రొమ్ము క్యాన్సర్.. గడ్డలు, నొప్పే కాదు.. మహిళలు పెద్దగా పట్టించుకోని ఈ లక్షణాలు కూడా ప్రమాదమే!
మహిళల్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి వరుసలో ఉంది. దీనిపై ఎంతో అవగాహన పెరుగుతున్నప్పటికీ, చాలామంది ఇప్పటికీ రొమ్ములో గడ్డలు ఏర్పడటం లేదా తీవ్రమైన నొప్పి రావడం మాత్రమే క్యాన్సర్ లక్షణాలని భావిస్తుంటారు. కానీ, క్యాన్సర్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ప్రాథమిక దశలో ఎటువంటి గడ్డలు లేదా నొప్పి లేకుండానే కొన్ని సూక్ష్మమైన, దాగి ఉన్న మార్పులు శరీరంలో కనిపిస్తాయి. అవేంటో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..!

రొమ్ము క్యాన్సర్ అనగానే చాలామంది మహిళలు కేవలం రొమ్ములో గడ్డలు లేదా నొప్పి మాత్రమే ఉంటాయని అనుకుంటారు. కానీ, ఆరంభ దశలో ఎటువంటి నొప్పి లేదా గడ్డలు లేకుండానే కొన్ని దాగి ఉన్న లక్షణాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్‌లో నొప్పి ఉండాలనే నియమం లేదు కాబట్టి, రొమ్ముల ఆకారంలో లేదా చర్మంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గమనించాల్సిన దాగి ఉన్న ప్రధాన లక్షణాలు:
చంక భాగంలో వాపు లేదా గడ్డలు: రొమ్ము క్యాన్సర్ కణాలు దగ్గరలోని లింఫ్ నోడ్స్ కు వ్యాపిస్తాయి. దీనివల్ల రొమ్ము భాగంలో ఏ మార్పు లేకపోయినా, చంక లేదా కాలర్ బోన్ దగ్గర గడ్డలు లేదా వాపులు రావచ్చు.
చర్మం ఆకృతిలో మార్పులు: రొమ్ము చర్మంపై గుంటలు పడటం, చర్మం గరుకుగా లేదా మందంగా మారి నారింజ పండు తొక్కలా కనిపించడం క్యాన్సర్ తీవ్రమైన సంకేతం కావచ్చు.
నిపుల్స్‌లో మార్పులు: సహజంగా బయటకు ఉండే నిపుల్ హఠాత్తుగా లోపలికి ముడుచుకుపోవడం లేదా దాని ఆకారం మారడం జరిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
అసాధారణ ద్రావణాలు కార్చడం: నిపుల్స్ నుండి ఒత్తిడి లేకుండానే దానంతట అదే రక్తం లేదా స్రావాలు కారడం గమనిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.
పరిమాణంలో తేడాలు: రెండు రొమ్ములు పూర్తి ఒకేలా ఉండవు, అది సాధారణమే. కానీ, సడన్‌గా ఒక రొమ్ము మాత్రమే పెద్దదిగా మారడం, బరువుగా అనిపించడం లేదా వాపు రావడం జరిగితే శ్రద్ధ వహించాలి.
నొప్పి లేకపోతే క్యాన్సర్ కాదా?:
చాలామందికి ఉన్న అతిపెద్ద అపోహ ఏమిటంటే నొప్పి ఉంటేనే క్యాన్సర్ అని. కానీ, క్యాన్సర్ ప్రాథమిక దశలలో ఎటువంటి నొప్పి ఉండదు. ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకుండానే మహిళ పూర్తి ఆరోగ్యంగా అనిపించినప్పటికీ లోపల క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది.
మహిళలు ఏం చేయాలి?:
ప్రతి మహిళ నెలకు ఒకసారైనా స్వయం రొమ్ము పరీక్ష చేసుకోవడం ద్వారా తమ రొమ్ముల సాధారణ ఆకారాన్ని తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌లో వెతికి భయాందోళన చెందకుండా, ఏదైనా కొత్త మార్పు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించి అవసరమైన మమోగ్రామ్ లేదా స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ముందస్తు గుర్తింపే రొమ్ము క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఏకైక మార్గం!




