ఒకప్పుడు మన రాజులు వాడిన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి సిద్ధం! ధర అంచనాకే ఫీజులు ఎగిరిపోతాయ్..!
గోల్కొండ గనుల నుండి వచ్చిన అరుదైన 23.24 క్యారెట్ల గోల్కొండ బ్లూ వజ్రం మే 14న జెనీవాలో క్రిస్టీస్ వేలంలో అమ్మకానికి రానుంది. ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఉండి, ప్రముఖ ఆభరణాల వ్యాపారులచే రూపొందించబడిన ఈ వజ్రం 35 నుండి 50 మిలియన్ డాలర్ల మధ్య ధర పలుకుతుందని అంచనా.

భారతదేశ రాచరిక గతానికి సంబంధించిన అద్భుతమైన అవశేషం మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజులు వాడిన అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం.. మే 14న జెనీవాలో జరిగే క్రిస్టీస్ ‘మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’ వేలంలో అమ్మకానికి రానుంది. 23.24 క్యారెట్ల బరువు కలిగి, ప్రఖ్యాత పారిసియన్ ఆభరణాల వ్యాపారి JAR చే సొగసైన, సమకాలీన ఉంగరంలో అమర్చబడిన ఈ రత్నం 35 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్ల ( మన కరెన్సీలో సుమారు రూ. 300 కోట్ల నుండి రూ. 430 కోట్ల వరకు) ధర పలుకుతుందని క్రిస్టీస్ తెలిపింది. “ఎంతో ప్రాముఖ్యత కలిగిన అసాధారణమైన గొప్ప రత్నాలు జీవితకాలంలో ఒకసారి మాత్రమే మార్కెట్లోకి వస్తాయి. “రాజ వారసత్వం, ఎంతో ప్రత్యేకమైన రంగు, పరిమాణంతో ‘గోల్కొండ బ్లూ’ నిజంగా ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలి వజ్రాలలో ఒకటి” అని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు.
గోల్కొండ బ్లూ చరిత్ర
గోల్కొండ వజ్రాల వారసత్వం 4వ శతాబ్దపు సంస్కృత రాతప్రతిలో లభించే సూచనతో ప్రారంభమవుతుంది. 327 BCలో, అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశం నుండి యూరప్‌కు వజ్రాలను తీసుకెళ్లారు. ఈ అరుదైన రత్నాలకు పశ్చిమ దేశాలు ఫిదా అయిపోయాయి. 1292 AD నాటికి మార్కో పోలో తన ప్రయాణ రచనలలో భారతీయ వజ్రాల అందాన్ని వర్ణించాడు. ఈ వజ్రం మూలాలు నేటి తెలంగాణలోని ప్రఖ్యాత గోల్కొండ గనుల్లోనే ఉన్నాయి. 20వ శతాబ్దపు అత్యంత స్టైలిష్, ముందుచూపు గల భారతీయ పాలకులలో ఒకరైన ఇండోర్ మహారాజా యశ్వంత్ రావు హోల్కర్ II విలువైన సేకరణలో భాగమైన ఈ వజ్రాన్ని మొదట 1923లో ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి చౌమెట్ ఒక బ్రాస్‌లెట్‌లో అమర్చారు.
1930ల నాటికి మహారాజు అధికారిక ఆభరణాల వ్యాపారి మౌబౌసిన్ ఈ వజ్రాన్ని ఒక గొప్ప హారంలో చేర్చారు. ఇండోర్ పియర్స్‌తో కలిసి రాజ సేకరణ అద్భుతమైన పునర్నిర్మాణంలో చేర్చారు. 1947లో ఆ వజ్రం అమెరికాకు చేరుకుంది. దీనిని ప్రముఖ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశారు. అతను దానిని సమాన పరిమాణంలో తెల్లటి వజ్రంతో జత చేసిన బ్రూచ్‌గా రూపొందించారు. ఆ తర్వాత భారతీయ ప్రభువులకు తిరిగి వచ్చింది, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ముందు బరోడా రాజకుటుంబ నిధిలో భాగమైంది. ఇప్పుడు, ది గోల్కొండ బ్లూ తన తదుపరి అధ్యాయానికి సిద్ధమవుతోంది. జెనీవాలోని ఫోర్ సీజన్స్ హోటల్ డెస్ బెర్గ్యుస్‌లో వేలం వేదిక నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరచనుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.