యుద్ధం.. ఇప్పటి వరకు ఎంత మంది పాక్ సైనికులు మృతిచెందారో లెక్కలు బయటపెట్టిన ఆఫ్ఘాన్!
ఆఫ్ఘన్ తాలిబాన్ తమ దళాలు సరిహద్దులో పాకిస్తాన్ సైనికులను హతమార్చి, పోస్టులను ఆక్రమించాయని ప్రకటించింది. గగనతల ఉల్లంఘనలకు ఇది ప్రతిస్పందన అని పేర్కొంది. అయితే పాకిస్తాన్ దీనిని ఖండించింది, బలమైన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపించగా, ఆఫ్ఘనిస్తాన్ తమ ప్రాదేశిక సమగ్రతను రక్షించుకుంటామని తెలిపింది.

ఆదివారం ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తమ దళాలు ఉమ్మడి సరిహద్దులో రాత్రిపూట జరిపిన ఆపరేషన్లలో 58 మంది పాకిస్తానీ సైనికులను చంపి 25 ఆర్మీ పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని పేర్కొంది. తాలిబన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని అధికారిక సరిహద్దులు, వాస్తవ సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు చాలా వరకు నిరోధించాం అని అన్నారు. ఘర్షణల్లో మరో 30 మంది పాకిస్తానీ సైనికులు గాయపడ్డారని కూడా ఆయన ధృవీకరించారు.
గగనతల ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా దాడి
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం, గగనతలంలో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడినందుకు ప్రతిస్పందనగా ఈ చర్య చేపట్టినట్లు ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యతిరేక పక్షం మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తే, మన సాయుధ దళాలు దేశ సరిహద్దులను రక్షించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. బలమైన ప్రతిస్పందనను అందిస్తాయి అని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కాబూల్ పై దాడి జరగలేదని పాకిస్తాన్ ఖండించింది. ‘బలమైన ప్రతిస్పందన’ ఉంటుందని షరీఫ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ వారం ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్ అధికారులు కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక మార్కెట్‌పై పాకిస్తాన్ బాంబు దాడి చేసిందని ఆరోపించారు.
కానీ పాకిస్తాన్ ఆ బాధ్యతను స్వీకరించలేదు. బలమైన ప్రతిస్పందనను ప్రతిజ్ఞ చేస్తూ.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ రక్షణ విషయంలో ఎటువంటి రాజీ ఉండదు, ప్రతి రెచ్చగొట్టే చర్యకు బలమైన, ప్రభావవంతమైన ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ అధికారులు తమ భూమిని ఉగ్రవాద శక్తులు ఉపయోగించుకోవడానికి అనుమతిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ వివాదం
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొత్త కాదు. పాకిస్తాన్ తాలిబన్ అని కూడా పిలువబడే తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) కు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ తరచుగా ఆరోపిస్తోంది, ఇది ఆఫ్ఘన్ తాలిబన్ మాదిరిగానే అదే భావజాలాన్ని అనుసరించే ఉగ్రవాద సంస్థ.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
