Bangladesh: ఆలయం కనిపిస్తే విలయం.. బరితెగించిన బంగ్లాదేశ్‌

నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న ప్రముఖుడి సారధ్యంలోని సర్కారు.. పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోయింది. అక్కడి అల్పసంఖ్యాక వర్గాలపై మత విద్వేషం బుసలు కొడుతోంది. సనాతన ధర్మ ప్రచారకుడిపై దేశద్రోహి ముద్రవేసింది. ఆయనకు న్యాయం జరగనివ్వకుండా.. లాయర్ల రక్తం కళ్లచూస్తోంది. ఆలయం కనిపిస్తే చాలు.. విలయం సృష్టిస్తోంది. చివరికి మన మువ్వన్నెల జెండాని కూడా భరించలేకపోతోంది. బంగ్లాదేశ్‌లో సిట్యువేషన్‌ ఔటాఫ్‌ కంట్రోల్‌. ఇప్పుడేం చేయబోతోంది కేంద్రం?

Bangladesh: ఆలయం కనిపిస్తే విలయం.. బరితెగించిన బంగ్లాదేశ్‌
Bangladesh
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 03, 2024 | 9:42 PM

హిందూధర్మంపై మాట్లాడటమే ఆయన నేరం. బాధితులపక్షాన పోరాడటమే ఆయన చేసిన ద్రోహం. చిన్మయ్‌ కృష్ణదాస్‌కోసం వచ్చిన లాయర్‌.. ఐసీయూలో చావుబతుకుల్లో ఉన్నారు. వాదించేందుకు ఒక్క లాయర్‌ కూడా ముందుకు రాలేనంత.. భీతావహ వాతావరణాన్ని సృష్టించింది బంగ్లాదేశ్‌. ఇస్కాన్‌ ఎకౌంట్లను ఫ్రీజ్‌చేసింది. జర్నలిస్టులు, టూరిస్టులను కూడా టార్గెట్‌ చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది.

బరితెగించిన బంగ్లాదేశ్‌..

చిన్నసాయం చేస్తేనే ఎవరికైనా జీవితాంతం ఆ కృతజ్ఞత ఉంటుంది. కానీ స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన భారత్‌పైనే పొరుగుదేశం విషం కక్కుతోంది. దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై మత విద్వేషంతో విరుచుకుపడుతోంది. పరమపవిత్రంగా భావించే ఆలయాలపైనా దాడులకు తెగబడుతోంది. భారత జాతీయపతాకాన్ని అవమానిస్తోంది. హిందువుల రక్షణకు గొంతెత్తిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ని దేశద్రోహి ముద్రవేసి జైల్లోవేసిన ప్రభుత్వం..చివరికి న్యాయ సహాయం కూడా అందకుండా చేస్తోంది.

చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగాల్సి ఉంది. కానీ చిన్మయ్‌కోసం వచ్చిన లాయర్‌ చావుబతుకుల మధ్య ఐసీయూలో ఉన్నారు. ప్రభుత్వ ప్రేరేపిత విద్వేషంలో కన్నూమిన్నూగనని అల్లరి మూకలు ఆ లాయర్‌పై దాడిచేశాయి. దీంతో బంగ్లాదేశ్‌ కోర్టులో చిన్మయ్‌ తరపున వాదించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. ప్రభుత్వం సమయం కోరటంతో చిన్మయ్‌ బెయిల్ పిటిషన్‌ విచారణని జనవరి 2కి వాయిదా వేసింది న్యాయస్థానం. చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్‌ని కొందరు లాయర్లు వ్యతిరేకించారు. గతవారం దేశద్రోహం నేరంమోపి చిన్మయ్‌ కృషదాస్‌ని అరెస్ట్‌చేసింది బంగ్లాదేశ్‌ ప్రభుత్వం. ఇస్కాన్‌ సంస్థ దూరంపెట్టినా.. బంగ్లాదేశ్‌లో హిందూసమాజానికి అండగా నిలుస్తున్నారు చిన్మయ్‌. యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి ఇది కంటగింపైంది.

చిన్మయ్‌దాస్‌ని విచారణ కోసం మొదటిసారి కోర్టుకు తీసుకువచ్చినప్పుడు ఆయన మద్దతుదారులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన హింసలో ప్రభుత్వ న్యాయవాది మరణించారు. దీంతో ఈ ఘర్షణలను అడ్డుపెట్టుకుని పదులసంఖ్యలో భారతీయులపై కేసులు పెట్టింది బంగ్లాదేశ్‌ ప్రభుత్వం. చిన్మయ్‌ కృష్ణదాస్‌ తరపున వాదించేందుకు వచ్చిన న్యాయవాది రామెన్‌రాయ్ దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. చిన్మయ్‌ బెయిల్ పిటిషన్‌ విచారణకు రావడానికి 24గంటల ముందు ఆయనతో పాటు 71 మందిపై మరో కేసు పెట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్‌తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద అభియోగాలు మోపారు. చిన్మయ్‌పై కొత్త కేసుతో.. ఆయన్ని జైలు నుంచి విడుదల చేసే ఆలోచన బంగ్లాదేశ్‌కి లేనట్లే కనిపిస్తోంది.

షేక్‌ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు సమయంలో హిందువులతో పాటు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డాయి అల్లరిమూకలు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువులపై, ఆలయాలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. మరోవైపు హిందూ సన్యాసులను అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. చిన్మయ్‌ అరెస్ట్‌పై భారత్‌లో కూడా నిరసనలు పెల్లుబుకుతున్నా.. మతమౌఢ్యం తలకెక్కిన బంగ్లాదేశ్‌ మూర్ఖంగా ముందుకెళ్తోంది.

చిన్మయ్‌పై కొత్త కేసులు పెడుతూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది బంగ్లా సర్కారు. ఆయన శిష్యుల్ని కూడా నీడలా వెంటాడుతోంది. అదే సమయంలో ఇస్కాన్‌ని లక్ష్యంగా చేసుకుంది. ఇస్కాన్‌తో అనుసంధానమైన 17 బ్యాంకు ఖాతాలను నెలరోజులపాటు ఫ్రీజ్ చేయాల‌ని ఆదేశించారు బంగ్లాదేశ్ అధికారులు. ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ కృష్ణ కాన్సియ‌స్‌నెస్‌ని బ్యాన్ చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌ని బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇస్కాన్‌ బ్యాంక్ ఎకౌంట్లని సీజ్ చేయాల‌ని.. బంగ్లాదేశ్ ఫైనాన్సియ‌ల్ ఇంటెలిజెన్స్ యూనిట్ బ్యాంకుల‌ను ఆదేశించింది. హరేకృష్ణ నినాదంతో ప్రపంచమంతా విస్తరించిన ఇస్కాన్‌పై మతతత్వ సంస్థ అనే ముద్రేస్తోంది బంగ్లాదేశ్‌.

హిందూసంస్థలే కాదు భారతీయులంటేనే విషంకక్కేంతగా బంగ్లాదేశ్‌లో ఉన్మాదం పెరిగిపోతోంది. భారతీయ టీవీ ఛానళ్ల ప్రసారాలను తక్షణమే నిషేధించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌ని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. భారత టీవీ ఛానళ్లు బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని పిటిషనర్‌ ఆరోపించారు. మరోవైపు ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై బంగ్లాదేశ్‌లో దాడికి తెగబడింది అల్లరిమూక. సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహా భారతీయ ఏజెంట్ అని ఆరోపిస్తూ ఢాకాలో ఓ గుంపు ఆమెపై దాడికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఆమెను రక్షించారు. సాహా నాలుగు కేసుల్లో నిందితురాలిగా ఉన్నారంటున్న పోలీసులు.. దాడికి దిగినవారిని మాత్రం అరెస్ట్‌చేయలేదు. కొన్నాళ్లక్రితం ఢాకాలో భారత పర్యాటకుడిని స్థానికులు దారుణంగా కొట్టారు. అగర్తలా నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సుపైనా దాడికి తెగబడ్డారు. బంగ్లాదేశ్‌లో దాడులు శృతిమించటంతో భారత్‌లోనూ నిరసనలు పెల్లుబుకుతున్నాయి.

బంగ్లాదేశ్‌లో భారతీయులపై దాడులతో ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర సంచలన నిర్ణయం తీసుకుంది. 135 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని బంగ్లాదేశ్‌కు అల్టిమేటం ఇచ్చిన త్రిపుర.. తమ ఆస్పత్రుల్లో బంగ్లాదేశ్‌ రోగులకు చికిత్స నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. నిరసన సందర్భంగా అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయంపై కొందరు దాడికి ప్రయత్నించటంతో కేంద్రం అలర్ట్‌ అయింది. కోల్‌కతాలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి కూడా బంగ్లాదేశ్ పేషెంట్లను చేర్చుకోవడం లేదు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై అకృత్యాలు, త్రివర్ణపతాకాన్ని అగౌరవరపచినందుకు నిరసనగా ఆస్పత్రి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో హిందువులపై దాడులకు నిరసనగా తెలుగురాష్ట్రాల్లోనూ నిరసనలు మొదలయ్యాయి.

షేక్‌ హసీనాని గద్దెదించేందుకు బంగ్లాదేశ్‌లో ఆగస్టులో భారీ హింస చెలరేగింది. ఆ సమయంలోనే అక్కడి నుంచి దాదాపు 7వేలమందికిపైగా భారతీయ విద్యార్థులు తిరిగొచ్చారు. అక్కడ పరిస్థితి అదుపుతప్పుతుండటంతో మిగిలిన విద్యార్థులు కూడా స్వదేశానికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్‌ పరిణామాలు ఆ దేశ అంతర్గత వ్యవహారమని భారత్‌ వ్యాఖ్యానించినా, అక్కడి మైనారిటీల భద్రతపై మొదట్నించీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అల్పసంఖ్యాక వర్గాల రక్షణ బంగ్లాదేశ్‌ ప్రభుత్వ బాధ్యతని తాజాగా పార్లమెంటులో భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. వాస్తవానికి బంగ్లాలో మైనారిటీల్ని భద్రంగా చూసుకుంటామని యూనస్‌ స్వయంగా ప్రధానికి ఫోన్‌ చేసి హామీ ఇచ్చారు. కానీ ఆయన తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టాకే బంగ్లాలో మతఛాందసవాద శక్తులు బలం పుంజుకుంటున్నాయి.

రాజకీయసంక్షోభం తర్వాత సొంతింటిని చక్కబెట్టుకోలేని బంగ్లాదేశ్‌ చీటికిమాటికీ మనమీదపడి ఏడుస్తోంది. బంగ్లాదేశ్‌ హింసపై త్రిపురలో నిరసనలో కొందరు.. అగర్తలాలో బంగ్లాదేశ్‌ దౌత్య కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై ఢాకాలోని భారత్‌ హైకమిషనర్‌కి సమన్లు జారీచేసింది బంగ్లాదేశ్‌. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీఇచ్చిన భారత్‌.. చర్యలకు ఉపక్రమించింది. రెండ్నెల్లక్రితం కూడా బంగ్లాదేశ్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై నిరసన వ్యక్తంచేసింది. జార్ఖండ్‌ ప్రచారంలో బంగ్లాదేశీయుల గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్‌ని పిలిపించి, నిరసన తెలియజేస్తూ లేఖ అందించింది. రెండు దేశాలమధ్య దౌత్యసంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయి బంగ్లా చర్యలు.

దేశంలోని మైనారిటీలను దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తూ అదేదో తన అంతర్గత వ్యవహారమన్నట్లు సమర్ధించుకుంటోంది బంగ్లాదేశ్‌. మాజీ ప్రధాని హసీనాని తమకు అప్పగించాలని ఒత్తిడితెస్తోంది. దేశం విడిచి పారిపోయిన హసీనాకు భారత్‌ ఆశ్రయం కల్పించడం బంగ్లాదేశ్‌కి మింగుడుపడటం లేదు. హసీనా అధికారంలో ఉండగా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. బంగ్లాదేశ్‌లో ఆగస్టు సంక్షోభం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్‌ యూనస్‌ అతివాదులు చెప్పినట్లు ఆడుతున్నారు. దీంతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా మారుతున్నాయి.

విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా ఆగస్టు 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్నారు. నిరసనల సమయంలో అవామీ లీగ్‌ మద్దతుదారులైన మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం హసీనాపై హత్య, ఇతర అభియోగాలతో కేసులు నమోదు చేసింది. అమాయకుల ప్రాణాలు పోవద్దనే తాను దేశంవిడిచానన్నారు హసీనా. బంగ్లాదేశ్‌లో అనిశ్చితికి తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనసే కారణమని నిందించారు. చిన్మయ్‌ అరెస్ట్‌ని తప్పుపట్టిన హసీనా ఆయన విడుదలకు డిమాండ్‌ చేశారు. దీంతో బంగ్లాదేశ్‌ పాలకులు అసహనంతో రగిలిపోతున్నారు.

బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడి ఈ డిసెంబర్ 16 నాటికి 53 ఏళ్లు పూర్తవుతాయి. భారత్‌ చొరవతోనే పాకిస్తాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది. కానీ ఇప్పుడదే బంగ్లాదేశ్‌.. చరిత్రను మరిచి పాకిస్తాన్‌ని ఆదర్శంగా తీసుకుంటోంది. బంగ్లాదేశ్ జాతి పితగా భావించే ముజ్మీర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూల్చివేతతోనే ఆయన ఆశయాలను బంగ్లాదేశ్ కాలరాచింది. భారత్‌పై విషంచిమ్మే పాకిస్తాన్‌తో చేతులు కలిపేందుకు బంగ్లాదేశ్‌ ప్రయత్నిస్తోంది. 53 ఏళ్ల బంగ్లాదేశ్ చరిత్రలో తొలిసారిగా కరాచీ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌ పోర్టుకు కార్గో నౌక రావడం.. ఆ రెండు దేశాల మధ్య లోపాయికారీ ఒప్పందాలకు నిదర్శనం. మొన్నటిదాకా భారత్‌తో స్నేహపూర్వకంగా ఉంటూ పాకిస్తాన్‌ను హసీనా దూరం పెడితే.. యూనస్‌ సర్కారు అందుకు విరుద్ధంగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది.

బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్కడి మైనారిటీలపై రెండు వేలకు పైగా దాడులు జరిగాయి. దాదాపు డెబ్భైకి పైనే ప్రార్థనా మందిరాలపై అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. బంగ్లాదేశ్‌తో 4వేల96 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది భారత్‌. ఆగస్టులో బంగ్లాదేశ్‌ సంక్షోభంతో వేలమంది మనదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. బంగ్లాదేశ్‌లో మత శక్తులు విజృంభిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం బలపడే ప్రమాదం ఉంది. గుంటనక్కలా కాచుకుని కూర్చున్న చైనా బంగ్లాపై పట్టుసాధిస్తే మనకు కొత్త సవాళ్లు తప్పవు. పాకిస్థాన్‌లాగే బంగ్లాదేశ్‌ మత ఛాందసత్వంలో కూరుకుపోతే ఆ దేశం పతనం అనివార్యమైనా.. అది మన దేశ భద్రతకు కూడా ప్రమాదమేనన్న ఆందోళన కూడా ఉంది.

బంగ్లాదేశ్‌ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది. దౌత్య సంబంధాలు క్షీణించకుండా బంగ్లాదేశ్‌ వ్యవహారంలో జాగ్రత్తగా అడుగులేస్తోంది భారత ప్రభుత్వం. బంగ్లాదేశ్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాన్ని మోహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. లోక్‌సభలో బంగ్లాదేశ్‌ అంశాన్ని లేవనెత్తింది తృణమూల్‌ కాంగ్రెస్‌. కేంద్రం మౌనం వీడి బంగ్లాదేశ్‌ పరిణామాలపై సభలో స్పందించాలన్నారు విపక్ష నేతలు.

దేశంలోని మైనార్టీలను రక్షిస్తామని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటోంది భారత్‌. హిందువులపై, ఆలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనార్టీలతోపాటు పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడే బాధ్యత ఢాకాదేనని పార్లమెంట్‌లో స్పష్టంచేశారు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేందుకు భారత్‌ చొరవచూపాలంటున్న బంగ్లాదేశ్‌.. తన దేశంలో పరిస్థితులను అదుపులో పెట్టే ప్రయత్నం మాత్రం చేయడంలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..