Indonesia Accident: విహారయాత్రకు వెళ్లి తిరిగొస్తుండగా ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం..
సురబాయకు చెందిన ప్రయాణికులంతా మధ్య జావాలోని ప్రముఖ పర్వత ప్రాంతమైన డీంగ్ పీఠభూమికి విహార యాత్రకు వెళ్లి తిరిగొస్తున్నారు.
Indonesia Accident: ఇండోనేషియాలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా 15 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇండోనేసియాలోని మోజోకెర్టో జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. సురబాయకు చెందిన ప్రయాణికులంతా మధ్య జావాలోని ప్రముఖ పర్వత ప్రాంతమైన డీంగ్ పీఠభూమికి విహార యాత్రకు వెళ్లి తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న బస్సు సోమవారం ఉదయం మోజోకెర్టో వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 10 మంది వరకు మరణించారని.. మిగిలిన వారు ఆసుపత్రులకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఇంకా 16 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని సమీపంలోని నాలుగు ఆస్పత్రులకు తరలించారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారికి ప్రస్తుతం చికిత్స అందుతుందని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయని.. కోలుకున్న తర్వాత అసలు విషయం తెలుస్తుందని సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారి జిన్హువా వార్తా సంస్థకు తెలిపారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: