Coronavirus: కోవిడ్ మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరస్థితిలో ఉంది.. 40 లక్షల కరోనా మరణాలు: డబ్ల్యూహెచ్‌వో
Coronavirus: గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు..
Coronavirus: గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. సంపన్న దేశాలు ఒక వైపు ఆంక్షలను సడలిస్తుండగా, మరోవైపు ఆసియా దేశాలు తాజా కేసులతో పోరాడుతున్నాయని పేర్కొంది. ఆసియా వ్యాప్తంగా కొత్త లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ మరణాల రేటు నెలలో పదిరెట్లు పెరిగి గ్లోబల్ హాట్‌స్పాట్‌గా ఇండోనేషియా నిలుస్తోందని, బుధవారం ఒక్కరోజే ఇండోనేషియాలో 1,040 మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ వెల్లడించారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండోనేషియాలో వీలైనంత ఎక్కువగా ఇంటి నుంచే పని చేయాల్సిందిగా ప్రజలకు ఆయన సూచించారు. వియాత్నాంలోని హో చి మిన్ సిటీ, మయన్మార్‌లోని యాంగోన్లలో లాక్‌డౌన్‌ను విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ రెండు నగరాల్లో 15 మిలియన్లకు పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నారని, సిడ్నీలోని ఐదు మిలియన్ల నివాసితులు ఇప్పటికే రెండు వారాల లాక్‌డౌన్‌లో ఉండగా కొత్తగా 27 కేసులు వెలుగులోకి రావడంతో మరో వారం రోజులు లాక్‌డౌన్‌ను అక్కడి ప్రభుత్వం పొడిగించిందన్నారు. బ్రిటన్‌లో సైతం పాజిటివ్ కేసులు తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ, మాస్ వ్యాక్సినేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరడాలు, మరణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయన్నారు.
అయితే చైనాలో వైరస్ వెలుగులోకి వచ్చి 18 నెలలు అయినప్పటికీ ప్రపంచం ముందుకు సాగడం కష్టంగా ఉందని, కరోనా కట్టడికి వ్యాక్సిన్లు, రక్షణ పరికరాలను నిల్వ చేయడంపై ధని దేశాలపై టెడ్రోస్ ఆక్షేపించారు. కరోనా మహమ్మారి ఇప్పటికే ముగిసినట్లుగా ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఇక క్రీడల విషయంలో ప్రేక్షకులు లేకుండా ఆడటం లేదా వాయిదా వేసుకోవడం, లేక పూర్తిగా రద్దు చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు. టీకా రేటుతో సంబంధం లేకుండా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. మాస్ టూరిజంతో సంపన్నదేశాల ప్రజలు సాధారణ జీవనంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. దేశాల్లో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ధనిక దేశాలు ఆంక్షల సడలింపును వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచం అంతా సామూహికంగా ఒక్కటై ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొవాలని ఆయన పేర్కొన్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 18.58 కోట్లు దాటింది. ప్రస్తుతం మరణాలు కూడా 40 లక్షలకుపైగా దాటాయి. ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 18,58,17,156 ఉండగా, మరణాలు 40,17,148కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 17,00,74,066 మంది కరోనా నుంచి కోలుకోగా, 77,722 మంది చికిత్స పొందుతున్నారు. ఇక భారత్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్, లాక్‌డౌన్ ఆంక్షలు తదితర చర్యలతో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. రోజు వారీగా కేసులు తగ్గుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కట్టడికి చర్యలు చేపట్టడంతో పాజిటివ్ కేసులు, మరణాలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి.
The world is at a perilous point in the #COVID19 pandemic. We have just passed the tragic milestone of 4 million recorded deaths, which likely underestimates the overall toll. It didn’t have to be this way and it doesn’t have to be this way going forward. #VaccinEquity pic.twitter.com/xA2cYsGgan
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) July 7, 2021