AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఓరి మీ మాయ పాడుగాను.. కుక్క, గేదె చర్మాలకు చారలు వేసి..

కడప జిల్లా మైదుకూరులో నకిలీ పులి చర్మాల దందా గుట్టురట్టయ్యింది. అటవీ అధికారులు, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వీరు శునకాలు, గేదెల చర్మాలపై పులి చారలు వేసి, నకిలీ పులిగోర్లతో కలిపి అసలైనవిగా నమ్మించి విక్రయిస్తున్నారు. ఒక చుక్కల దుప్పి చర్మంతో పాటు నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Andhra: ఓరి మీ మాయ పాడుగాను.. కుక్క, గేదె చర్మాలకు చారలు వేసి..
Illegal Wildlife Trade
Ram Naramaneni
|

Updated on: Oct 05, 2026 | 12:00 PM

Share

వన్యప్రాణి సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఒక అంతర్జాతీయ ముఠా కడప జిల్లాలో పోలీసులకు పట్టుబడింది. మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్డులో ఉన్న చౌడేశ్వరి నగర్‌లోని ఓ ఇంట్లో నకిలీ పులి చర్మాలు, గోర్లతో వ్యాపారం చేస్తున్న ముగ్గురు నిందితులను అటవీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న ముగ్గురు వ్యక్తులు పక్క రాష్ట్రం నుంచి వచ్చి, కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని ఓ మారుమూల గ్రామంలోని ఇంటిని అడ్డాగా చేసుకుని తమ వ్యాపార లావాదేవీలను చర్చిస్తుండగా, పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. వారి చేతులకు సంకెళ్ళు వేసి, వ్యాపారం మాటున సాగిస్తున్న నకిలీ దందాను చూసి ఆశ్చర్యపోయారు.

ఈ ముఠా సభ్యులు వన్యప్రాణులను వేటాడి వాటి చర్మంతో వ్యాపారం చేస్తుండేవారని, అవి దొరకనప్పుడు నకిలీ చర్మాలను, గోర్లను తయారు చేసి, వాటిని బహిరంగ మార్కెట్లలో అసలైనవిగా నమ్మించి సొమ్ము చేసుకుంటున్నారని విచారణలో వెల్లడైంది. నిందితులను మైదుకూరుకు చెందిన మడక ప్రసాద్, అట్లూరు మండలంలోని రంగంపల్లికి చెందిన కాటాదాసరి వెంకటయ్య, కర్ణాటక రాష్ట్రంలోని గౌరీపురకు చెందిన గొట్టిబోయిన ప్రసాద్‌గా గుర్తించారు. ఈ ముగ్గురు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అడవి జంతువుల చర్మాన్ని విక్రయించే మార్గాన్ని ఎంచుకున్నారు. వన్యప్రాణి ఉత్పత్తులకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతో తమ జేబులు నిండుతాయనుకున్నారు. అయితే, వేటాడిన ప్రతిసారి వన్యప్రాణులు బోనులో చిక్కడం కష్టమవడంతో, వాటి మాటున నకిలీ వస్తువులను తయారుచేసి మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం ఆరు చర్మాలలో ఒకటి చుక్కల దుప్పి చర్మం కాగా, మిగిలిన ఐదు చర్మాలు నకిలీవని ప్రాథమిక పరిశీలనలో తేలింది.

అధికారులు వ్యక్తం చేసిన అనుమానం ప్రకారం, శునకాలు, గేదెల చర్మాలను తీసుకుని వాటికి ఆర్టిస్టులతో పులి చారలు వేయించి వీటిని తయారు చేసి ఉండవచ్చు. అలాగే, స్వాధీనం చేసుకున్న 23 గోర్లు సైతం నకిలీవేనని గుర్తించారు. ఈ చర్మాలు, గోర్ల పూర్తి నిర్ధారణ కోసం వాటిని ప్రయోగశాలకు పంపించినట్లు డిఎఫ్ఓ రాజశేఖర్ బాబు వెల్లడించారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకోవాలనుకోగా, ఒకరు తప్పించుకున్నారని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ముఠాకు సంబంధించిన లింకులు కడప జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు కడప పట్టణంలో కూడా ఉన్నాయని ఆచూకీ లభించిందని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని అధికారులు తెలియజేశారు. వన్యప్రాణుల చట్టాన్ని కఠినతరం చేసినప్పటికీ, అక్రమార్జనకు అలవాటు పడ్డ కేటుగాళ్ళు దాన్ని పట్టించుకోకుండా తమ జేబులు నిండితే చాలని వ్యవహరిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. అయితే, చట్టాన్ని ఎంతగా బేఖాతరు చేసి సొమ్ము చేసుకుందామన్నా చివరకు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని ఈ సంఘటనతో పోలీసులు మరోసారి నిరూపించారు.

Follow Us