైద్యం కోసం దాదాపు 16 లక్షలు ఖర్చు చేశారు. చాలామంది దాతలు కూడా ఆయన అనారోగ్యం గురించి తెలుసుకొని తమకు చేతనైన సాయం అందించారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆయన 48 ఏళ్ల వయసులో 2022 సెప్టెంబర్ 27న కన్నుమూశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
