Covaxin: అమెరికాలో చిన్నారులకు కోవాగ్జిన్.. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ఆక్యూజెన్.. 

Covaxin in USA: భారత ఫార్మా దిగ్గజం.. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ టీకాకు ఇటీవలనే అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదముద్ర

Covaxin: అమెరికాలో చిన్నారులకు కోవాగ్జిన్.. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ఆక్యూజెన్.. 
Covaxin
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2021 | 9:21 AM

Covaxin in USA: భారత ఫార్మా దిగ్గజం.. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ టీకాకు ఇటీవలనే అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయం అనంతరం ఈ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులు కోరుతూ అగ్రరాజ్యం అమెరికాలో కూడా దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అమెరికాలో 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు కోరుతూ ఆక్యుజెన్‌ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని ఆక్యూజెన్‌ కంపనీ శుక్రవారం వెల్లడించింది. చిన్నారులపై చేసిన కోవాగ్జిన్‌ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను యూఎస్‌ ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) కు పంపినట్లు తెలిపింది. అయితే ఈ పరీక్షలేవీ అమెరికాలో జరగలేదు. భారత్‌లోని పలు ప్రదేశాల్లో చిన్నారులపై నిర్వహించిన ట్రయల్స్‌ డేటా ఆధారంగా ఆ కంపెనీ దరఖాస్తు చేసింది. ఈ కారణంగా కోవాగ్జిన్‌ టీకాకు ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తుందా.. లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా భారత్‌ బయోటెక్‌, ఆక్యూజెన్‌ భాగస్వామ్యంలో అభివృద్ధి అయిన కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించింది.

డబ్ల్యూహెచ్‌వో అనుమతుల అనంతరం 17 దేశాల్లో ఈ టీకాను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ తయారీలో ఇనాక్టివ్‌ వైరస్‌ టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది. పోలియో టీకా వంటి చాలావరకు పిల్లలకు వేసే వ్యాక్సిన్లను ఈ పద్ధతిలోనే తయారు చేస్తారని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కోవాగ్జిన్‌ టీకా పంపిణీకి అనుమతులు ఇవ్వాలని బైడెన్‌ ప్రభుత్వాన్ని ఓక్యుజెన్‌ కంపెనీ అభ్యర్థించింది. అయితే.. దీనిపై అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఎలాంటి ప్రకటన, నిర్ణయం వెలువడలేదు.

కాగా.. కోవాగ్జిన్ తీసుకున్న వారికి దేశంలోకి అనుమతిస్తున్నట్టు అమెరికా వెల్లడించింది. టీకా తీసుకున్న విదేశీయుల కోసం తాజాగా కొత్త ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసిన అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కోవాగ్జిన్‌ను ఆ జాబితాలో చేర్చింది. 8 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.