ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లొట్టలేసుకొని తింటున్నారా..? మీ వెన్నులో వణుకుపుట్టించే వార్త ఇది…!

మీకు లిక్కర్‌కి బానిసలైన వారి గురించి మనకు తెలుసు. సిగెరట్‌ లేకపోతే నాలిక లాగేస్తుందన్న తెగ బాధపడే పెద్ద మనుషుల గురించి మనకు తెలుసు.. ఇక డ్రగ్స్‌కు బానిసలై కన్ను, మిన్ను కానక చివరకు కటకటాలపాలైన పెద్దల గురించి మనకు తెలుసు. కానీ ఫాస్ట్ ఫుడ్స్‌కి బానిసలైన వారి గురించి ఎప్పుడైనా విన్నారా..?

ఫాస్ట్ ఫుడ్స్,  జంక్ ఫుడ్స్ లొట్టలేసుకొని తింటున్నారా..?  మీ వెన్నులో వణుకుపుట్టించే వార్త ఇది...!
ఫాస్ట్ ఫుడ్స్‌ తినకుండా ఉండలేకపోతున్నారా?
Follow us
Ravi Panangapalli

| Edited By: TV9 Telugu

Updated on: May 06, 2024 | 11:26 AM

24 ఏళ్ల కుమార్..(వ్యక్తిగత గోప్యత దృష్ట్యా పేరు మార్చాం) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో బిజినెస్ గ్రాడ్యూషన్ చేస్తున్నాడు. రోజల్లా క్లాసులు, ఆపై ప్రాజెక్టు వర్క్స్‌తో క్షణం తీరిక లేకుండా గడిపే కుమార్… ఆకలేస్తే ఆన్ లైన్లో పిజ్జా ఆర్డర్ చెయ్యడమో.. లేదంటే క్యాంటీన్ కెళ్లి ఓ కూల్ డ్రింక్ తాగి, చిప్స్ తినేసి కడుపునింపుకోవడమో చెయ్యడం కొద్ది రోజులుగా సర్వ సాధారణమైపోయింది. కారణం అడిగితే క్షణం తీరిక లేకపోవడం ఒకటైతే… అవి నోటికి రుచిగా అనిపించడం కూడా రెండోది అంటారాయన.

” నాకుండే బిజీ షెడ్యూల్లో రెడీ టు ఈట్ ఫుడ్ బెస్ట్ అనిపిస్తోంది. పైగా పెద్దగా కష్టబడకుండానే హాయిగా తినేయచ్చు. ఖర్చు కాస్త ఎక్కువే అయినప్పటికీ.. సమయం కలిసొస్తుంది కదా..!” — కుమార్, బిజినెస్ గ్రాడ్యూట్, హైదరాబాద్

ఫాస్ట్ ఫుడ్స్‌కి బానిసలు

నిజానికి ఇది కేవలం కుమార్ సమస్య మాత్రమే కాదు.. ఈ కాలం యువతీ, యువకులందరిదీ ఇదే సమస్య. మీకు లిక్కర్‌కి బానిసలైన వారి గురించి మనకు తెలుసు. సిగెరట్‌ లేకపోతే నాలిక లాగేస్తుందన్న తెగ బాధపడే పెద్ద మనుషుల గురించి మనకు తెలుసు.. ఇక డ్రగ్స్‌కు బానిసలై కన్ను, మిన్ను కానక చివరకు కటకటాలపాలైన పెద్దల గురించి మనకు తెలుసు. కానీ ఫాస్ట్ ఫుడ్స్‌కి బానిసలైన వారి గురించి ఎప్పుడైనా విన్నారా..? అసలు ఆకలేస్తే కడుపునింపుకునేందుకు ఆహారం తీసుకోవడం వ్యసనం ఎందుకవుతుంది..? అంటే తాగడం తప్పు, పొగ తాగడం ఇంకా తప్పు.. డ్రగ్స్ తీసుకోవడం ఇంకా.. ఇంకా తప్పు… కానీ తిండి తినడం కూడా తప్పేనా..? అవును… అలవాటుగా అదే పనిగా రోజూ మనకు తెలీకుండానే పదే పదే ఒకే రకమైన ఆహారం తీసుకుంటే దాన్ని సదరు ఆహార పదార్థాలకు బానిసవడమే అంటారన్నది నిపుణుల మాట. మరీ ముఖ్యంగా ఆల్ట్రా ప్రొసెసెడ్‌ ఫుడ్ మన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత… ఫాస్ట్ ఫుడ్స్‌ను మనం తినడం మొదలు పెట్టిన తర్వాత మనకు తెలీకుండానే వాటికి మనం బానిసలైపోతున్నాం. జంక్ ఫుడ్ మన జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అచ్చంగా కుమార్ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్నది అదే.

తాజాగా అమెరికాలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో మనకు ఇన్నాళ్లూ తెలియని ఓ కొత్త విషయం బయటపడింది. జంక్ ఫుడ్స్ అలవాటు మనం ఊహిస్తున్న దాని కన్నా దారుణమైన ప్రభావం చూపిస్తోందన్నది వారి మాట. మరీ ముఖ్యంగా స్వీట్, సాల్ట్‌తో కూడిన స్నాక్స్ తరచు తీసుకునే అలవాటు ఉంది అంటే.. వారు ఆ ఆహార పదార్థాలకు బానిసలైపోయినట్టేనని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అంటే మందుబాబులు… పొగరాయళ్లు అని వాటికి బానిసలైనవారిని మనం ఎలా పిలుస్తామో… ఇలా తిండికి బానిసలైపోయిన వారిని నిరభ్యంతరంగా ఫాస్ట్ ఫుడ్ తిండిపోతులు అనడంలో తప్పేం లేదన్నది పరిశోధకుల మాట. అమెరికాలో ఒక రోజులో ప్రతి ముగ్గురిలో ఒక్కరు కచ్చితంగా తమ లంచ్‌లో కచ్చితంగా ఫాస్ట్ ఫుడ్స్ తింటారట. అంటే కచ్చితంగా వారు ఫాస్ట్ ఫుడ్స్‌కి బానిసలై పోయినట్టే.

ఫాస్ట్ ఫుడ్స్‌కి యువత బానిసలవుతున్నారా?

ఫాస్ట్ ఫుడ్స్‌కి యువత బానిసలవుతున్నారా?

మీ సరుకుల లిస్టు చెక్ చేసుకోండి

అంతెందుకు ఓ సారి మీరు నెల వారీ తెచ్చుకునే సరుకుల లిస్టు చూడండి. అందులో నూడుల్స్, పిజ్జా టాపింగ్స్, పిజ్జా బ్రెడ్, సాస్‌లు, పాస్తా, రెడీ టు ఈట్ మరియు రెడీ టు కుక్ ఫుడ్స్ ప్రతి నెలా తప్పనిసరి అయిపోయాయా..? లేదా మీ పిల్లలు అల్లరి చేస్తే నూడుల్స్ అనగానే అల్లరి కట్టి పెట్టేస్తున్నారా..? ఈ రెండు విషయాలు చాలు.. మీరు లేదా మీ పిల్లలు ఫాస్ట్ ఫుడ్‌కి బానిసలైపోయారని చెప్పడానికి.

తాజాగా ఓ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన పరిశోధన సారాంశం ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోవడం అంటే దాదాపు లిక్కర్‌కి బానిసలైనట్టు ఆ ఫుడ్‌కి మనం బానిసలైనపోయినట్టేనట. సుమారు 36 దేశాల్లో 281 నివేదికల్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆల్కాహాల్ అడిక్టివిటీ లెవెల్ పెద్దల్లో 14 శాతం ఉండగా, టుబాకో 18 శాతం ఉంది. అదే ఫుడ్ అడిక్టివిటీ విషయానికి వస్తే పెద్దల్లో 14 శాతం పిల్లల్లో 12 శాతం ఉందని తేలింది.

ఏవి బాగా ప్రోసెస్ చేసినవి? ఏవి చెయ్యనివి?

ఏవి బాగా ప్రోసెస్ చేసినవి? ఏవి చెయ్యనివి?

తియ్యగా.. ఉప్పగా ఉంటే…:

అయితే ఏ ఏ ఆహార పదార్థాలకు మన నాలుక బానిసవుతుందన్న విషయానికి వస్తే ఎక్కువగా ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్ విషయంలోనే అంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకు ప్రధాన కారణం వాటిల్లో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, లేదా ఫ్యాట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే అటువంటి ఆహార పదార్థాలు తియ్య తియ్యగా.. కాస్త ఉప్పగా ఉంటూ నోటికి భలే రుచి అనిపిస్తాయి. ఓ రకంగా ఈ రుచే మనల్ని పదే పదే వాటిని తినేలా చేస్తుంటుంది. చివరకు ఆ పేరు విన్నా.. నోట్లో రుచి మొగ్గలకు ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టనిపిస్తుంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ బిర్యానీ.. ఈ పేరు చెప్పగానే చాలు చాలా మందికి ఒక్కసారిగా నోరూరుతుంది. అందుకే ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో ఆర్డరిచ్చే ఆహార పదార్థాల్లో ప్రతి ఏటా బిర్యానీకే పెద్ద పీట వేస్తున్నారు భారతీయులు. బిర్యానీ అనగానే చాలు ఎక్కడ చూసినా మనసు దానివైపే మళ్లితుంది. కనిపించగానే మనకు తెలీకుండానే ఎక్కువగా తినేస్తుంటాం. ఏ మాత్రం కంట్రోల్ కూడా ఉండదు. ఓ రకంగా వ్యసనం అంటే అదే. లిక్కర్ తీసుకునే వాళ్లనే గమనించండి. బానిసైన ప్రతి ఒక్కరికీ లిక్కర్‌ని చూడగానే సర్వం మర్చిపోయి దాని కోసమే వెంపర్లాడుతుంటారు. తాగేటప్పుడు కనీసం ఏ మాత్రం కంట్రోల్ ఉండదు. సేమ్ టు సేమ్ ఫుడ్ విషయంలో కూడా చాలా మంది విషయంలో జరిగేది అదే. తెలీకుండానే కంట్రోల్ లేకుండా తినేయడం… ఆ ఫుడ్ ఏ మాత్రం ఆరోగ్యకరం కాకపోవడం వల్ల.. అలాగే పరిమితికి మించి తినడం వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోతుంది. అది ఒబెసిటీకి దారి తీస్తుంది. ఆ తర్వాత అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

హైదరాబాద్ బిర్యానీ

హైదరాబాద్ బిర్యానీ

జంక్ ఫుడ్స్ మనల్ని బానిసలుగా మార్చేస్తాయి! :

అమెరికన్ వైద్యులు చేసిన పరిశోధనలో మరో విషయం కూడా స్పష్టమైంది. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ కూడా మనల్ని వాటికి బానిసలుగా మార్చేస్తాయట. ఓ రకంగా చెప్పాలంటే పొగాకులో ఉండే నికోటిన్… ఇలాంటి జంక్ ఫుడ్స్‌లో ఉంటే రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్, లేదా ఫ్యాట్స్ మన మెదడులోను విడుదలయ్యే డొపమైన్ స్థాయిల్ని పెంచుతాయి. అంటే సిగిరెట్ తాగిన వ్యక్తిపై నికోటిన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ జంక్ ఫుడ్స్‌కి బానిసైన వారి విషయంలోనూ రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ లేదా ఫ్యాట్ అదే స్థాయిలో ప్రభావం చూపిస్తాయన్నది వైద్యుల మాట. మరీ ముఖ్యంగా మనషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు విశాఖపట్నానికి చెందిన ప్రముఖ డైటీషియన్ నీతా దిలీప్.

నీతా దిలీప్, డైటీషియన్

నీతా దిలీప్, డైటీషియన్

ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి:

అయితే ఇక్కడ ఓ విషయాన్ని మనం గమనించాలన్నది పరిశోధకుల మాట. నిజానికి డ్రగ్స్, లిక్కర్, సిగిరెట్.. ఇలాంటి లేనంత మాత్రాన మన జీవితానికేం సమస్యలుండవు. నిజానికి అవి అలవాటైతేనే సమస్య. ఇక్కడ ఈ ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్ విషయంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రం ఇదే ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్ తప్పనిసరి అవసరం అవుతుంది. నిజానికి వారికి శరీరానికి శక్తినిచ్చే ప్రధాన ఆహారం కూడా అదే కావచ్చు. అందుకే ఈ విషయంలో ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

మనం చాలా సార్లు.. మనకిష్టమైన ఆహార పదార్థాలు కళ్ల ముందు కనిపించే సరికి అస్సలు ఏ మాత్రం ముందు వెనుకా ఆలోచించం. మరి కొంత మందైతే కళ్లముందు కనిపించాక తినకుండా ఉండలేమంటూ ఉండటం మనం చాలా సార్లు వినే ఉంటాం. అంటే మనం ఇప్పటి వరకు పెద్దగా పోల్చుకోవడం లేదు కానీ… ఓ సారి లిక్కర్ బానిసల ముందు వారికి నచ్చిన బ్రాండ్ మందు పెట్టినప్పుడు… కేక్స్ అంటే పడి చచ్చే వాళ్ల ముందు నచ్చిన ఫ్లేవర్ కేక్‌ను తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు వాళ్లిద్దరి హావా భావాలు ఒక్కసారి ఊహించండి. అప్పుడు అర్థమవుతుంది. కొన్ని రకాల ఫుడ్స్ మనల్ని ఎలా వాటికి బానిసలుగా మార్చేస్తున్నాయో. ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వాళ్లు కూడా మందుబాబులు ఎలాగైతే అడ్డు ఆపు లేకుండా మందుకొడతారో… పొగరాయళ్లు ఎలాగైతే సిగిరెట్ మీద సిగిరెట్ ఊది పారేస్తుంటారో… జంక్ ఫుడ్‌కి బానిసలైన వాళ్లు కూడా అడ్డూ.. ఆపు లేకుండా తెగ తింటూ ఉంటారు.

అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. 2028 నాటికి సుమారు 570 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఓ అంచనా. ఒక్క భారత దేశంలోనే ఏటా 2 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రతి నలుగురిలో ఒకరు ఈ ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ మార్కెట్ విలువ సుమారు 4 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. అందుకు ప్రధాన కారణం ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్‌గా చెప్పుకునే ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, ఇతర జంక్ ఫుడ్స్ వీటన్నింటి అమ్మకాల విషయంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రకటనలు అవి కూడా దేశంలో ప్రముఖ సెలిబ్రెటీస్‌ వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటంతో జనంలోకి అవి చాలా త్వరగా చొచ్చుకెళ్తున్నాయి. వారిచ్చే ప్రకటనల్లో నిజం సంగతిని పక్కన పెట్టేస్తే వారి మార్కెట్ విలువ మాత్రం ఏ ఏటికాయేడు శరవేగంగా పరిగెడుతోంది.

తాజాగా ప్రముఖ మెడికల్ రీసెర్చ్ వెబ్ సైట్ BMJ పబ్లిష్ చేసిన స్టడీ ప్రకారం స్వీట్లు, కారా, ప్రి ప్యాకేజ్డ్ మీట్ వంటి ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్ గుండె సంబంధ వ్యాధుల వల్ల కలిగే మరణాన్ని 50 శాతం పెంచుతాయని తేలింది. అదొక్కటే కాదు క్యాన్సర్, టైప్ 2 డయాబెటీస్, ఉదర సంబంధ వ్యాధులు, శ్వాసకోస సంబంధ సమస్యలు, డిప్రెషన్, ఆందోళన ఇలాంటి శరీరాన్ని ఛిద్రం చేసే సమస్యలు అవకాశాలను 32 శాతం ఉంటాయని ఆ పరిశోధనలో తేలింది.

పెరిగిన UPF మార్కెట్:

భారత దేశంలో ఈ ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్ మార్కెట్ గడిచిన 2011-2021 మధ్యకాలంలో ఏకంగా 13.37 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ స్థాయిలో ఆ మార్కెట్ పెరుగుదల ప్రపంచంలో మరే దేశంలోనూ లేదట.

ఇండియా శరవేగంగా పెరుగుతున్న UPF వినియోగం

ఇండియా శరవేగంగా పెరుగుతున్న UPF వినియోగం ( SOURCE:WHO-ICRIER)

ఇండియాలోని నగరాల్లో 70% స్థూలకాయులే! :

భారత దేశంలో శర వేగంగా స్థూలకాయులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అన్నది వైద్య నిపుణుల మాట. తాజాగా లాన్సెట్ వెల్లడించిన నివేదిక వివరాల ప్రకారంలో దేశంలోని నగరాల్లో 70 శాతం ప్రజలు ఒబెసిటీతో బాధపడుతున్నారని స్పష్టమయ్యింది. ఇలా శరవేగంగా స్థూలకాయులు పెరుగుతున్న టాప్ 10 దేశాల్లో భారత్ 3 స్థానంలో ఉంది. మన కన్నా ముందు అమెరికా, చైనా వరుసగా ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో స్థూలకాయులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి నగరీకరణ, రెండోది ప్రపంచీకరణ. అంటే అర్బనైజేషన్, గ్లోబలైజేషన్. దేశంలో ఉపాధి కోసం వచ్చే జనాలతో నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగాల్లో వచ్చిన మార్పుల కారణంగా వ్యక్తుల జీవన విధానాల్లో కూడా మార్పులొచ్చాయి. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఎక్కడ చూసినా కర్రీ పాయింట్లు, రెస్టారెంట్లు, హోటళ్లు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా రెస్టారెంట్ల బిజినెస్ సుమారు 6 వేల కోట్ల రూపాయలు మేర జరుగుతోందని సుమారు రెండేళ్ల క్రితమే నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2022 జనవరిలో ఈ మాట చెప్పింది. అప్పుడప్పుడే మనం కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో బయటపడుతున్న రోజులవి. గడిచిన రెండేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ రెండేళ్ల కాలంలో హైదరాబాద్ రెస్టారెంట్ల మార్కెట్ కనీసం 10 నుంచి 15 శాతం పెరగొచ్చని కూడా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కేవలం ఆర్గనైజ్‌డ్ సెక్టార్ లెక్కలు మాత్రమే, వ్యవస్థీకృతం కాని హోటళ్లు, కర్రీ పాయింట్లు, బిర్యానీ సెంటర్లు ఆ లెక్కలు కూడా చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.

ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు మారిపోయి.. హోటళ్ల తిండికి జనం అలవాటు పడ్డారో అప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయన్నది వైద్యులు చెబుతున్న మాట.

ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ చేసే హాని ఏంటి?

ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇలాంటి రెడీ టు ఈట్ ఫుడ్ నోటికి రుచికరంగా ఉండి, మీ ఆకలి తీర్చొచ్చు కానీ అందులో శరీరానికి అవసరమైన న్యూట్రీషియన్లు, ఫైబర్ ఉండవు.సరికదా.. అందులో మీరు వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉండే ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, అడిక్టివ్స్ ఉపయోగిస్తారు. అందుకే వాటిని మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఆ ఫుడ్‌లో శరీర అవసరాలకు మించిన షుగర్, అనారోగ్యకరమైన క్రొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల మీకు తెలీకుండానే మీ శరీర బరువు పెరిగిపోతుంది. బరువు పెరిగితే వచ్చే సమస్యల గురించి అందరికీ తెలిసిన సంగతే. మరో సంగతేంటంటే వాటిని ఎంత తిన్నా.. పెద్దగా కడుపు నిండినట్టు అనిపించదు. ఫలితంగా మళ్లీ మళ్లీ తింటూనే ఉంటాం. ఇది మన మెటబాలిజంపై ప్రభావం చూపుతాయి. పెరిగిపోతున్న గుండె సంబంధ వ్యాధులకు, డయాబెటిస్ వంటి రోగాలకు ఇదే ప్రధాన కారణం.

ఈ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కి బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?: ఇది ఏ ఒక్కరి సమస్య కాదు. అందుకే ఇందులో కేవలం వ్యక్తులే కాదు, ఆ తరహా ఆహార పదార్థాలను ప్రమోట్ చేసే సెలబ్రెటీల నుంచి విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాధినేతల వరకు ఈ విషయంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సామాన్యులపై విపరీతమైన ప్రభావం చూపించే సెలబ్రెటీలు ఇటువంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాల ప్రచారానికి దూరంగా ఉండాలి. వీలైతే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని స్వయంగా వారే ప్రచారం చేస్తే ఇంకా మంచిది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో విదేశీ ఆహారపు అలవాట్లు మన దేశంలో కూడా సర్వ సాధారణమైపోయాయి. ఎప్పుడో ఒక సారి రుచి చూస్తే ఫర్వాలేదు. కానీ వాటికే అలవాటైతే మాత్రం సమస్య మరింత ముదురుతుంది. నిజానికి ఇప్పుడొచ్చిన సమస్య కూడా అదే. జనం వాటికి పూర్తిగా బానిసలయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. నిజానికి ఒక్కో ప్రాంతం, భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, అలవాట్లపై మన ఆహారపు అలవాట్లు కూడా ఆధారపడి ఉంటాయి. కానీ మనం అవేవీ ఆలోచించకుండా కేవలం నోటికి రుచిగా ఉందన్న ఉద్ధేశంతో మనకు సరిపడని ఆహారాన్ని కూడా అలవాటు చేసుకుంటున్నాం. అందుకే ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ఆ తరహా ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్‌ను ప్రోత్సహించకుండా ఉంటే మంచిది. ఇక మనమేం చెయ్యాలన్న విషయానికి వస్తే విశాఖపట్నానికి చెందిన ప్రముఖ డైటీషియన్ నీతా దిలీప్ ఇలా చెప్పుకొచ్చారు.

నీతా దిలీప్, డైటీషియన్, విశాఖపట్నం

నీతా దిలీప్

వచ్చే 4 ఏళ్లలో రూ. 4,00,000 కోట్ల మార్కెట్! :

నిజానికి ఈ భూమ్మీద ఒక్క మనిషి తప్ప… మిగిలిన ఏ ప్రాణి ఆహారాన్ని ప్రొసెస్ చేసుకొని తినదు. అలాగని ఆహారాన్ని ప్రోసెస్ చేసుకోకుండా తినొద్దని ఎవరూ చెప్పడం లేదు. కానీ రక రకాల కారణాలు చెప్పి పొట్టుతో తినాల్సిన వాటిని కూడా పది రోజులు నిల్వ ఉంచి తినేలా అందులో రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ కలిపి అందులో తాజాదనాన్ని కోల్పోతున్నాం. ఫలితంగా సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఒక్క విషయం ఆలోచించండి…మీరు స్వయంగా వంట చేసుకొని తింటే.. ఆ వంటల్లో మీరేం వాడారో.. ఎలాంటి పదార్థాలు ఉపయోగించారో మీకు ఓ స్పష్టత ఉంటుంది. అందులో తాజా కూరగాయలు వాడతారు. అవసమైన మేర మాత్రమే దినుసులు ఉపయోగిస్తారు. అందువల్లే తినే ఆహారం విషయంలో మీకు ఎలాంటి సందేహాలు ఉండవు. ఏవైతే హానికరమైనవో వాటిని దూరంగా ఉంచుతారు. అలాగే మీరు ఏ ఆహార పదార్థం కొన్నప్పుడైనా దానిపై ఉండే లేబుల్‌ని కచ్చితంగా చదవండి. అందులో ఎన్ని షుగర్స్, అడిక్టివ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయన్న విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు తీసుకునే ఆహారంలో పళ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, ప్రోటీన్లకు సమ ప్రాధాన్యం ఇవ్వండి. మీ డైట్‌లో ప్రోసెస్డ్ ఫుడ్‌కు వీలైనంత వరకు చోటు కల్పించక పోవడం చాలా చాలా మంచిది. ఫాస్ట్ ఫుడ్స్ తినడం తగ్గించండి. తప్పని సరి పరిస్థితుల్లో అయితే తప్ప రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. అప్పుడే ఈ సరికొత్త బానిసత్వానికి దూరంగా ఉంటారు. చివరిగా చిన్న మాట. వచ్చే నాలుగేళ్లలో మన దేశంలో కేవలం ఈ ఆల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్ మార్కెట్ విలువ సుమారు 4 లక్షలకు చేరుతుందని అంచనా. అంటే క్రమ క్రమంగా మనం వాటికి ఎంతగా అడిక్ట్ అయిపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రస్తుతం సిగిరెట్, ఆల్కాహాల్, డ్రగ్స్ అలవాట్ల నుంచి బయటపడేందుకు ఎలాగైతే డీ అడిక్షన్ సెంటర్లు అడుగడుగునా కనిపిస్తున్నాయో.. త్వరలో ఈ ఆల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్ అలవాటనుంచి బయట పడేందుకు కూడా డీ అడిక్షన్స్ సెంటర్లు కనిపిస్తాయన్నమాట. కాదంటారా…?