AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump vs Zelensky: ‘స్టుపిడ్‌ ప్రెసిడెంట్‌’.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: జెలెన్‌స్కీపై ట్రంప్ ఆగ్రహం

ఒకరు అగ్రరాజ్యానికి అధినేత, ఇంకొకరు యుద్ధాన్ని ఎదుర్కొంటున్న దేశానికి అధ్యక్షుడు. వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. అధికారిక సమావేశంలో మీడియా ముందే వాగ్వాదానికి దిగారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. దీంతో వైట్‌హౌస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది..

Trump vs Zelensky: ‘స్టుపిడ్‌ ప్రెసిడెంట్‌’.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: జెలెన్‌స్కీపై ట్రంప్ ఆగ్రహం
Donald Trump, Volodymyr Zelensky
Shaik Madar Saheb
|

Updated on: Mar 01, 2025 | 8:32 AM

Share

ఒకరు అగ్రరాజ్యానికి అధినేత, ఇంకొకరు యుద్ధాన్ని ఎదుర్కొంటున్న దేశానికి అధ్యక్షుడు. వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. అధికారిక సమావేశంలో మీడియా ముందే వాగ్వాదానికి దిగారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. దీంతో వైట్‌హౌస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.. డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీ ఇరువురు నేతలు కూడా తగ్గేదే లేదంటూ.. మీడియా ఎదుటే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్‌ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి.

ఖనిజాల ఒప్పందమే ప్రధాన అజెండాగా డొనాల్డ్ ట్రంప్‌, జెలెన్‌స్కీ వైట్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. చర్చల అనంతరం అధ్యక్ష కార్యాలయం ఓవల్‌ ఆఫీస్‌కు చేరుకున్న ఇరువురు నేతలు..మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ‘జెలెన్‌స్కీ.. ఒప్పందం కుదుర్చుకో.. లేదంటే మేం బయటకు వెళ్లిపోతాం’’ అంటూ ట్రంప్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందన్న ట్రంప్‌.. దాన్ని నుంచి గట్టెక్కడం అసాధ్యమని హెచ్చరించారు. దానికి జెలెస్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం మొదలయింది.

ఉక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెస్కీ వ్యవహార శైలి సరికాదని మండిపడ్డారు.. ట్రంప్‌. చాలా విషయాలను ఇది క్లిష్ట తరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జీవితాలతో జెలెన్‌స్కీ చెలగాటమాడుతున్నారన్న ట్రంప్‌.. ఈ వ్యవహార శైలితో మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా ఉందన్నారు. జెలెన్‌స్కీ చేస్తున్న పనులతో ఆ దేశానికి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జెలెన్‌ స్కీని “స్టుపిడ్‌ ప్రెసిడెంట్‌”అంటూ మండిపడ్డారు ట్రంప్‌.

ఉక్రెయిన్‌ వెంటనే శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలి.. అప్పుడే ఆ దేశంపై బుల్లెట్ల వర్షం ఆగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. గత అధ్యక్షుడు బైడన్‌ తన అంత స్మార్ట్‌ కాదని.. తమ సాయానికి కృతజ్ఞులుగా ఉండాలి తప్ప.. ఇలా ప్రవర్తించడం సరికాదంటూ ట్రంప్.. జెలెన్‌ స్కీ కి సూచించారు.

అమెరికా ఈ విధంగా మాట్లాడటం సరికాదని.. యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయని జెలెన్స్కీ అన్నారు.. ఇప్పుడు దానిని అనుభవించడం లేదు, అయితే భవిష్యత్తులో మీరు దానిని అనుభవిస్తారంటూ జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనలపై మీ నిర్ణయం ఏంటని ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రశ్నించారు.

జెలెన్‌స్కీ-ట్రంప్‌ వాదనలో కలగజేసుకున్న ఉపాధ్యక్షుడు జేడీవాన్స్.. గట్టిగా మాట్లాడవద్దంటూ జెలెన్‌స్కీకి సూచించారు. యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమన్నారు.. ‘ఎలాంటి దౌత్యం?’ అంటూ జెలెన్‌స్కీ ఎదురు ప్రశ్నించారు. జెలెన్‌స్కీ తీరుపై ట్రంప్‌, జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఈ ప్రవర్తన సరికాదని.. మీరు అమెరికా ప్రజలను అవమానిస్తున్నారంటూ ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్‌, జెలెన్‌స్కీ వాగ్వాదంతో ఖనిజాల తవ్వకం ఒప్పందం నిలిచిపోయింది.. కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే.. వైట్‌హౌస్‌ నుండి వెనుదిరిగిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. ఉక్రెయిన్‌కు న్యాయంతో పాటు శాశ్వతంగా శాంతి కావాలతీ.. అందుకోసమే తాము పనిచేస్తామంటూ Xలో పోస్ట్ చేశారు.