AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిదంబర రహస్యం అంటే ఇదేనా..? తెర వెనుక కనిపించే శూన్యంలో దాగిన ఆధ్యాత్మిక సత్యం ఇదే!

Chidambaram Nataraja Temple History Telugu: చిదంబర నటరాజ స్వామి ఆలయంలోని తెర వెనుక కనిపించే శూన్య దర్శనాన్నే ‘చిదంబర రహస్యం’గా భావిస్తారు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక తత్వం, ఆకాశ తత్త్వం, నటరాజుడి ఆనంద తాండవం, తారకావన పురాణ కథ గురించి తెలుసుకుందాం.

చిదంబర రహస్యం అంటే ఇదేనా..? తెర వెనుక కనిపించే శూన్యంలో దాగిన ఆధ్యాత్మిక సత్యం ఇదే!
Chidambaram Nataraja Temple History Telugu
Rajashekher G
|

Updated on: Sep 11, 2026 | 3:54 PM

Share

Chidambaram Nataraja Temple History Telugu: ఎప్పుడైనా ఎవరికైనా అర్థంకాని విషయం ఎదురైతే.. “ఇదంతా చిదంబర రహస్యం” అని అంటుంటాం. అసలు ఈ మాట ఎలా వచ్చింది? చిదంబర రహస్యం అంటే ఏమిటి? తమిళనాడులోని ప్రసిద్ధ చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యమే ఈ పదానికి మూలమని చెబుతారు. ఆలయ గర్భగుడిలో తెర తొలగించినప్పుడు కనిపించే ఆ దృశ్యం వెనుక ఎంతో లోతైన తత్వం ఉందని పురాణాలు, ఆలయ సంప్రదాయాలు వివరిస్తున్నాయి.

పంచభూతాల్లో ఆకాశ తత్వానికి ప్రతీకగా చిదంబరం

హిందూ తత్వశాస్త్రం ప్రకారం ప్రకృతి ఐదు పంచభూతాలతో ఏర్పడింది. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదు తత్వాలకు సంబంధించిన పంచభూత క్షేత్రాల్లో చిదంబరం ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇతర పంచభూత క్షేత్రాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తే.. చిదంబరంలో మాత్రం ఆకాశ రూపంలో, అంటే నిరాకారంగా కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం.

తెర వెనుక ఏముంటుంది?

చిదంబరం నటరాజ స్వామి గర్భగుడిలో నటరాజ విగ్రహానికి ఒక వైపున తెర ఉంటుంది. ప్రత్యేక పూజా సమయంలో ఆ తెరను తొలగించి దీపారాధన చేసినప్పుడు.. అక్కడ సాధారణంగా కనిపించే విగ్రహం లేదా శివలింగం కనిపించదు. అక్కడ శూన్య స్థలాన్ని సూచించే దర్శనం, దానిపై బంగారు బిల్వ ఆకుల అలంకరణ కనిపిస్తుంది. ఈ నిరాకార దర్శనాన్నే “చిదంబర రహస్యం”గా భక్తులు భావిస్తారు. ఇది కేవలం ఒక రహస్యంగా దాచిన విషయం కాదని.. దేవుడు ఒక రూపానికే పరిమితం కాదనే ఆధ్యాత్మిక సందేశంగా దీనిని అర్థం చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

చిదంబర రహస్యం వెనుక ఉన్న అసలు తత్వం ఏమిటి?

“చిత్” అంటే జ్ఞానం లేదా చైతన్యం. “అంబరం” అంటే ఆకాశం. అందుకే “చిదంబరం” అనే పదాన్ని జ్ఞాన స్వరూపమైన ఆకాశంతో అనుసంధానిస్తారు. గర్భగుడిలోని తెరను అజ్ఞానం లేదా మాయకు ప్రతీకగా భావిస్తారు. మనిషిలోని అజ్ఞానం అనే తెర తొలగినప్పుడే పరమాత్మ తత్వాన్ని అనుభవించగలమనే సందేశాన్ని ఇది అందిస్తుందని ఆధ్యాత్మిక భావన. అంటే.. దేవుడిని ఎక్కడో బయట వెతకడం కంటే, మనలో ఉన్న చైతన్యాన్ని, జ్ఞానాన్ని గుర్తించాలి అనేదే చిదంబర రహస్యం వెనుక ఉన్న ప్రధాన తాత్విక సందేశంగా చెబుతారు.

తారకావనంలోని రుషుల అహంకారం

చిదంబరం నటరాజ స్వామి ఆనంద తాండవానికి సంబంధించిన పురాణ కథ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం తారకావనంలో కొందరు రుషులు తీవ్రమైన తపస్సు చేసేవారని చెబుతారు. తమ తపస్సు, మంత్రశక్తిపై వారికి అపారమైన గర్వం ఏర్పడింది. తమ శక్తితోనే ప్రపంచం నడుస్తోందని, దేవుడి అవసరం లేదని భావించారు. వారి అహంకారాన్ని తొలగించేందుకు పరమశివుడు భిక్షాటన రూపంలో, శ్రీమహావిష్ణువు మోహినీ రూపంలో తారకావనానికి వెళ్లారని పురాణ కథనం.

శివుడి భిక్షాటన రూపాన్ని చూసి రుషుల భార్యలు ఆకర్షితులయ్యారు. అదే సమయంలో మోహినీ రూపంలో ఉన్న విష్ణువును చూసి రుషులు తమ తపస్సును మరిచిపోయారు. తమకు జరిగిన విషయం తెలుసుకున్న రుషులు ఆగ్రహంతో శివుడిని అంతం చేయడానికి యాగం చేశారని కథనం.

పాము, పులి, అపస్మారుడిని జయించిన శివుడు

ఆ యాగం నుంచి పాము, పులి, అపస్మారుడు అనే రాక్షసుడు ఉద్భవించి శివుడిపైకి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడు వాటిని చూసి భయపడలేదు. పామును ఆభరణంగా ధరించారు. పులి చర్మాన్ని వస్త్రంగా ధరించారు. అనంతరం అజ్ఞానానికి ప్రతీకగా భావించే అపస్మారుడిని తన పాదంతో అణచివేసి ఆనంద తాండవం చేశారు. శివుడి ఈ ఆనంద తాండవాన్ని చూసిన రుషులకు జ్ఞానోదయం కలిగిందని, తమ అహంకారాన్ని విడిచిపెట్టి శివుడిని శరణు వేడుకున్నారని కథనం.

నటరాజు ఆనంద తాండవానికి ఐదు అర్థాలు

శివుడి ఆనంద తాండవం విశ్వంలోని ఐదు దైవిక కార్యాలను సూచిస్తుందని ఆధ్యాత్మిక సంప్రదాయంలో చెబుతారు. సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం — అంటే సృష్టించడం, కాపాడటం, లయ చేయడం, ఆవరణలో ఉంచడం, చివరకు అనుగ్రహించడం అనే ఐదు కార్యాలకు నటరాజుడి నృత్యం ప్రతీకగా భావిస్తారు. నటరాజుడి పాదాల కింద కనిపించే అపస్మారుడు కూడా ఎంతో ప్రత్యేకమైన ప్రతీక. అతడిని అజ్ఞానం, అహంకారానికి సూచికగా భావిస్తారు. జ్ఞానం, చైతన్యం అజ్ఞానాన్ని అధిగమించినప్పుడు నిజమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందనే సందేశాన్ని ఇది సూచిస్తుందని చెబుతారు.

పతంజలి, వ్యాఘ్రపాదులకు శివుడి వరం

పురాణ కథనం ప్రకారం పతంజలి మహర్షి, వ్యాఘ్రపాద మహర్షి శివుడి ఆనంద తాండవాన్ని దర్శించాలనే కోరికతో తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన శివుడు చిదంబరంలోని తిల్లైవనంలో ఆనంద తాండవం చేస్తూ భక్తులకు అనుగ్రహిస్తానని వరమిచ్చారని చెబుతారు. వ్యాఘ్రపాద మహర్షికి శివపూజ కోసం ఎత్తైన చెట్లపై ఉన్న పుష్పాలను సులభంగా సేకరించేందుకు పులి పాదాలు లభించాయని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఆయనను వ్యాఘ్రపాదుడు అని పిలిచారని పురాణ విశ్వాసం.

అందుకే “చిదంబర రహస్యం” అనే మాట!

చిదంబరం ఆలయంలో తెర వెనుక కనిపించే నిరాకార దర్శనం.. దేవుడు కేవలం ఒక రూపంలోనే ఉండడని, సర్వవ్యాపకమైన చైతన్యమే పరమాత్మ తత్వం అనే భావనను తెలియజేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఎవరికైనా సులభంగా అర్థంకాని, బయటకు చెప్పలేని లేదా అంతుచిక్కని విషయాన్ని “చిదంబర రహస్యం” అని పిలవడం ప్రజల వాడుకలోకి వచ్చిందని చెబుతారు. అయితే ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే.. చిదంబర రహస్యం అంటే కేవలం దాచిన రహస్యం కాదు. శూన్యంలోనూ దైవత్వాన్ని చూడటం.. రూపం వెనుక ఉన్న అరూప తత్వాన్ని గ్రహించడం.. మనలోని అజ్ఞానపు తెరను తొలగించి జ్ఞానాన్ని అనుభవించడం అనే గొప్ప ఆధ్యాత్మిక సందేశానికి ప్రతీకగా దీనిని భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలోని విషయాలు పురాణాలు, హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని చారిత్రక ఆధారాలుగా భావించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us