Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం.. మృతుల్లో ఫోక్ సింగర్
మరో పది నిమిషాల్లోనే ల్యాండింగ్ కావాల్సిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి విమానంలో ఉన్న 72 మంది..

మరో పది నిమిషాల్లోనే ల్యాండింగ్ కావాల్సిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి విమానంలో ఉన్న 72 మంది సజీవ దహనమయ్యారు. ఎంతో సంతోషంగా విమాన ప్రయాణం చేసి ల్యాండ్ అవుతున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదం మృతుల కుటుంబాలను శోకసముద్రంలో నెట్టేసింది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో జానపద గాయని నీరా చంత్యాల్ కూడా ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి పోఖారాకు వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందినట్లు నీరా సోదరి హీరా చంత్యాల్ షెర్చన్ ధృవీకరించారు.
నీరా ఫేస్‌బుక్‌లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ కూడా చేసింది. ఇంతకు ముందు మరొక స్టేటస్‌లో ఆమె రేపు పోఖరాలో సరదాగా గడపాలి అంటూ పోస్ట్‌ను షేర్ చేసింది. నేపాల్ చాంత్యాల్ యూత్ అసోసియేషన్ సోమవారం పోఖారాలో పురుషుల, మహిళల వాలీబాల్ పోటీలను నిర్వహించాల్సి ఉంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సంగీత ప్రదర్శనకు నీరా హాజరు కానున్నారు. నేపాల్ చంత్యాల్ యూత్ యూనియన్ కస్కీ కార్యదర్శి నవీన్ ఘర్తి చంత్యాల్ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.
ఈ విమాన ప్రమాదంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అలాగే నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఏటీ ఎయిర్‌లైన్స్ ట్విన్ ఇంజన్ ఏటీఆర్ విమానంలో బయలుదేరింది. ప్రయాణికుల్లో ఆరుగురు చిన్నారులతో సహా పదిహేను మంది విదేశీయులు ఉన్నారు. విమానంలో 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, ఒక అర్జెంటీనా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు భారతీయులను అభిషేక్ కుష్వాహా, బిషాల్ శర్మ, అనిల్ కుమార్ రాజ్‌భర్, సోనూ జైస్వాల్ మరియు సంజయ జైస్వాల్‌గా గుర్తించినట్లు యేటి ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. పోఖారాలో కొంతమంది భారతీయులతో సహా 72 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



