China Corona: చైనాలో కరోనా కలవరం.. జీరో వ్యూహం అమలులో ప్రజల్లో వ్యతిరేకత

కరోనా కేసుల పెరుగుదల కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుతున్నా.. చైనా(China) లో మాత్రం తీవ్రంగా విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఆ దేశంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది....

China Corona: చైనాలో కరోనా కలవరం.. జీరో వ్యూహం అమలులో ప్రజల్లో వ్యతిరేకత
Ganesh Mudavath

|

Mar 26, 2022 | 6:25 AM

కరోనా కేసుల పెరుగుదల కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుతున్నా.. చైనా(China) లో మాత్రం తీవ్రంగా విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఆ దేశంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మార్చి నెలలోనే ఇప్పటివరకు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కొవిడ్‌ కట్టడికి అన్ని వ్యూహాలతో ముందుకెళ్తున్నామని అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు అంటున్నారు. చైనాలో పెరుగుతున్న కొవిడ్‌ విస్తృతి దృష్ట్యా పెద్ద నగరాలు లాక్‌డౌన్‌(Lock Down) లోకి వెళ్లిపోతున్నాయి. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 56వేల కేసులు నమోదైనట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ అధికారులు పేర్కొన్నారు. హాంకాంగ్‌లో నమోదవుతున్న కేసులు వీటికి అదనం. అయినప్పటికీ డైనమిక్‌ జీరో కొవిడ్‌(Zero Method) లక్ష్యాన్ని స్వల్ప కాలంలో సాధించేందుకు కృషి చేస్తున్నామని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ నిపుణులు వూ జూన్‌యూ పేర్కొన్నారు. చైనాలో కరోనా విస్తృతి పెరుగుతున్నప్పటికీ ‘జీరో కొవిడ్‌’ వ్యూహానికే కట్టుబడి ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది.

ఈ వ్యూహంతో లాక్‌డౌన్‌లు, భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వంటి కఠిన చర్యలు చేపడుతూ కేసుల సంఖ్యను సున్నాకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది. అయినప్పటికీ వైరస్‌ వ్యాప్తి తగ్గకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వచ్చింది. డైనమిక్‌ కొవిడ్‌ జీరో వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా నగరాలపై ఒకేసారి ఆంక్షలు విధించకుండా స్థానికంగా పరీక్షలు, కట్టడి చర్యలతో ముందుకు వెళ్తామని పేర్కొంది. చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ దేశంలోని చాలా మందికి టీకా చేరలేదని తెలుస్తోంది. ఆ దేశ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 60 ఏళ్ల వయసు పై బడిన వారిలోనే ఇంకా 5 కోట్ల మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదు. బూస్టర్‌ డోసుల పంపిణీ కూడా మందకొడిగానే సాగుతోంది.

హాంకాంగ్‌లోనూ కొవిడ్‌ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నెల రోజులుగా అక్కడ నిత్యం 200 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజూ పదివేలకుపైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మొదలైన వేవ్‌లో ఒక్క హాంకాంగ్‌ నగరంలోనే పదిలక్షల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Also Read

CSK vs KKR, IPL 2022 Match Prediction: తొలి పోరులో గెలిచేదెవరో.. చెన్నై వర్సెస్ కోల్‌కతా పూర్తి రికార్డులు ఎలా ఉన్నాయంటే?

IPL 2022: ఐపీఎల్‌ 2022లో అరంగేట్రం చేయనున్న 10 మంది విదేశీ ఆటగాళ్లు.. వారెవరంటే?

Caste Change: ఎవరైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు కులాన్ని మార్చుకోవచ్చా? చట్టం ఏం చెబుతోంది..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu