US Shooting: టెక్సాస్ పాఠశాలలో ఘోరం.. దుండగుడి కాల్పుల్లో 22 మంది మృతి..
మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డేలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులతో పాటు మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
US Shooting: అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతోంది. తాజాగా మరోసారి కాల్పుల కలకలం రేపాయి. యూఎస్ టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ (Texas elementary school) లో 18 ఏళ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19 మంది విద్యార్థులతో పాటు మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డేలో చోటుచేసుకుంది. మృతి చెందిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని టెక్సాస్ అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలలో ఇది అత్యంత ఘోరమైన ఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. షూటర్ పాఠశాలలోకి ప్రవేశించే ముందు తన అమ్మమ్మను కూడా కాల్చినట్లు అబాట్ తెలిపారు.
కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వమించారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడని అధికారులు తెలిపారు. అమెరికా సమయం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు జరిగాయి. తుపాకీతో రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించిన ఉవాల్టేకి చెందిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని అధికారులు పేర్కొన్నారు. ఈ పాఠశాలలో 500 మంది కంటే ఎక్కువే విద్యార్థులు చదువుతున్నారు. దుండగుడితో సహా మొత్తం 23 మంది మరణించారు. కాగా.. ఈ ఘటనపై అధ్యక్షుడు జోబైడెన్‌కు విచారం వ్యక్తంచేశారు.
ఇదిలాఉంటే.. 10 రోజుల క్రితం బఫెలోని కిరాణా మర్చంట్ లో జరిగిన జాత్యహంకార దాడిలో 10 మంది వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరోసారి కాల్పులు జరిగడం కలకలం రేపింది. అంతేకాకుండా 2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు మృతిచెందారు. ఆ ఘటన తర్వాత ఇదే అత్యంత దారుణ సంఘటన అని అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..