AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్‌లో కొత్త పవర్ గేమ్.. 35 ఏళ్ల తర్వాత ఎన్నికలు! మిర్జా ఫఖ్రుల్ చేతుల్లోకి అధ్యక్ష పదవి

బంగ్లాదేశ్‌లో 35 ఏళ్ల తర్వాత పోటీతో కూడిన అధ్యక్ష ఎన్నిక జరిగింది. BNP సీనియర్ నేత మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో ఆయనకు 255 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఓలి అహ్మద్‌కు 88 ఓట్లు వచ్చాయి.

బంగ్లాదేశ్‌లో కొత్త పవర్ గేమ్.. 35 ఏళ్ల తర్వాత ఎన్నికలు! మిర్జా ఫఖ్రుల్ చేతుల్లోకి అధ్యక్ష పదవి
Bangladesh New President
Siva Nagaraju
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 9:18 PM

Share

బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 35 ఏళ్ల తర్వాత తొలిసారి పోటీతో కూడిన అధ్యక్ష ఎన్నిక జరిగింది. అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) సీనియర్ నేత మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంటులో జరిగిన ఎన్నికల్లో ఆయనకు 255 ఓట్లు రాగా, జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మద్దతుతో పోటీ చేసిన కల్నల్ (రిటైర్డ్) ఓలి అహ్మద్‌కు 88 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే మిర్జా ఫఖ్రుల్ 167 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.

ఈ ఎన్నికలో మొత్తం 343 మంది పార్లమెంట్ సభ్యులు ఓటేశారు. మీర్జా ఫఖ్రుల్‌కు వచ్చిన 255 ఓట్లు, పోలైన ఓట్లలో దాదాపు 74 శాతం. ఓలి అహ్మద్‌కు 88 ఓట్లు, అంటే సుమారు 26 శాతం. ఈ సంఖ్యలే ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాల్లో అధికార BNP ఎంత బలంగా ఉందో చెబుతోంది.

1991 తర్వాత మళ్లీ పోటీతో అధ్యక్ష ఎన్నిక

బంగ్లాదేశ్‌లో అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. పార్లమెంట్ సభ్యులే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 1991లో అబ్దుర్ రహ్మాన్ బిస్వాస్ ఎన్నికైన తర్వాత అధ్యక్ష పదవికి ఇలా పోటీతో కూడిన ఎన్నిక జరగలేదు. దాదాపు 35 ఏళ్ల పాటు ఏకగ్రీవ లేదా ఒకే అభ్యర్థి ఎన్నికలే జరిగాయి. అందుకే 2026 ఎన్నికకు ప్రత్యేక ప్రాధాన్యం వచ్చింది.

అయితే ఈ ఎన్నికలో పోటీ ఉన్నప్పటికీ ఫలితం మాత్రం ముందే దాదాపు స్పష్టంగా కనిపించింది. కారణం.. పార్లమెంటులో BNP, దాని మిత్రపక్షాలకు రెండు మూడొంతుల మెజారిటీ ఉంది. ఫిబ్రవరి 2026 సాధారణ ఎన్నికల్లో BNP భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ పార్టీ అధినేత తారిక్ రెహ్మాన్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మీర్జా ఫఖ్రుల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అసలు కథ 2024లోనే మొదలు

మీర్జా ఫఖ్రుల్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. దీని వెనుక 2024లో బంగ్లాదేశ్‌ను కుదిపేసిన రాజకీయ సంక్షోభం ఉంది.

15 ఏళ్ల పాటు బంగ్లాదేశ్‌ను పాలించిన షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత అది దేశవ్యాప్త ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. హింసాత్మక పరిణామాలతో 2024 ఆగస్టు 5న హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. ఆమె నిష్క్రమణతో అవామీ లీగ్ ఆధిపత్యానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది.

ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దాదాపు 18 నెలల పాటు యూనస్ ప్రభుత్వం దేశాన్ని నడిపి ఎన్నికలకు మార్గం సుగమం చేసింది. చివరకు 2026 ఫిబ్రవరి ఎన్నికల్లో BNP ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

హసీనా తర్వాత అవామీ లీగ్ పరిస్థితి ఏంటి?

హసీనా నిష్క్రమణతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద మార్పు అవామీ లీగ్ బలహీనపడింది. పార్టీ కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. అనేక మంది నేతలు జైలుకు వెళ్లగా, మరికొందరు అజ్ఞాతంలోకి లేదా విదేశాలకు వెళ్లారు. హసీనాపై కూడా తీవ్రమైన కేసులు నమోదయ్యాయి.

అయితే అవామీ లీగ్ పూర్తిగా రాజకీయంగా అంతరించిపోయిందని చెప్పడం తొందరపాటు అవుతుంది. హసీనా తాజాగా 2026 డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. ఆమె తిరిగి వస్తే అది బంగ్లాదేశ్‌లో మరోసారి భారీ రాజకీయ ఉద్రిక్తతకు కారణమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆమెపై ఉన్న కేసులతో అరెస్టు చేసే వీలుంది.

మరి మాజీ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ ఎందుకు రాజీనామా చేశారు?

ఇక్కడ మరో కీలక మలుపు ఉంది. మహమ్మద్ షహాబుద్దీన్ 2023లో అధ్యక్షుడయ్యారు. ఆయన షేక్ హసీనాకు సన్నిహితుడిగా ఉన్నారు. కానీ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత షహాబుద్దీన్ కూడా రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

2026 జూలై 24న ఆయన ఆరోగ్య కారణాలను చూపుతూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనకు Autonomic Neuropathy అనే ఆరోగ్య సమస్య ఉందని, అప్పుడప్పుడు స్పృహ కోల్పోయే పరిస్థితి వస్తుందని రాయిటర్స్ రాసింది. అయితే ఆయన హసీనాకు సన్నిహితుడు కావడంతో రాజకీయ ఒత్తిడి కూడా రాజీనామా వెనుక కారణమై ఉండొచ్చనే చర్చ జరిగింది. ఆయన రాజీనామా తర్వాత పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ ఖాళీని మీర్జా ఫఖ్రుల్ ఎన్నికతో భర్తీ చేశారు.

మీర్జా ఫఖ్రుల్‌కు ఎవరి మద్దతు?

మీర్జా ఫఖ్రుల్ BNP అభ్యర్థి. ఆయన చాలా కాలంగా ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 2016 నుంచి BNP సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. హసీనా పాలనలో BNP తరఫున ప్రధాన ప్రతిపక్ష నేతల్లో ఒకరిగా ఉన్నారు. ఇప్పుడు అదే నేత దేశాధ్యక్షుడిగా మారారు.

ఇక ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన ఓలి అహ్మద్ మాజీ ఆర్మీ అధికారి, Liberal Democratic Party (LDP) నేత. ఆయనకు జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల ప్రతిపక్ష కూటమి మద్దతు ఇచ్చింది. అందువల్ల ఈ ఎన్నికను కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగా చూడటం కంటే.. BNP ఆధిపత్యం vs జమాత్ నేతృత్వంలోని ప్రతిపక్ష శక్తులు మధ్య పార్లమెంటరీ బలాబలాల ప్రతిబింబంగా చూడాలి.

మీర్జా ఫఖ్రుల్.. ఓలి అహ్మద్ మధ్య అసలు తేడా

మీర్జా ఫఖ్రుల్ సీనియర్ రాజకీయ నాయకుడు. BNPలో దశాబ్దాల అనుభవం ఉంది. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన రాజకీయ పోరాటంలో ఆయన పార్టీకి కీలక ముఖంగా ఉన్నారు. ఓలి అహ్మద్ మాత్రం మాజీ సైనిక అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన వ్యక్తి. ఆయన LDPకి నాయకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు జమాత్ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి మద్దతు ఇచ్చింది.

ఫలితాల్లో భారీ తేడా

  • మీర్జా ఫఖ్రుల్ — 255 ఓట్లు
  • ఓలి అహ్మద్ — 88 ఓట్లు
  • ఆధిక్యం — 167 ఓట్లు.

అధ్యక్షుడి చేతుల్లో ఎంత అధికారం ఉంటుంది?

బంగ్లాదేశ్‌లో అధ్యక్ష పదవి అత్యున్నత రాజ్యాంగ పదవి అయినప్పటికీ ఎగ్జిక్యూటివ్ పవర్ ప్రధానమంత్రి, కేబినెట్ చేతుల్లో ఉంటుంది. అధ్యక్షుడు దేశాధినేత, సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్‌గా ఉంటారు. కానీ రోజువారీ ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రధాని పాత్రే కీలకం. అందుకే మీర్జా ఫఖ్రుల్ అధ్యక్షుడవడం కంటే తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని BNP ప్రభుత్వం దేశాన్ని ఎలా నడిపిస్తుంది? అన్నదే అసలు ప్రశ్న.

ఇక ముందు ఎలా ఉండబోతోంది?

ప్రస్తుతం బంగ్లాదేశ్ ఒక కొత్త రాజకీయ దశలోకి ప్రవేశించింది. హసీనా–అవామీ లీగ్ ఆధిపత్యం ముగిసింది. యూనస్ తాత్కాలిక పాలన ముగిసింది. BNP అధికారంలోకి వచ్చింది. తారిక్ రెహ్మాన్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు మీర్జా ఫఖ్రుల్ అధ్యక్షుడయ్యారు. అంటే దేశంలోని ప్రధాన రెండు రాజ్యాంగ పదవుల్లో BNPకి చెందిన నేతలే ఉన్నారు. ఇది తారిక్ రెహ్మాన్ ప్రభుత్వానికి రాజకీయంగా బలమైన స్థితిని ఇస్తుంది.

కానీ సవాళ్లు కూడా లేకపోలేదు. అవామీ లీగ్‌ను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి? హసీనాను తిరిగి దేశానికి రప్పించే అంశం ఎలా పరిష్కరించాలి? జమాత్-ఎ-ఇస్లామీ ప్రభావం ఎంత పెరుగుతుంది? విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన కొత్త రాజకీయ శక్తులకు ఎంత స్పేస్‌ ఉంటుంది? దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా స్థిరపరచాలి? ఇవన్నీ తారిక్ రెహ్మాన్ ప్రభుత్వానికి పరీక్షలే.

ఇక భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు కూడా కీలకం. హసీనా భారత్‌లో ఉండటం, ఆమెను తిరిగి అప్పగించాలని ఢాకా కోరడం, దీనిపై రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత కొనసాగడం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది.

చివరిగా…

2024లో హసీనా నిష్క్రమణతో మొదలైన బంగ్లాదేశ్ రాజకీయ పరివర్తన.. 2026లో మరో కీలక దశకు చేరుకుంది. ఈ ఎన్నికను కేవలం బంగ్లాదేశ్‌కు కొత్త అధ్యక్షుడు అనే వార్తగా చూడటం కంటే.. హసీనా తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త పవర్ మ్యాప్ పూర్తయిందా అనే కోణంలో చూడాలి. హసీనా పోయారు. యూనస్ వచ్చారు. BNP అధికారంలోకి వచ్చింది. తారిక్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు మీర్జా ఫఖ్రుల్ అధ్యక్షుడయ్యారు. బంగ్లాదేశ్‌లో పాతసీసాలో కొత్త సారాయిలా పాత రాజకీయ అధ్యాయం ముగిసి.. కొత్త పవర్ గేమ్ మొదలైంది.

కొండవీటి శివనాగరాజు డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9

Follow Us