వార్నీ.. టిక్కెట్టుతో పాటు రైల్వే బెడ్‌షీట్లు ఫ్రీ..? ఎలాగైనా వాడుకోవచ్చు! నెటిజన్ల ఫైర్
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. తాజాగా, ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక విచిత్రమైన వీడియో నెటిజన్లను ఒకే సమయంలో నవ్విస్తూ, ఆలోచింపజేస్తోంది. ఒక స్థానిక మార్కెట్‌లో ముగ్గురు వ్యక్తులు హాయిగా నడుచుకుంటూ వెళ్తుండగా, వారు ఒంటిపై కప్పుకున్న తెల్లటి దుప్పట్లపై 'WESTERN RAILWAY' అని స్పష్టంగా రాసి ఉంది. అంటే అవి రైల్వేకు సంబంధించినవిగా స్పష్టమవుతోంది. అవి బయటకు వచ్చాయి..?

మార్కెట్‌లో ముగ్గురు వ్యక్తులు తెల్లటి దుప్పట్లు కప్పుకుని ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ దుప్పట్లపై వెస్ట్రన్ రైల్వే అని స్పష్టంగా రాసి ఉంది. ఈ వీడియో బయటకు రావడంతో, రైల్వే ఆస్తి దొంగతనంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు యూజర్లు ఈ పరిస్థితిపై, ఇప్పుడు రైలు టిక్కెట్లతో పాటు దుప్పట్లు కూడా ఉచితంగా దొరుకుతున్నాయా? అని సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే..
ఈ వీడియోను X వేదికగా ఓ వినియోగదారుడు షేర్ చేశారు. సాధారణంగా భారతీయ రైల్వేలోని AC కోచ్‌లలో ప్రయాణించే వారికి రాత్రి పూట వాడకానికి బెడ్‌షీట్లు, దిండ్లు, కంబళ్ళు అందిస్తుంటారు. ప్రయాణం ముగిసిన తర్వాత వీటిని తిరిగి సిబ్బందికి ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం ఆ బెడ్‌షీట్లను దొంగిలించి, ఏకంగా బజార్‌లో శాలువాల్లా ధరించి తిరుగుతున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు రైలు టికెట్‌తో పాటు బెడ్‌షీట్ కూడా ఉచితంగా ఇస్తున్నారా ఏంటి? అని కొందరు సరదాగా అడుగుతుంటే, వీళ్లు వెస్ట్రన్ రైల్వేని కొత్త ఫ్యాషన్ బ్రాండ్‌గా మార్చేశారు! అని మరికొందరు నవ్వుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం ఈ సంఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లేదా రైల్వే ఆస్తులను సొంత ఆస్తిలా భావించి దొంగిలించడం బాధ్యతారాహిత్యమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Three men spotted in a market openly wearing Indian Railways bedsheets as shawls.
The white linen clearly bears the “WESTERN RAILWAY” marking. these bedsheets were stolen from a Western Railway train.
According to RTI data compiled across railway divisions, from January 2022 to… pic.twitter.com/IsEKca87v8
— Gems Of Railway (@GemsOfRailway) August 22, 2026
ఆర్టీఐ (RTI) వివరాల ప్రకారం.. ప్రయాణికులు AC బోగీల నుంచి చార్లెస్‌లు, తువ్వాళ్లు, దిండు కవర్లను దొంగిలించడం వల్ల రైల్వే శాఖకు ప్రతి ఏటా దాదాపు ₹100 కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లుతోంది. సమాజంలో పౌర స్పృహ మారనంత వరకు ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం ఉండదని ఈ వీడియో మరోసారి నిరూపించింది.




