దేశ ప్రధాని పేరు చెప్పలేకపోయాడని పెళ్లి రద్దు..! వెంటనే వరుడి తమ్ముడితో ‘మళ్లీపెళ్లి’
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లింట వధువు వరుడిని దేశ ప్రధాని ఎవరో చెప్పమని ప్రశ్నించింది. వరుడు చెప్పలేకపోవడంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుని వరుడి తమ్ముడిని పెళ్లాడింది. ఈ షాకింగ్ ఘటన..
ఘాజీపూర్: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లింట వధువు వరుడిని దేశ ప్రధాని ఎవరో చెప్పమని ప్రశ్నించింది. వరుడు చెప్పలేకపోవడంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుని వరుడి తమ్ముడిని పెళ్లాడింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా సైద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
సైద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాసిర్‌పూర్ గ్రామానికి చెందిన రామ్ అవతార్ కుమారుడైన శివశంకర్ (27)కు కరంద పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ పట్టి గ్రామానికి చెందిన లఖేడు రామ్ కుమార్తె రంజన అనే యువతితో జూన్ 11న వివాహం జరిగింది. వీరికి 6 నెలల క్రితం పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అప్పటి నుంచి వారిరువురు మొబైల్ ద్వారా మాట్లాడుకునేవారు. వివాహానంతరం జూన్ 12న వధువు ఇంట నిర్వహించిన ఓ కార్యక్రమంలో శివశంకర్‌ను మరదలు, బావమరిది సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు.
అందులో భాగంగా దేశ ప్రధాని పేరు చెప్పమని మరదలు అడిగింది. ఐతే శివశంకర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పలేకపోయాడు. దీంతో వధువు తరపు బంధువులు అతన్ని హేళన చేసి, మందబుద్ధిగా భావించారు. దీన్ని అవమానంగా భావించిన వధువు రంజన.. శివశంకర్ తో తన పెళ్లిని రద్దు చేసుకుని, అతని తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే వివాహం చేసుకుంది. తన కంటే వయసులో చిన్నవాడైన అనంత్‌ను కోడలు వివాహం చేసుకోవడాన్ని మామ రామ్ అవతార్ అభ్యంతరం తెలిపాడు. వధువుతో చిన్న కొడుకును కాపురానికి సాగనంపడానికి అతను నిరాకరించాడు. ఈ విషయమై అతను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ అయ్యింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.