వైరల్, ఇలా కూడా జరుగుతుందా ? ఆ మమ్మీ ఈజిప్ట్ మత గురువుది కాదు, అది గర్భిణీ అట !
ఈజిప్ట్ లో మమ్మీలపై పరిశోధనలు జరుపుతున్న ఆర్కియాలజిస్టులకు కొత్త విషయం తెలిసింది. ఈజిప్టు మత గురువుదిగా భావిస్తున్న ఒక మమ్మీ ఆయనది కాదని, గర్భిణీ అయిన ఓ మహిళదని...
ఈజిప్ట్ లో మమ్మీలపై పరిశోధనలు జరుపుతున్న ఆర్కియాలజిస్టులకు కొత్త విషయం తెలిసింది. ఈజిప్టు మత గురువుదిగా భావిస్తున్న ఒక మమ్మీ ఆయనది కాదని, గర్భిణీ అయిన ఓ మహిళదని తెలిసి వారు ఆశ్చర్యపోయారు. వార్సా మమ్మీ ప్రాజెక్టులో పని చేస్తున్న మార్జినా అనే ఆర్కియాలజిస్ట్.. తమ దేశ నేషనల్ మ్యూజియంలో ఓ మమ్మీని సీటీ స్కాన్ చేస్తుండగా ఆమెకు ఏదో విశేషం కనవడింది. దీని కడుపు భాగం ఎత్తుగా ఉండడం గమనించి..పరీక్షగా చూస్తే.. కడుపులో చిన్న కాలు భాగం కనిపించిందట. ఈ స్కాన్ ను తన భర్తకు కూడా చూపానని, ఆయన కూడా ఇది కాలేనని ధృవీకరించాడని ఆమె చెప్పింది. చివరకు మొత్తం పిక్చరంతా బయటపడిందని ఆమె తెలిపింది. నేసేంట్ యూనివర్సిటీ ఆఫ్ వార్సా పాత కళాఖండాలను, మమ్మీలను సేకరిస్తుండగా 19 వ శతాబ్దంలో పోలండ్ కు ఈ మమ్మీ చేరింది. మొదటదీన్ని ప్రాచీన ఈజిప్ట్ మతగురువుదిగా దశాబ్దాల తరబడి భావిస్తూ వచ్చారు.కానీ ఇది అది కాదని, 26, లేదా 28 వారాల గర్భంతో ఉన్న సుమారు 20 ఏళ్ళ వయస్సు మహిళదని ఆర్కియాలజిస్టులు ఇప్పుడు తాజాగా నిర్ధారించారు. ఈమె మరణానికి కారణమేమై ఉండవచ్చునన్నది వీరికి సస్పెన్స్ గా మారింది. గర్భం ధరించిన ప్రభావం వల్లే ఆమె మరణించిందా లేక మరే ఇతర కారణమేమైనా ఉందా అని పరిశోధిస్తున్నారు. ఆమె గర్భంలో పిండాన్ని అలా ఎందుకు వదిలేసి ఉండవచ్చునని కూడా ఆరా తీసే పనిలో పడ్డారు.
ఈజిప్టు పిరమిడ్లలో ఉన్న మమ్మీలు ఇప్పటికీ ఆర్కియాలజిస్టులకు సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. వార్సా పరిశోధకులు ఏళ్ళ తరబడి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇన్నేళ్లూ పురుష మత గురువుదిగా భావిస్తున్న మమ్మీ చివరకు ఓ గర్భిణీ మమ్మీ అని తేలడంతో వీరి పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.