Nuclear Race: జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు!
చంద్రుడిపై శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అగ్రరాజ్యాల మధ్య సరికొత్త పోటీ నెలకొంది. చంద్రుడిపై అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు అమెరికా, రష్యా, చైనా దేశాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. భవిష్యత్ అంతరిక్ష అన్వేషణ, చంద్రుడిపై సహజ వనరుల వెలికితీత, సుదూర అంతరిక్ష మిషన్ల నిర్వహణకు ఈ అణుశక్తి అత్యంత కీలకమని భావించిన మూడు దేశాలు.. వీలైనంత త్వరగా చంద్రుడిపై అణు రియాక్టర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.

భూమిపైనే కాదు.. చంద్రుడిపై కూడా తమ అధిపత్యాన్ని చలాయించాలనే లక్ష్యంతో.. అక్కడ శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా, రష్యా, చైనా పోటీ పడుతున్నాయి. చంద్రుడిపై న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేయాలని మూడు దేశాలు చూస్తాయి. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఎలాంటి మెయింటేనెన్స్ లేకుండా అంతరిక్ష ప్రయాణాన్ని తట్టుకుని, చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నిరంతరం పనిచేసేలా ఓ అణు రియాక్టర్‌ను రూపొందించాలని గత ఆగస్టులో నాసా సంబంధిత కాంట్రాక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలస్తోంది. 2030 డిసెంబర్ నాటికి ఈ రియాక్టర్‌ను రూపొందించి. దాన్ని ప్రయోగానికి సిద్ధం చేయాలని సూచించినట్టు సమాచారం.
అలాగే చంద్రుడిపై న్యూక్లియర్ రియాక్టర్ ఏర్పాటు విషయంలో కలిసి పనిచేస్తున్న చైనా, రష్యా దేశాలు సైతం 2036 నాటికి సెలీనా అనే లూనార్ రియాక్టర్‌ను చంద్రుడి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాయి. చైనా నేతృత్వంలో నిర్మించే చంద్ర స్థావరాలకు విద్యుత్ అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాయి.
అసలు చంద్రుడిపై అణు రియాక్టర్లు ఎందుకు అవసరం?
చంద్రుడిపై మానవులు నివసించడానికి శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేయాలంటే అక్కడ నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. అయితే సోలార్ ప్యానల్స్ ద్వారా పగటి వేళల్లో మనం చంద్రుడిపై కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. కానీ చంద్రుడిపై రాత్రి సమయం రెండు వారాల పాటు ఉంటుందట.. ఆ టైంలో సౌరశక్తి నుంచి మనం విద్యుత్ ఉత్పత్తి చేయలేం.. కాబట్టి ప్రత్యామ్నాయం చాలా అవసరం. అందుకే మానవ ప్రమేయం లేకుండా నిరంతరం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న అణు రియాక్టర్లును ఏర్పాటు చేయాలని ఆగ్రరాజ్యాలు చూస్తున్నాయి.
అయితే ప్రారంభ దశలో నాసా, చైనాలు సౌరశక్తి, రేడియో ఐసోటోప్ వ్యవస్థల వాడి వాహనాలు, పరికరాలను ఛార్జ్ చేయాలని అనుకున్నాయి. కానీ భారీ స్థావరాల నిర్వహణకు ఇవి సరిపోవని.. రియాక్టర్లు కచ్చితంగా అవసరమనే అభిప్రాయానికి వచ్చాయి. దీనికి అనుగుణంగానే దీర్ఘకాలికంగా చంద్రుడిపై విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు.. 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఐదేళ్ల పాటు స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం గల లూనార్ రియాక్టర్ 1 అనే అను రియాక్టర్‌ను రూపొందిస్తోంది. అలాగే రష్యా, చైనా సైతం 10 కిలోవాట్లా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. పదేళ్ల పాటు సేవలందించే సిలినా అనే రియాక్టర్‌ను రూపొందిస్తోంది.
భద్రతా సవాళ్లు, రేడియేషన్ ముప్పు
అయితే చంద్రుడిపై ఈ అణు రియాక్టర్ల ఏర్పాటు కారణంగా పెను ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ రాకెట్ ప్రయోగం విఫలమైతే రియాక్టర్లు పేలిపోయి, అంతరిక్షం, భూ వాతావరణంలో రేడియోధార్మిక పదార్థాలు వెదజల్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే భూమిపై ఉన్నట్లుగా చంద్రుడిపై బలమైన రక్షణ కవచాలను నిర్మించడం ఎంతో కష్టంతో కూడుకున్నదని.. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు, సాంకేతిక పరికరాలు రేడియేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఈ రియాక్టర్ల చుట్టూ ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయాలి అంటున్నారు.
చంద్రుడిపై ఆధిపత్యం ఎవరిది?
అయితే ఈ మూడు దేశాల మధ్య నెలకొన్న అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ ప్రకారం చంద్రుడు.. ఏ ఒక్క దేశానికి సొంతం కాదని.. భద్రతా కారణాల పేరుతో రియాక్టర్ల చుట్టూ నిషేధిత ప్రాంతాలు ఏర్పాటు చేస్తే.. ఇతర దేశాల వ్యోమగాములు, రోవర్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందనే ఆందోళన మొదలైంది.ఇది అంతరిక్షంలో స్వేచ్ఛా సంచార నిబంధనలకు విరుద్ధమని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
