News9 Global Summit: ప్రతీ దేశం భారత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటోంది: ప్రధాని మోదీ
టీవీ నెట్‌వర్క్‌కు చెందిన న్యూస్9 జర్మీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరుగుతోన్న ఈ కార్యక్రమంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అంశాలపై స్పందించారు. భారత్, జర్మనీ దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి భారత్ కృషి చేస్తోందని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ..
జర్మనీలోని స్టట్‌గార్ట్ నగరంలో జరిగిన TV9 నెట్‌వర్క్ News9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు (శుక్రవారం) కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఇండో-జర్మన్ బంధం పెంపొందిందని, యూరోపియన్ ప్రాంతంలో భారత్ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రశంసించారు.
భౌగోళిక-రాజకీయంగా, యూరప్ భారతదేశానికి ఒక ముఖ్యమైన ప్రాంతం అని, జర్మనీ తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములల్లో ఒకటని తెలిపారు. 2024లో ఇండో-జర్మనీ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపిన మోదీ.. వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా ఈ సంవత్సరం చారిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత ప్రయాణంలో జర్మనీ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని, మరిన్ని జర్మనీ కంపెనీలను భారత్‌లోకి ఆహ్వానించామని చెప్పుకొచ్చారు.
ఇక ఇండో-జర్మన్ వాణిజ్యం గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరగబోతున్నాయి. ఇండో-జర్మన్ ఆర్థిక నిబంధనలు మరింత బలపడ్డాయి. నేడు, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోని ప్రతీ దేశం అభివృద్ధి కోసం భారత్‌తో భాగస్వామ్యం కావాలని కోరుకుంటోంది. జర్మన్ ‘ఫోకస్ ఆన్ ఇండియా డెవలప్‌మెంట్’ దీనికి నిదర్శనం” అని మోదీ చెప్పొచ్చారు.
న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ‘ఇండియా: ఇన్‌సైడ్ ది గ్లోబల్ బ్రైట్ స్పాట్’ అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వర్చువల్ కీనోట్ ప్రసంగం చేశారు. భారత్‌లో సులభతరమైన వ్యాపారం చేయడంపై ప్రధాని మోదీ వివరిస్తూ, ప్రభుత్వం రెడ్ టేప్‌ను తొలగించిందని, సంక్లిష్టమైన పన్ను విధానాన్ని సరళీకృతం చేసిందని, మూలధనం కోసం బ్యాంకులను బలోపేతం చేసిందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25-26 మధ్య న్యూఢిల్లీలో జరిగిన ‘వాట్ ఇండియా టుడే’ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరైన విషయం తెలిసిందే.
న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ అభివృద్ధితో పాటు బహుళ రంగాలలో ఇండో-జర్మన్ సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించింది. 3 రోజుల సమ్మిట్ నవంబర్ 23 వరకు కొనసాగుతుంది. భారతదేశం జర్మనీకి చెందిన ప్రముఖ విధాన నిర్ణేతలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఇక రెండో రోజు సమ్మిట్ టీవీ9 ఎండీ, సీఈఓ బరుత్ దాస్ ఓపస్ ప్రారంభం సందేశం ద్వారా ప్రారంభమైంది. సమ్మిట్‌లో మొదటి రోజు ఇద్దరు సీనియర్ భారతీయ మంత్రులు-అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగిస్తూ.. దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని కొనియాడారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..