ఫలించిన భారత్ దౌత్యం.. పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్నామంటూ కొలంబియా కీలక ప్రకటన
పాకిస్తాన్ విషయంలో అంతర్జాతీయంగా భారత్ దౌత్యం ఫలిస్తోంది. విదేశాలకు వెళ్లిన భారత ఎంపీల బృందాలు.. పాకిస్తాన్ తీరును ఎండగడుతున్నాయి. ఒక్కొక్క దేశం పాక్ గురించి నిజాలు తెలుసుకుని షాకవుతున్నాయి. తాజాగా.. పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా.. సంతాప ప్రకటనను ఉపసంహరించుకుంటుంన్నట్లు ప్రకటించింది

ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. దీనిలోభాగంగానే.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. ఆ దేశ విదేశాంగ శాఖ ఉపమంత్రి రోసా యెలాండ్ విల్లావిసెన్సియోతో థరూర్ భేటీ అయ్యారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. దాంతో.. పాకిస్తాన్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా.. సంతాప ప్రకటనను ఉపసంహరించుకుంటుంన్నట్లు ప్రకటించింది.
భారత బృందం తమకు అన్ని విషయాలను తెలియజేసిందన్నారు కొలంబియా విదేశాంగ శాఖ ఉపమంత్రి రోసా యెలాండ్. కశ్మీర్‌లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నామని.. దాడులకు దారి తీసిన పరిస్థితిపై అవగాహన వచ్చిందని చెప్పారు. “ఈ రోజు మాకు అందిన వివరణ, కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితి, సంఘర్షణ, ఏమి జరిగిందో ఇప్పుడు మాకు ఉన్న వివరణాత్మక సమాచారం తెలిసింది.. మేము సంభాషణను కూడా కొనసాగించగలమని మేము చాలా నమ్మకంగా ఉన్నాము” అని అన్నారు.
ఈ ప్రకటన తర్వాత.. శశిథరూర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా ప్రభుత్వ పెద్దలు పూర్తిగా తెలుసుకున్నారని వివరించారు. కొలంబియాకు పర్యటనకు వెళ్లిన థరూర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలపడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను భరించిందని తెలిపారు. పాకిస్థాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా.. పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోందని మండిపడ్డారు శశిథరూర్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
