AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israeli PM: పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావాలంటూ ఆహ్వానం!

Israeli Prime Minister: స్మిత్ మచ్ఛర్‌తో ఫోన్ సంభాషణ సందర్భంగా నెతన్యాహు ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. భారత్, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచానికే ఆయన హీరో అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సంప్రదాయంగా ప్రత్యేక గౌరవంగా అందించే జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో పాల్గొనాలని..

Israeli PM: పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావాలంటూ ఆహ్వానం!
Israeli Prime Minister
Subhash Goud
|

Updated on: Oct 04, 2026 | 9:06 AM

Share

Israeli Prime Minister: ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఆయనతో ఫోన్‌లో మాట్లాడి అభినందించారు. అంతేకాదు, ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.

‘మీరు ప్రపంచానికే హీరో’.. నెతన్యాహు ప్రశంసలు

స్మిత్ మచ్ఛర్‌తో ఫోన్ సంభాషణ సందర్భంగా నెతన్యాహు ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. భారత్, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచానికే ఆయన హీరో అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సంప్రదాయంగా ప్రత్యేక గౌరవంగా అందించే జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో పాల్గొనాలని స్మిత్ మచ్ఛర్‌ను నెతన్యాహు ఆహ్వానించారు. ఈ గౌరవం సాధారణంగా ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే ఇస్తారని, అయితే స్మిత్ చేసిన సాహసాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. అలాగే అదే కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు సమాచారం.

అసలు విమానంలో ఏం జరిగింది?

సెప్టెంబర్ 30న ఫ్లై దుబాయ్ FZ1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తోంది. విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణం మధ్యలో కాక్‌పిట్‌లో ఉన్న సహ పైలట్ భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై దాడికి పాల్పడ్డాడు. సహ పైలట్ దాడి చేయడంతో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం అకస్మాత్తుగా భారీగా కిందకు దిగడం ప్రారంభించింది. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది.

చివరి ప్రయత్నంతో కాక్‌పిట్ తలుపు తెరిచిన పైలట్

దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ మచ్ఛర్ పరిస్థితిని అర్థం చేసుకుని కాక్‌పిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించారు. చివరకు తన శక్తినంతా ఉపయోగించి తలుపు తెరవగలిగారు. దీంతో బయట ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దాడి చేసిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలోని ఇతర పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

‘మీ ధైర్యానికి ఆశ్చర్యపోయాను’

స్మిత్ మచ్ఛర్ చెప్పిన వివరాలు విన్న నెతన్యాహు ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా నిర్ణయం తీసుకున్న తీరు తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. అంతేకాదు, ఎంతోమంది ప్రాణాలను కాపాడారని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్మిత్ కుటుంబ సభ్యులకు కూడా తన శుభాకాంక్షలు తెలియజేశారు.

‘నా దగ్గర ఉన్న చివరి శక్తినంతా ఉపయోగించాను’

నెతన్యాహుతో మాట్లాడిన సమయంలో స్మిత్ మచ్ఛర్ ఆ భయానక పరిస్థితిని వివరించారు. మొదట విమానంలో ఏదైనా తీవ్రమైన సాంకేతిక సమస్య ఏర్పడిందని అనుకున్నానని, కానీ వరుసగా దెబ్బలు తగలడంతో తనపై సహ పైలట్ దాడి చేస్తున్న విషయం అర్థమైందని చెప్పారు. తాను తీవ్రంగా గాయపడటంతో చూపు కూడా సరిగ్గా కనిపించలేదని, అయినప్పటికీ చివరి ప్రయత్నంగా కాక్‌పిట్ తలుపు తెరిచానని వివరించారు. తలుపు తెరవగానే బయట ఉన్నవారు లోపలికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

మోదీ కూడా ప్రశంసలు

ఈ ఘటన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్మిత్ మచ్ఛర్‌తో మాట్లాడి ఆయన ధైర్యాన్ని అభినందించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు స్మిత్ చూపిన ధైర్యం, వేగంగా తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమని మోదీ పేర్కొన్నారు. స్మిత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత దేశాల అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాడికి గల పూర్తి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. మొత్తంగా.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్మిత్ మచ్ఛర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానం ఆయన సాహసానికి లభించిన మరో అరుదైన గుర్తింపుగా నిలిచింది. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సంబంధించి నెతన్యాహు ఆహ్వానం ఇచ్చినప్పటికీ, ఆ గౌరవానికి తుది ఎంపిక అధికారిక ప్రక్రియ ద్వారా జరుగుతుందని స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us