America News: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం.. ఐదేళ్ల చిన్నారి సహా ఇద్దరు మృతి..
తుపాకీ నియంత్రణ చట్టం అమలులోకి వచ్చినా అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట తుపాకీ మోత మోగుతూనే ఉంటుంది. ఆ కాల్పుల్లో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు.
America News: అమెరికాలో కాల్పుల కల్లోలం ఆగడం లేదు. తాజాగా టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్ లో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. ఇక్కడి నివాస ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 18 నెలల చిన్నారికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసు అధికారులు సమాచారం అందించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాల్పులు జరిగినట్లు ఫోర్ట్ వర్త్ పోలీస్ చీఫ్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఇంటి బయట వాహనం పార్క్ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దాడి చేసిన వ్యక్తులు ముందు యార్డ్‌లో ఉన్న వ్యక్తుల బృందంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 నెలల చిన్నారి గాయపడింది. మృతుల్లో ఒకరి వయసు 17 ఏళ్లు కాగా, మరొకరి వయసు ఐదేళ్లు మాత్రమేనని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో 18 నెలల చిన్నారికి స్వల్ప గాయాలు కాగా, ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించి ఎవరికైన సమాచారం తెలిస్తే..వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీసు చీఫ్ చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులెవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
అమెరికాలోని హ్యూస్టన్‌లో శనివారం కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి మరో ఐదుగురు అద్దెదారులపై కాల్పులు జరపడంతో వారిలో ముగ్గురు చనిపోయారు. ఈ సమాచారాన్ని పోలీసులు అందించారు. నైరుతి హ్యూస్టన్‌లోని నివాస ప్రాంతంలో శనివారం అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. అద్దెకుంటున్న వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ఆ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు.
తుపాకీ నియంత్రణ చట్టం అమలులోకి వచ్చినా అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట తుపాకీ మోత మోగుతూనే ఉంటుంది. ఆ కాల్పుల్లో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. అయితే బైడెన్ ప్రభుత్వం దీన్ని ఎందుకు నియంత్రించలేక పోతుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రతి సంఘటన తర్వాత, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటారు..అతనిపై చర్యలు తీసుకుంటారు.. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పులేదు.. దాడులకు పాల్పడుతున్న వారిలో భయం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి