Germany to Vaccinate: జూన్ 7వతేదీ నుంచి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకా.. విద్యాసంవత్సరానికి ముందే వినియోగించుకోవాలన్న జర్మనీ ఛాన్సలర్
ఇప్పటివరకు పెద్ద వాళ్లకు మాత్రమే టీకా అందిస్తున్న దేశాలు పిల్లలకు సైతం వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించాయి. 12 ఏళ్ల వయసు పైబడిన పిల్లలకు జూన్ 7వతేదీ నుంచి కోవిడ్ టీకాలు ఇస్తామన్న జర్మనీ.
Covid 19 Vaccine to Children in Germany: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి టీకా ఒక్కటే మార్గమన్న నిపుణుల సూచనల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పెద్ద వాళ్లకు మాత్రమే టీకా అందిస్తున్న దేశాలు పిల్లలకు సైతం వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే జర్మనీ దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన పిల్లలకు జూన్ 7వతేదీ నుంచి కోవిడ్ టీకాలు ఇస్తామని జర్మనీ ఛాన్సలర్ డాక్టర్ ఏంంజెలా మెర్కెల్ వెల్లడించారు.
అయితే, పిల్లలకు కోవిడ్ టీకాలు వేయించుకోవడం తప్పనిసరి కాదని ఆమె స్పష్టం చేశారు. 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఫైజర్, బయోఎంటెక్ కోవిడ్ టీకాలు ఇవ్వవచ్చని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వతేదీ నుంచి 12ఏళ్ల వయసు పైబడిన పిల్లలు టీకాల కోసం నమోదు చేసుకోవచ్చని మెర్కెల్ చెప్పారు. కొత్త విద్యాసంవత్సరానికి ముందు ఆగస్టు నాటికి పిల్లలకు కోవిడ్ టీకా మొదటి డోసు ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లలకు కోవిడ్ టీకాలు వేయడం ద్వారా వారిలో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు. ఇదిలావుంటే, ఇప్పటికే కెనడా, అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే 12 ఏళ్ల వయసు పైగా పిల్లలకు టీకాలు వేస్తోంది.