అత్యధిక మంది భారతీయులను ఉరితీసిన దేశం ఏదో తెలుసా..?
విదేశీ జైళ్లలో ఎంతో మంది భారతీయులు మగ్గిపోతున్నారు. అందులో ఎంతోమందికి ఉరిశిక్షలు పడ్డాయి. పలు ఉరిశిక్షలు కూడా అమలు అయ్యాయి. ఇప్పుడు యెమన్‌లో నిమిష ప్రియ ఉరిశిక్ష చర్చనీయాంశంగా మారింది. తాత్కాలికంగా ఆమె ఉరి వాయిదా పడగా.. దాన్ని ఆపేందుకు చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏఏ దేశాల్లో భారతీయులకు ఉరిశిక్ష పడిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. ప్రస్తుతం ఆమె యెమెన్ రాజధాని సనాలోని సెంట్రల్ జైలులో ఉంది. తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మహదీని హత్య చేసినట్లు నిమిషాపై ఆరోపణలు ఉన్నాయి. అతని మృతదేహం 2017లో నీటి ట్యాంక్‌లో లభ్యమైంది. తలాల్ తనను దోపిడీ చేశాడని నిమిషా ఆరోపించారు. అతని వద్ద నా పాస్ట్ పోర్టు ఉండడంతో తిరిగి తీసుకోవడానికి ఇచ్చిన మత్తు మందు అధిక మోతాదు కావడం వల్ల అతడు చనిపోయాడని తెలిపింది. అయితే విదేశాలలో భారత వ్యక్తికి మరణశిక్ష పడడం ఇది మొదటిసారి కాదు. అనేక దేశాలలో భారతీయులను ఉరితీసిన ఘటనలు ఉన్నాయి. వివిధ దేశాలలో డజన్ల కొద్దీ భారతీయులు జైలులో ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వీటిని ధృవీకరిస్తున్నాయి. భారతీయులను ఎన్ని దేశాలలో ఉరితీశారు, ఎక్కడ గరిష్ట మరణశిక్ష విధించారు, ఎన్ని దేశాలలో జైలులో ఉన్నారు వంటి వివరాలు విదేశాంగ నివేదికలో ఉన్నాయి.
భారతీయులను ఉరితీసిన దేశాలు..
ఎక్కువ మంది భారతీయులను ఉరితీసే దేశాలలో యెమెన్ లేదా సౌదీ అరేబియా లేవు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుతం విదేశాలలో కనీసం 10,152 మంది భారతీయులు ఉన్నారు. గత ఐదేళ్లలో 47 మంది భారతీయులకు విదేశాలలో మరణశిక్ష అమలు అయ్యింది. భారతీయులకు మరణశిక్ష విధించిన దేశాలలో మలేషియా, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, జింబాబ్వే, జమైకా దేశాలు ఉన్నాయి. ఎక్కువ మంది భారతీయులను ఉరితీసిన దేశం కువైట్. 2020-2024 మధ్య కువైట్‌లో 25 మంది భారతీయులను ఉరితీశారు. అయితే యూఏఈలో ఉరితీయబడిన భారతీయ ఖైదీలకు సంబంధించిన డేటా విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద లేదని ప్రభుత్వం తెలిపింది. యూఏఈలో చాలా మంది భారతీయులను ఉరితీశారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. షహజాది ఖాన్, ముహమ్మద్ రినాష్, మురళీధరన్ పెరుమ్తట్ట వలప్పిల్ వంటి పేర్లు అందులో ఉన్నాయి.
మరణ శిక్షపడిన ఖైదీలు..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 25 మంది భారతీయ పౌరులకు మరణశిక్ష పడింది. సౌదీ అరేబియాలో 11 మంది భారతీయ పౌరులకు మరణశిక్ష విధించినట్లు నివేదిక తెలిపింది. అత్యధికంగా 2,633 మంది భారతీయ ఖైదీలు సౌదీ అరేబియా జైళ్లలో ఉన్నారు. తరువాత 2,518 మంది యూఏఈ జైళ్లలో, 1,317 మంది ఖైదీలు నేపాల్ జైళ్లలో ఉన్నారు.
2020-2024 మధ్య కువైట్‌లో 25 మంది భారతీయులను ఉరితీశారు. ‘‘ఏక్కడైనా భారతీయ పౌరుడి నిర్బంధం లేదా అరెస్టు గురించి సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక విదేశాంగ కార్యాలయం, ఆయా దేశాల అధికారులను సంప్రదిస్తుంది. అలా భారతీయ పౌరుడికి కాన్సులేట్ సహాయం చేస్తుంది. వీలైనంత వరకు చట్టపరమైన సహాయం, కాన్సులేట్ యాక్సెస్ అందించడంలో ప్రభుత్వం సహాయం చేస్తుందని’’ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చెప్పారు. ప్రభుత్వం వారి విడుదల, స్వదేశానికి తిరిగి పంపడాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందన్నారు. దీంతో పాటు అప్పీల్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయడం వంటి చట్టపరమైన చర్యలలోనూ విదేశాంగ శాఖ సాయం చేస్తుందని స్పష్టం చేశారు.
