Snake In Helmet : హెల్మెట్‌లో దూరిన నాగుపాము.. హడలిపోయిన యువతి.. ఒళ్లు గగుర్పొడిచే సీన్ వైరల్
దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నాయి. చలిలో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తోంది. ఇంటి నుండి బయటకు రావడానికి వణుకు పుడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సరీసృపాలు కూడా వెచ్చదనాన్ని కోరుకుంటున్నాయి. అవును, చలితీవ్రతను తట్టుకోలేక ఒక కింగ్‌కోబ్రా ఏం చేసింది చూస్తే షాక్ అవుతారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటో పూర్తి డిటెల్స్‌లోకి వెళితే...

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మానవసేవ నగర్ నివాసి అయిన మిథాలీ చతుర్వేది తన హెల్మెట్‌ను తన స్కూటర్‌కు వేలాడదీయ కుండా దానిని ఇంటి లోపల ఉంచింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మిథాలీ పని మీద ఇంటి నుండి బయలుదేరడానికి రెడీ అయ్యారు. బైక్‌పై వెళ్లేందుకు హెల్మెట్ తీసుకుంది.. కానీ, హెల్మెట్‌లోంచి ఒక్కసారిగా ఏవో వింత శబ్ధాలు రావడం వినిపించింది.
ఆ శబ్దం విని మిథాలీ భయపడిపోయింది. కుటుంబంలోని మిగిలిన వారు వెంటనే అక్కడికి పరుగెత్తారు. జాగ్రత్తగా హెల్మెట్‌ను తలక్రిందులుగా చేసి చూడగా, లోపల ఒక విషపూరిత నాగుపాము చుట్టుకుని ఉండటం కనిపించింది. అప్పటికే మిథాలీ అరుపులకు చుట్టుపక్కల జనాలు కూడా వచ్చారు. జనసమూహాన్ని చూసిన ఆ నాగుపాము అమాంతంగా తన పడగను పైకి లేపింది..వేగంగా దూకేందుకు ప్రయత్నించింది.
హెల్మెట్ లోపల ఉన్న నాగుపాము దూరిందనే విషయం ఆ ప్రాంతంలో త్వరగా వ్యాపించింది. ఆ నాగుపాముని చూడటానికి చాలా మంది మిథాలీ ఇంటికి చేరుకున్నారు. స్థానిక సంస్థ వైల్డ్ యానిమల్స్ అండ్ నేచర్ హెల్పింగ్ సొసైటీలో పాములు పట్టే వ్యక్తిగా పనిచేస్తున్న శుభం జి.ఆర్. అనే యువకుడికి సమాచారం అందించారు. శుభం అక్కడికి చేరుకుని, అతను నాగుపాముని హెల్మెట్ నుండి సురక్షితంగా బయటకు తీశాడు. తరువాత పామును అడవిలోకి వదిలేశారు.
అయితే, హెల్మెట్ లోపల చుట్టుకుని ఉన్న పాము ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ప్రజలను షాక్ అయ్యేలా చేసింది. హెల్మెట్ లోపల ఉన్న పలుచని వస్త్రం పొరలోకి పాము ప్రవేశించిందని తేలింది.
View this post on Instagram
నాగుపాములు న్యూరోటాక్సిక్ విషాన్ని కలిగి ఉంటాయి. ఒక్క కాటు కూడా ప్రాణాంతకం కావచ్చు. శీతాకాలంలో ఇళ్ల దగ్గర ఇటుకలు, రాళ్ల కుప్పలలోకి పాములు ఎక్కువగా ప్రవేశిస్తుంటాయి. కలప, గడ్డి కుప్పలలో కూడా నక్కి ఉంటాయి. మీ ఇంటి చుట్టూరా చెట్లు, మొక్కలు, పొదలు ఉంటే, ఆకులు రాలిపోయి నేలపై కుళ్ళిపోవచ్చు. ఇలా కుళ్లిన ఆకులు ఎక్కువకాలం అలాగే ఉండిపోతే, పాములు ఆ చెత్తను వాటి ఆవాసంగా మార్చుకుంటాయి. అందువల్ల, శీతాకాలంలో పాములు దరిచేరకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, ఇంటి పగుళ్లను, గోడలు, పైపుల మధ్య ఖాళీలను మూసివేయాలి. ఖాళీ ప్రదేశాలలో పాత, పాడుబడిన వస్తువులను నిల్వ చేయకుండా ఉండండి. పాములు చొరబడకుండా ఉండటానికి ప్రతిదీ శుభ్రంగా ఉంచండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




