AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIతో మానవాళికి ముప్పు.. ఈ దశాబ్దంలోనే మనుషులంతా అంతమయ్యే ప్రమాదం!? సంచలన హెచ్చరిక

Artificial Intelligence News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై Anthropic పరిశోధకులు సంచలన హెచ్చరికలు చేశారు. అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థలు వచ్చే దశాబ్దంలోనే మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో AI భద్రత, నియంత్రణ, అమెరికా-చైనా పోటీపై రాజకీయ చర్చ మళ్లీ వేడెక్కింది.

AIతో మానవాళికి ముప్పు.. ఈ దశాబ్దంలోనే మనుషులంతా అంతమయ్యే ప్రమాదం!? సంచలన హెచ్చరిక
Ai Could Pose An Extinction Risk
Rajashekher G
|

Updated on: Sep 12, 2026 | 9:37 AM

Share

AI Could Pose an Extinction Risk Telugu: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ఇప్పటివరకు జరిగిన చర్చలు ఎక్కువగా భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాల చుట్టూనే సాగాయి. అయితే ఈ వారం అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలతో AI ప్రమాదం అనే అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. అత్యాధునిక AI వ్యవస్థలు భవిష్యత్తులో మానవాళికే ముప్పుగా మారే అవకాశం ఉందని వాటిని అభివృద్ధి చేస్తున్న కొందరు పరిశోధకులు తీవ్ర హెచ్చరికలు చేశారు.

‘AI మనుషులందరినీ చంపే అవకాశం ఉంది’

Anthropic సంస్థకు చెందిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. AIని అభివృద్ధి చేస్తున్న వ్యక్తులు.. ఈ సాంకేతికత ఈ దశాబ్దం ముగిసేలోపే మానవాళిని అంతం చేసే అవకాశం ఉందని నిజంగానే నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. Anthropic శాస్త్రవేత్త ఇవాన్ హ్యూబింగర్ కూడా ఈ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. ‘‘AI మానవులందరినీ అంతం చేసే అవకాశం ఉందని మేము నిజంగానే నమ్ముతున్నాం’’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వచ్చే దశాబ్దంలో AI కారణంగా మానవాళి అంతమయ్యే ప్రమాదం దాదాపు 10 శాతం ఉందని వ్యక్తిగతంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు.

ఈసారి హెచ్చరికలకు ఎందుకింత ప్రాధాన్యం?

AI ప్రమాదాలపై ఆందోళనలు కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం వస్తున్న హెచ్చరికలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించడానికి కొన్ని కారణాలున్నాయి. AI ఏజెంట్లు తమ పరిధిని దాటి వ్యవహరించడం, బాహ్య కంప్యూటర్ వ్యవస్థలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. అదే సమయంలో AI భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొందరు సేఫ్టీ పరిశోధకులు ప్రముఖ AI కంపెనీలను వీడటం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో అమెరికా చట్టసభ సభ్యుల ముందున్న ప్రశ్నలు కూడా మారుతున్నాయి. AI వల్ల ఉద్యోగాలు ఎలా మారతాయి? కంప్యూటర్ల వినియోగం ఎలా మారుతుంది? అనే అంశాలతో పాటు.. ఈ వ్యవస్థలు ఊహించిన దానికంటే వేగంగా శక్తివంతమైతే, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వాల వద్ద తగిన వ్యవస్థలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి.

ఇవి కూడా చదవండి

డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఒకే మాట

AI ప్రమాదాలపై అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా స్పందిస్తున్నారు. అరిజోనా డెమొక్రాట్ సెనేటర్ మార్క్ కెల్లీ.. AI సాంకేతికత వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వాషింగ్టన్ సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో AIకి సంబంధించిన ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మరింత కీలక పాత్ర కల్పించే చట్టాలపై చర్చ మొదలైంది. టెక్సాస్ రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ కూడా AI ‘విపత్తు ప్రమాదాల’పై నియంత్రణ అవసరాన్ని ప్రస్తావించారు. అమెరికా వాణిజ్య శాఖపై పర్యవేక్షణ కలిగిన సెనేట్ కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తుండటంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు ఫ్లోరిడా రిపబ్లికన్ ప్రతినిధి అన్నా పౌలినా లూనా.. AIపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌ను కోరారు. ప్రస్తుతం ప్రతినిధుల సభ విరామంలో ఉండగా, వచ్చే వారం తిరిగి సమావేశం కానుంది.

ట్రంప్ ఆందోళన మాత్రం మరో అంశంపై..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం AI వల్ల మానవాళి అంతరించిపోతుందనే అంశంపై పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు. ఆయన దృష్టి ప్రధానంగా అమెరికా-చైనా మధ్య జరుగుతున్న AI పోటీపై ఉంది. AIలో అమెరికా వెనుకబడితే దేశానికి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా చైనా కంటే AI రంగంలో ముందంజలో ఉందని, ఈ ఆధిక్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీంతో AIపై అమెరికా విధానంలో ఒక కీలకమైన విభేదం స్పష్టమవుతోంది. ఒకవైపు అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థలపై భద్రతా నియంత్రణలు అవసరమని నిపుణులు, కొందరు చట్టసభ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు అధిక నియంత్రణలు విధిస్తే చైనాతో పోటీలో అమెరికా వెనుకబడే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా ఉంది.

AI నియంత్రణపై అమెరికాలో కొత్త చర్చ

AI నియంత్రణ విషయంలో అమెరికా ప్రస్తుతం కీలకమైన దశలో ఉంది. ఈ నెలలో G20 దేశాలు AIపై మరీ కఠినమైన నియంత్రణలు విధించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలనే వైఖరిని అమెరికా ప్రోత్సహించింది. అదే సమయంలో దేశంలో మాత్రం AI భద్రతపై మరింత కఠినమైన నియమాలు, స్వతంత్ర పర్యవేక్షణపై చర్చ పెరుగుతోంది. అయితే AI కంపెనీలు భద్రతను పూర్తిగా విస్మరిస్తున్నాయని చెప్పలేం. Anthropic సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ, బయాలజీ వంటి ప్రమాదకర సామర్థ్యాలున్న AI మోడళ్లను మరింత కఠినంగా పరీక్షించడం కొనసాగిస్తామని తెలిపారు.

OpenAI కూడా అభివృద్ధి వేగాన్ని తగ్గించేందుకు సిద్ధమే?

AI రంగంలోని మరో దిగ్గజ సంస్థ OpenAI కూడా ఇదే తరహా ప్రశ్నలను ఎదుర్కొంటోంది. సంస్థ CEO సామ్ ఆల్ట్‌మన్ ఈ వారం జరిగిన కంపెనీ సమావేశంలో AI వ్యవస్థల అభివృద్ధి వేగాన్ని తగ్గించే అంశంపై సంస్థ సిద్ధంగా ఉందని ఉద్యోగులతో చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఇదే సమయంలో అమెరికాలో తప్పనిసరి జాతీయ AI భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని OpenAI కోరుతోంది. అంటే ఒక్కో AI కంపెనీ తమకు నచ్చిన భద్రతా ప్రమాణాలను పాటించడం కాకుండా.. దేశవ్యాప్తంగా అన్ని సంస్థలకు వర్తించే కనీస భద్రతా నియమాలు ఉండాలని ఆ సంస్థ భావిస్తోంది.

అసలు సమస్య ఇదే..

AI రంగంలో పోటీ పెరుగుతున్న కొద్దీ కంపెనీలు వేగంగా కొత్త మోడళ్లను విడుదల చేయాలని చూస్తున్నాయి. అయితే భద్రతా చర్యలు తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తే పోటీలో వెనుకబడే అవకాశం ఉంది. మరోవైపు భద్రతను విస్మరించి వేగంగా ముందుకెళ్తే ఊహించని ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే అమెరికా ప్రభుత్వానికి ఇప్పుడు రెండు అంశాలను సమతుల్యం చేయడం పెద్ద సవాలుగా మారింది. AI అభివృద్ధిలో చైనా కంటే ముందుండటం ఒకవైపు.. అత్యంత శక్తివంతమైన AI వల్ల మానవాళికి, సమాజానికి ఎదురయ్యే ప్రమాదాలను నియంత్రించడం మరోవైపు. ఈ రెండింటినీ ఏకకాలంలో ఎలా సాధించాలన్నదే రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.

Follow Us