Afghanistan Crisis: నేను చేసింది కరెక్టే.. ఇతర దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోము.. అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన!

అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు బైడెన్‌ తొలిసారిగా క్లారిటీ ఇచ్చారు

Afghanistan Crisis: నేను చేసింది కరెక్టే.. ఇతర దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోము.. అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన!
Us President Joe Bidenn
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 17, 2021 | 8:10 AM

US President Joe Bidenn: అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభంపై అగ్రరాజ్యం స్పందించింది. అఫ్గాన్‌ వివాదానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు బైడెన్‌ తొలిసారిగా క్లారిటీ ఇచ్చారు. వైట్‌హౌజ్‌లో సోమవారం బైడెన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. అఫ్గాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని సమర్థించుకున్నారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటున్నట్లు స్పష్టం చేశారు.

అఫ్గాన్‌ నుంచి సైనికులను రప్పించడానికి సరైన సమయం అంటూ లేదని, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించానని జో బైడెన్‌ పేర్కొన్నారు. అయితే, అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. అఫ్గాన్ వివాదంపై వ్యుహాత్మకంగా వ్యవహరించక తప్పలేదన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది అమెరికా దళాలను అఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించడం జరిగిందన్నారు. లేదంటే ప్రపంచ వ్యాప్తంగా యుద్ద మేఘాలు కమ్ముకునేవన్నారు. యూఎస్ సైనిక దళాలను అఫ్గాన్‌కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడమే అవుతుందని భావించి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే తాను కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందన్నారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని బైడెన్‌ తెలిపారు.

అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్‌ హెచ్చరించారు. మరో దేశ అంతర్యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాల సొంత విషయంలో పోరాడాలని తాను సైనిక బలగాలకు చెప్పలేనన్నారు. నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని తెలుసని, అయితే మరో అధ్యక్షుడికి ఈ పనిని తాను బదిలీ చేయనన్నారు. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బైడెన్‌ తెలిపారు. అంతేకాని అఫ్గాన్‌ జాతి నిర్మాణం చేయడం తమ లక్ష్యం కాదన్నారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. అమెరికా దళాలకు సహాయం చేసిన స్థానిక అఫ్గాన్‌ ప్రజలను త్వరలోనే అమెరికాకు తరలిస్తామని, వారిపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు, అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని, సైనిక బలగాలను బైడెన్‌ విమర్శించారు. అఫ్గాన్‌ సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తాలిబన్లతో పోరాడలేకపోయారన్నారు. అఫ్గాన్‌ పౌర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్పం బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్‌ అన్నారు. అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బిలియన్‌ డాలర్లను అందించామని ఈ విషయంలో చైనా, రష్యా ఏం చేయలేకపోయాయని దుయ్యబట్టారు. అమెరికా దళాలు, సిబ్బందిపై తాలిబన్లు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని మరోసారి హెచ్చరించారు.

ఇక ఏమాత్రం అఫ్గాన్‌ సంక్షోభం అమెరికా జాతీయ భద్రత ఆసక్తి కాదన్నారు. అఫ్గానిస్థాన్‌ ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని, ఆ దేశ ప్రజలకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా అఫ్గాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు, సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే అఫ్గాన్‌లో ఉన్న అమెరికా పౌరులను తరలించనున్నట్లు బైడెన్‌ వివరించారు.

Read Also… 

Afghanistan Crisis: అఫ్ఘానిస్తాన్‌లో నిలిచిపోయిన విమానాల రాకపోకలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్న భారతీయులు!

Afghanistan Crisis: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు.. క్షేమంగా తీసుకువస్తాం..విదేశీ వ్యవహారాల శాఖ..