Afghanistan Taliban: చేతికందినది నోటి కందకుండా పోతోంది.. తాలిబన్ల రాకతో ఆఫ్ఘాన్‌ మహిళలకు మళ్లీ చీకటి జీవితాలు

Afghan women on return of Taliban: ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాల నుంచి అమెరికా సైన్యం వైదొలిగిన అనంతరం తాలిబాన్ తీవ్రవాదుల హింస పెచ్చుమీరుతోంది. ఇప్పటికే తాలిబాన్లు సగానికి పైగా ప్రొవిన్షియల్ రాజధానులను

Afghanistan Taliban: చేతికందినది నోటి కందకుండా పోతోంది.. తాలిబన్ల రాకతో ఆఫ్ఘాన్‌ మహిళలకు మళ్లీ చీకటి జీవితాలు
Afghan Women
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2021 | 1:24 PM

Afghan women on return of Taliban: ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాల నుంచి అమెరికా సైన్యం వైదొలిగిన అనంతరం తాలిబాన్ తీవ్రవాదుల హింస పెచ్చుమీరుతోంది. ఇప్పటికే తాలిబాన్లు సగానికి పైగా ప్రొవిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకొని కాబుల్ నగరం వైపు పయనిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమించిన భూ భాగాల్లో తాలిబన్ కఠినమైన షరియత్ చట్టాలను విధిస్తున్నారు. దీంతోపాటు మహిళలు, చిన్నారుల పట్లా తాలిబాన్ ఉగ్రవాదులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటికి తీరుగుతూ బాలికల వివరాలను సేకరిస్తున్నారు. తమ పిల్లలను తాలిబాన్లకే ఇచ్చి పెళ్లి చేయాలంటూ.. ఇళ్లల్లోకి వెళ్లి మరి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలకు బాలికలను పంపవద్దని హుకుం జారీ చేశారు. ఒకవేళ పంపితే.. చావు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆఫ్ఘానిస్థాన్ ప్రజలు బిక్కుబిక్కుంటూ వేరే దేశాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే దాదాపు 3 లక్షలమంది ఆఫ్ఘానిస్తాన్‌ను వదిలి వేరే దేశాలకు పయనమయ్యారని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. దాదాపు 3వేల కుటుంబాలు వేరే దేశాల సరిహద్దుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. అంతేకాకుండా శరాణార్ధులుగా మారిన వారిలో 80శాతం మంది మహిళలు, బాలికలే ఉన్నారని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

అయితే.. ఇంతకాలం లభించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యం నుంచి మళ్లీ తమ జీవితం చీకటి ప్రపంచంలోకి వెళుతుందంటూ ఆఫ్ఘాన్ మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితం మళ్లీ పంజరంలో బంధీ కానుందంటూ రోదిస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్ అంతటా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. తాలిబాన్లను ఆఫ్ఘానిస్తాన్ వశమైతే తమ జీవితం సర్వనాశనమవుతుందంటూ మహిళలు పేర్కొంటున్నారు. మళ్లీ మొదటిలానే అత్యాచారాలు పెరుగుతాయని.. తమ జీవితం కేవలం లైంగిక వాంఛ కోసమే బంధీ అవుతుందంటూ రోదిస్తున్నారు. తమ పిల్లలను కూడా వారు వదలని పశువుల్లా ప్రవర్తిస్తారంటూ పేర్కొంటున్నారు. ఇంతకాలం తాము ప్రశాంతంగా బతికామని.. తాలిబాన్లు అధికారం చేపడితే.. తాము ఇళ్లకే పరిమితమవుతామంటూ రోదిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లనివ్వరని, ఉద్యోగం చేసుకోనివ్వరని.. ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుందని యువతులు అంతర్జాతీయ మీడియాకు వివరించారు. తమ పనులను చేసుకోనివ్వకుండా కఠిన చట్టాలను తీసుకువస్తారని యువతులు పేర్కొంటున్నారు. తాలిబాన్లతో తమ జీవితం అంధకారంలోకి వెళుతుందని పేర్కొంటున్నారు. చీకటి రోజులను తట్టుకునే శక్తి తమకు లేదంటూ మహిళలు పేర్కొంటున్నారు.

కాగా.. స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఇప్పటికే రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదులు 12 ఏళ్లలోపు బాలికలను బలవంతంగా పెళ్లి చేసుకుని.. వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టడానికి ఇంటింటికీ తిరుగుతున్నారు. తాలిబాన్లను వివాహం చేసుకోవడానికి 12 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల అవివాహిత మహిళల జాబితాలను తీసుకురావాలని స్థానిక ఇమామ్‌లను ఆదేశించారు.

ఇదిలాఉంటే.. తాలిబాన్ల అరచకాలతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబాన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. తాలిబాన్ల అరాచకాల వల్ల మహిళలు, బాలిక పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

Also Read:

Taliban: ఆఫ్ఘన్ వ్యవహారాల్లో తలదూర్చటం మీకు మంచిది కాదు.. ఇండియాకు తాలిబన్ల హెచ్చరిక

కాబూల్ నగరానికి సమీపంలో తాలిబన్లు.. ఆఫ్ఘన్ లోని అమెరికన్ల తరలింపునకు యూఎస్ విమానాలు సిద్ధం