గేమింగ్ కి బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి గేమింగ్ స్టార్‌గా మారి..
గేమింగ్‌కు బానిసై చదువులో వెనకబడ్డాడని కొడుకును ఇంటర్నెట్ కేఫ్‌ల నుంచి ఇంటికి లాక్కొచ్చిన తల్లి, 2020లో 50 ఏళ్లు దాటిన తర్వాత గేమింగ్ మొదలుపెట్టింది. ఇప్పుడామెకు 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రోజూ ఆమె లైవ్‌స్ట్రీమ్‌ను సుమారు 10 వేల మంది వీక్షిస్తున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మెయిజౌలో పెరిగిన జువాన్ పెద్దగా చదువుకోలేదు. సేల్స్ రంగంలో పని చేసి దుస్తులను అమ్మేది, పదేళ్ల క్రితం రిటైర్ అయింది. 20 ఏళ్ల క్రితం ఆమె చిన్న కుమారుడు సువోడె గేమింగ్‌కు బాగా అలవాటు పడ్డాడు. చదువులో వెనుకబడటంతో వెతుకుతూ ఇంటర్నెట్ కేఫ్‌లకు వెళ్లి కొడుకును బలవంతంగా ఇంటికి తీసుకొచ్చేది. అలాంటి తల్లి ఒకరోజు అదే గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతుందని ఎవరూ ఊహించలేదు.
2020లో ఊహించని మలుపు
కరోనా మహమ్మారి సమయంలో కుటుంబమంతా ఇంటికే పరిమితమైంది. అప్పటికే ఉద్యోగం వదిలేసిన సువోడె ఇంట్లో గంటల తరబడి గేమ్స్ ఆడేవాడు. కొడుకు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉన్న జువాన్‌లో ఓ ప్రశ్న మొదలైంది. అతను అంతసేపు ఆడుతున్న ఆ గేమ్‌లో అసలు ఏముంది? కొడుకును మందలించడానికి బదులు గేమ్‌ను తనే నేర్చుకోవాలని నిర్ణయించింది. గేమ్ ఆడటం నాకు నేర్పించు అని కొడుకును అడిగింది. సువోడె ఆశ్చర్యపోయి ఆ వెంటనే తల్లికి ఉన్న ఇంట్రెస్ట్ చూసి నేర్పడం మొదలుపెట్టాడు. మొదట జువాన్‌కు గేమింగ్ కష్టంగా అనిపించింది. క్యారెక్టర్‌ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక గోడలకు ఢీకొట్టేది, వేరే దిశలో తిప్పేది, వర్చువల్ మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడేది. పైగా ఆమె చూపూ బలహీనపడుతోంది. యువ గేమర్లతో పోలిస్తే రియాక్షన్ స్పీడ్ కూడా తక్కువే. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు రోజూ ప్రాక్టీస్ చేసేది. కొంత కాలానికి Counter-Strike షూటింగ్ గేమ్‌లో ఆమె పట్టు సాధించింది. పొజిషనింగ్, టార్గెట్, ఎప్పుడు దాడి చేయాలి, ఎప్పుడు డిఫెండ్ చేయాలి వంటి మెళకువల్ని ఆమెకు కొడుకు నేర్పించాడు. ఒకప్పుడు గేమ్ ఆడొద్దని చెప్పిన తల్లే ఇప్పుడు కొడుకుతో గేమింగ్ వ్యూహాల గురించి చర్చించడం మొదలుపెట్టింది.
చివరికి కొడుకే Wi-Fi ఆపేయాల్సిన పరిస్థితి!
జువాన్ రాత్రంతా నిద్రపోకుండా గేమ్స్ ఆడేది. ఒకప్పుడు గేమింగ్ కేఫెల నుంచి బలవంతంగా ఇంటికి లాక్కొచ్చిన కొడుక్కి.. ఇప్పుడు తల్లి గేమింగ్ ను ఆపేలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే కొడుకు ‘చాలు అమ్మా.. గేమింగ్ ఆపు. వెళ్లి నిద్రపో!’ అని చెబుతుంటాడు. తల్లి గేమింగ్‌లో మునిగిపోయి నిద్ర పోకపోవడంతో సువోడె చివరకు ఇంటి Wi-Fi రాత్రి సమయంలో ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా సెట్ చేశాడట.
ఆమె నిజంగానే ఆడుతోందా? అనుమానాలు
జువాన్ కు గేమింగ్ నైపుణ్యం పెరిగేకొద్దీ ఆమెకు ఫాలోవర్లు కూడా పెరిగారు. అయితే కొందరు గేమర్లు ఆమే స్వయంగా గేమ్ ఆడుతోందంటే నమ్మలేదు. ‘ఇంకెవరైనా గేమ్ ఆడుతున్నారా?’ ‘వీడియో ఫేక్ కాదా?’ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో సువోడె తన తల్లి చేతులు, ముఖం, కంప్యూటర్ స్క్రీన్ అన్నీ ఒకేసారి కనిపించేలా పలు కెమెరాలు ఏర్పాటు చేశాడు. జువాన్ స్వయంగా గేమ్ ఆడుతున్నట్లు ప్రత్యక్షంగా చూసిన గేమర్ల అనుమానాలకు అక్కడితో తెరపడింది. అసలు సంచలనం 2024లో జరిగింది. 58 ఏళ్ల వయసులో జువాన్ ఓ Counter-Strike ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన డానిల్ ‘donk’ ను ఒక్క షాట్‌తో ఎలిమినేట్ చేసింది. ఆ సమయంలో ఆ క్లిప్ పెద్దగా వైరల్ కాలేదు. కొన్ని నెలల తర్వాత ఆమె ఫస్ట్-పర్సన్ గేమ్ ఫుటేజ్ బయటకు రావడంతో గేమర్లు ఆ క్షణాన్ని గేమర్లు ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషించడం మొదలుపెట్టారు. అది గేమింగ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అక్కడి నుంచి ‘ఆంటీ జువాన్’ పేరు గేమింగ్ కమ్యూనిటీలో మార్మోగింది. 2026లో మరో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో donkతో పాటు Team Spirit ప్లేయర్ సొకొలోవ్ ను కూడా ఆమె ఎలిమినేట్ చేసింది. 2026 ప్రారంభం నాటికి ఆమె Counter-Strike ఆడిన సమయం 8,000 గంటలు దాటేసాయి. కొడుకు గేమింగ్ లో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్న ఆ తల్లికి చివరికి కొడుకే బాస్‌గా మారాడు. సువోడె ఆమెకు గేమ్స్ నేర్పడమే కాకుండా ఇప్పుడు ఆమె లైవ్‌స్ట్రీమ్స్, వీడియోలు, ఆన్‌లైన్ కెరీర్‌ను నిర్వహించడంలో సహాయం చేస్తున్నాడు. జువాన్‌కు పేరుతో పాటు విమర్శలూ వచ్చాయి. ‘తల్లిగా నేను కేవలం ఇంటి పనులకే పరిమితం కావాలా? ‘ అని జువాన్ ఘాటుగానే స్పందించింది. గేమింగ్ తన మెదడును చురుగ్గా ఉంచుతోందని, చేతి-కంటి సమన్వయానికి ఉపయోగపడుతోందని చెప్పింది.
సాధారణ జీవితం నుంచి గేమింగ్ స్టార్‌గా
జువాన్ జీవితం మొత్తంగా చూస్తే ఇది కేవలం ఓ గేమింగ్ కథ కాదు. చిన్నతనంలో ప్రాథమిక విద్య మాత్రమే చదివిన ఆమె సేల్స్‌లో పనిచేసి దుస్తులు అమ్మి పిల్లలను పెంచింది. రిటైర్ అయ్యాక 50 ఏళ్ల వయసులో ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2026 నాటికి గేమింగ్ ద్వారా ఆమె సంపాదన దాదాపు పది రెట్లు పెరిగినట్లు Economic Observer నివేదించింది. తన కోసం ఇంట్లో ప్రత్యేకంగా గేమింగ్ రూమ్ ను ఏర్పాటు చేయించింది. అయితే ఇంత ఫేమ్ వచ్చినా తన గ్రామంలో తాను గేమింగ్ స్ట్రీమర్‌నని చెప్పుకోవడానికి జువాన్ సంకోచిస్తుంది. తాను గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకుంటారేమో అన్నది ఆమె భయం. ఒకసారి మార్కెట్‌లో ఓ వ్యక్తి ఆమెను గుర్తించి..’మీ గేమింగ్ వీడియోలు చూస్తుంటాను’ అని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయిందట.
కొడుకును అర్థం చేసుకోవడానికి మొదలైన ప్రయాణం
జువాన్ అసలు గేమింగ్ మొదలుపెట్టింది పేరు కోసమో డబ్బు కోసమో కాదు. తన కొడుకు ఎందుకు గేమ్స్‌కు అంతగా ఆకర్షితుడవుతున్నాడో తెలుసుకోవాలనుకుంది. అతని ప్రపంచంలోకి ఆమె అడుగుపెట్టింది. ఆ తర్వాత కొడుకును అర్థం చేసుకోవడమే కాకుండా తనకంటూ ప్రపంచాన్ని సృష్టించుకుంది. 60 ఏళ్ల వయసులోనూ కొత్తగా నేర్చుకోవాలన్న తపనకు వయసు అడ్డంకి కాదని ‘ఆంటీ జువాన్’ కథ నిరూపించింది.