Indian Economy: జయహో భారత్.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ.. బ్రిటన్ ను వెనక్కినెట్టి..
Indian Economy: కరోనా కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతో క్షిణించాయి. ఒక్కసారిగా వృద్ధిరేటు పడిపోయింది. దీనికి భారత్ కూడా అతీతం కాదు. లాక్ డౌన్ కారణంగా వివిధ రంగాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. అయినప్పటికి..
IMF Report: కరోనా కారణంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతో క్షిణించాయి. ఒక్కసారిగా వృద్ధిరేటు పడిపోయింది. దీనికి భారత్ కూడా అతీతం కాదు. లాక్ డౌన్ కారణంగా వివిధ రంగాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. అయినప్పటికి.. కోవిడ్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు కేంద్రప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలోపడుతోంది. ముఖ్యంగా ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా కోవిడ్ కారణంగా క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తోంది.
తాజాగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్- IMF నివేదిక ప్రకారం భారత ఆర్థికవ్యవస్థ బ్రిటన్ కంటే మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ.. పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలకు ధీటుగా నిలుస్తూ గట్టిపోటీనిస్తోంది. అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు క్రమంగా క్షిణిస్తుండగా.. భారత ఆర్థిక వ్యవస్థమాత్రం కరోనా అనంతరం గాడిలోపడుతోంది. చాలా దేశాల్లో వృద్ధిరేటు క్రమంగా తగ్గుతుండటంతో అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొంది. శ్రీలంక వంటి పరిస్థితులు ఇప్పటికే చాలా దేశాల్లో కన్పిస్తున్నాయి. ఈదశలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈఏడాది 7%నికి మించి ఉంటుందని IMF అంచనావేస్తోంది. బ్రిటన్ కంటే భారత్ మెరుగైన స్థానానికి చేరుకుని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఆస్థానాన్ని కోల్పోయి ఆరోస్థానంలో కొనసాగుతోంది. సుమారు రెండు శతాబ్ధాల పాటు బ్రిటన్ వలస పాలనలో ఉన్న భారత్ ప్రస్తుతం ఐదో అతిపెద్ది ఆర్థిక వ్యవస్థగా ఎదగడం చెప్పుకోదగ్గ విషయం.
IMF గణాంకాలు చూస్తే 2021 డిసెంబర్ నాటికే భారత ఆర్థిక వ్యవస్థ ఈస్థాయికి చేరుకుంది. ఈఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ఎదిగి 85,407 కోట్ల డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 81,600 కోట్ల డాలర్లుగా భారత్ తరువాతి స్థానంలో ఉంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. భారత్ మాత్రం తన వృద్ధిరేటును మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎదగడం దేశ ఆర్థిక రంగంలో శభసూచికంగా చెప్పుకోవచ్చు. GDP పరంగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక సమస్యలు, రాజకీయ మార్పులతో బ్రిటన్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. యూకేలో కొత్త ప్రధాని ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో బ్రిటన్ కు కొత్త ప్రధాని రానున్న విషయం తెలసిందే. ప్రధానంగా లిస్ ట్రస్, భారత సంతతికి చెందిన రిషి సునక్ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికి.. లిస్ ట్రస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కొత్త ప్రధాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..