Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ లో అధికారికంగా ప్రభుత్వం ఏర్పడలేదు..ఇంకా వేచి చూసే ధోరణిలోనే భారత్!
ఒక వైపు, పాకిస్తాన్ గూఢచార సంస్థ అధికారులు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి తాలిబాన్ నాయకులతో మాట్లాడుతున్నారు. భారతదేశం పరిస్థితి ఇంకా వేచి ఉండే ధోరణిలోనే ఉంది.
Afghanistan Crisis: ఒక వైపు, పాకిస్తాన్ గూఢచార సంస్థ అధికారులు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి తాలిబాన్ నాయకులతో మాట్లాడుతున్నారు. భారతదేశం పరిస్థితి ఇంకా వేచి ఉండే ధోరణిలోనే ఉంది. మాజీ భారత దౌత్యవేత్త అనిల్ వాధ్వా ప్రకారం, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించడం..వేచి ఉండటం ద్వారా మాత్రమే భారత్ ప్రస్తుతం తన ధోరణి కొనసాగించగలదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన తాలిబానీ ప్రభుత్వాన్ని భారత్ పూర్తిగా తిరస్కరించాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన అన్నారు. వాధ్వా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో తూర్పు దేశాల కార్యదర్శిగా ఉన్నారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని చూడటానికి..అర్థం చేసుకోవడానికి ఇది మంచి సమయం అని ఆయన అన్నారు.
తాలిబన్లు రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేక పోతున్నారు. దీనికి కారణాలు పూర్తిగా బయటకు రావడం లేదు. అయితే, మీడియా సంస్థలు చెబుతున్న ప్రకారం అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడంలేదని తెలుస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం కోసం తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్ మధ్య పోరాటం జరిగినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ వెబ్‌సైట్ ‘పంజ్‌షీర్ అబ్జర్వర్’ ప్రకారం, హక్కానీ నెట్‌వర్క్ కాల్పుల్లో తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరదార్ గాయపడ్డాడు. బరదార్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో చికిత్స పొందుతున్నట్లు కూడా ఆ మీడియా చెప్పింది. అయితే ఇది నిర్ధారణ కాలేదు. మరోవైపు, బారదర్ గాయపడిన నివేదిక నిరాధారమైనదని మరికొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 2-3 రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించవచ్చని తాలిబాన్ చెబుతోంది. దీని కోసం, పంజ్‌షీర్ పూర్తి స్వాధీనం కోసం వేచి ఉంది. అలాగే కొన్ని పోస్ట్‌లపై వారి మధ్యలో ఇబ్బందులున్నాయని ఆ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
పంజ్‌షీర్‌లో పాకిస్థాన్ సైన్యం తాలిబాన్లకు మద్దతు..
మీడియా నివేదికల ప్రకారం , పంజ్‌షీర్‌లో జరుగుతున్న యుద్ధంలో పాకిస్థాన్ సైనికులు తాలిబాన్‌లకు మద్దతు ఇస్తున్నారు. పంజ్‌షీర్‌లో మరణించిన పాకిస్తానీ సైనికుడి ఐ-కార్డు కూడా దొరికిందని చెబుతున్నారు. పాకిస్తాన్ తాలిబాన్లకు చాలా కాలంగా సహాయం, ప్రోత్సాహాన్ని అందిస్తోందని, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ వెనుక పాకిస్తాన్ కూడా ఉందని ప్రపంచ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబానీ ప్రభుత్వం ప్రకటించకముందే, పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉగ్రవాదులతో మమేకం అయిపోవాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబూల్‌కు రావడం గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఉగ్రవాద సంస్థ నాయకుడైన హక్కానీ నెట్‌వర్క్‌ను తాలిబాన్ ప్రభుత్వ అధిపతిగా చేయడానికి..ముల్లా అబ్దుల్ ఘనీ బరదర్ అధిపతి కాకుండా నిరోధించడానికి ISI చీఫ్ కాబూల్‌కు వచ్చారని ఆఫ్ఘన్ మాజీ పార్లమెంటేరియన్ మరియం సోలైమాంఖిల్ చెప్పారు.
ఇన్ని పరిణామాల మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు కాకుండా, అక్కడ జరిగే విషయాలపై తొందరపడకూడదని భారత్ భావిస్తోందని చెబుతున్నారు. అక్కడ అధికారికంగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో స్పందించాలని వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది భారత్. అక్కడ పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వస్తోంది మనదేశం.