దేశంలో పెరుగుతున్న బంగారం అక్ర‌మ ర‌వాణా.. దేశాల నుంచి అక్ర‌మంగా వ‌స్తున్న బంగారం ఎవ‌రికి చేరుతుంది..?

వందల కేజీల బంగారం.. వేల కోట్ల విలువ.. గడిచిన ఐదేళ్లలోనే ఇంత పట్టుబడితే... దొరక్కుండా మార్కెట్లోకి ఎంత వచ్చి ఉండాలి.. రోజూ ధర మారే బంగారంలో కూడా ఆఫర్లు... డిస్కౌంట్లు పేరుతో భారీ ప్రకటనల వెనక మాయాజాలం...

  • Subhash Goud
  • Publish Date - 5:43 pm, Mon, 28 December 20
దేశంలో పెరుగుతున్న బంగారం అక్ర‌మ ర‌వాణా.. దేశాల నుంచి అక్ర‌మంగా వ‌స్తున్న బంగారం ఎవ‌రికి చేరుతుంది..?

వందల కేజీల బంగారం.. వేల కోట్ల విలువ.. గడిచిన ఐదేళ్లలోనే ఇంత పట్టుబడితే… దొరక్కుండా మార్కెట్లోకి ఎంత వచ్చి ఉండాలి.. రోజూ ధర మారే బంగారంలో కూడా ఆఫర్లు… డిస్కౌంట్లు పేరుతో భారీ ప్రకటనల వెనక మాయాజాలం ఈ దొంగ బంగారం కాదనగలమా? విదేశాల నుంచి అక్రమంగా తన్నుకొస్తున్న గోల్డ్‌ ఎవరికి చేరుతుంది. మరెవరి ద్వారా చేతులు మారుతుంది.

ఈ విశ్వంలో బంగారాన్ని మించి అత్యంత విలువైనవి చాలానే ఉన్నాయి. డైమాండ్‌, ప్లాటినమ్‌… అయినా కాస్ట్‌లీ అంటే అవన్నీ కాదని ఈ యెల్లో మెటల్‌తోనే దేన్నైనా పోల్చుతుంటాం.. మీ దోస్తు మిమ్మల్ని పలకరించక చాలాకాలం అయినా సరే పలుకే బంగారమాయనేరో అని ఉంటాం.. అంటే మన మధ్య తరగతి జీవితాలకు ఈ గోల్డ్‌ ఎంత విలువైందో కదా…! యస్‌.. మరి ఇవాళ ఆ బంగారమే మన సబ్జెక్ఠ్‌. బంగారం గురించి ఏం తేలుసుకుంటాంలే అనుకోకండి.. మనకు కనిపించేది వినిపించేది ధరల హెచ్చుతగ్గులే. కానీ అంతకుమించిన రహస్యాలు దీనిలో ఎన్నో ఇమిడి ఉన్నాయి.. అందులో ఒకటే స్మగ్లింగ్‌ బంగారం.

ఊరికే ఎవరికీ డబ్బులు రావు.. కానీ ఆ డబ్బుతో మనం కొనే బంగారం ఈ వ్యాపారుల కష్టార్జితమేనా? అలాగని అందరు వ్యాపారులను మనం తక్కువ చేయడం లేదు.. నేరస్తులు అని అంతకంటే ఉద్దేశం కాదు.. అంతర్జాతీయ లెక్కల ప్రకారం మనదేశంలో అక్రమంగా వస్తున్న బంగారం మరేదేశంలోకి రావడం లేదని చెబుతున్నాయి నివేదికలు. ప్రపంచంలో అత్య‌ధికంగా దిగుమ‌తి చేసుకునేది మ‌న‌మే. దీంతో పాటు అత్యధికంగా స్మగ్లింగ్‌ గోల్డ్‌ వస్తున్న దేశం కూడా మనదే కావడం దురదృష్టకరం. ప్రపంచానికే అక్రమ గోల్డ్‌ హబ్‌గా మారుతుంది.

ఒక్కసారి లెక్కలు చూద్దాం…

చైనా తర్వాత అత్యధికంగా గోల్డ్‌ వాడుతున్న దేశం మనదే… అధికారికంగా దిగుమతి చేసుకున్న యెల్లో మెటల్‌ కంటెంట్‌ సుమారు 800 నుంచి 900 టన్నులు ఉంటుంది. ఇది ఏడాదికి.. అయితే అక్రమంగా దేశంలోకి వస్తున్న పసిడి కూడా 200 నుంచి 250 టన్నులు ఉంటుందని అంచనా. ఇదేమీ తక్కువ కాదు.. దేశంలో మార్కెట్‌ అవుతున్న బంగారంలో నాలుగొవంతు అని నిఘా వర్గాల అంచనా. బిజినెస్‌ టుడే పత్రిక తన కథనంలో కెనడాకు చెందిన ఓ స్వచ్చంధ నివేదికను ప్రస్తావిస్తూ గోల్డ్‌ స్మగ్లింగ్‌పై వివరాలు తెలిపింది. 2019 నవంబరులో వచ్చిన రిపోర్ట్‌ ప్రకారం.. ఆఫ్రికా, అరబ్ దేశాల‌ నుంచి భయంకరంగా గోల్డ్ అక్ర‌మ ర‌వాణా‌ అవుతుంది. 2007లో 5 టన్నులు అక్రమంగా వస్తే.. 2012 నాటికి 40 టన్నులకు చేరింది. పెరుగుతున్న ధరతో అక్రమ బంగారం రాక కూడా పెరిగింది. 200 టన్నులకు చేరింది. దీని వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం కోల్పోతుంది.

ఈ నివేదిక ప్రకారం దేశంలోకి వస్తున్న ప్రతి 5 కేజీల బంగారంలో కేజీ మళ్లీ నగల రూపంలో విదేశాలకు పోతుంది. కేరళకు చెందిన విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న బంగారం దేశంలో మరే విమ‌నాశ్ర‌యాల్లోనూ దొరకడం లేదన్నది నగ్నసత్యం. చాలావరకు అక్రమంగా వచ్చిన బంగారం రిటైల్‌ చెయిన్‌ షాపులకు చేరుతుంది. అక్కడే విక్రయాలు జరుగుతుంటాయి. 2020 సెప్టెంబర్​లో లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం 2015-2020 ఆగస్టు వరకూ దేశంలోని వివిధ ఎయిర్​పోర్టుల్లో సీజ్​ చేసిన బంగారం 11,000 కిలోలు. దాని విలువ.. 3వేల కోట్లకు పైమాటే. నమోదైన గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులు-16,555 అయితే అరెస్ట్​ అయిన వ్యక్తులు 8,401 మంది. గత ఐదేళ్లలో బంగారం ఎక్కువగా దొరికిన ​ఎయిర్ ​ పోర్టులలో చెన్నైది మూడో స్థానం.

బంగారం స్మగ్లింగ్‌ కోసం అనుసరిస్తున్న వ్యూహాలు ఒక్కోసారి అధికారులను కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం బంగారం స్మగ్లింగ్‌ కోసం ఆపరేషన్లు చేయించుకుని కడుపులో పెట్టుకుని వస్తున్నారు. బూట్లు.. బట్టలు.. లో దుస్తులు. ఇలా దేనీని కూడా వదలడం లేదు.. అవకాశం ఉన్న ప్రతిచోటా పట్టినంత బంగారం తీసుకొస్తున్నారు స్మగ్లర్లు. బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారం కేవలం వ్యాపారులకు… దొంగలకు పరిమితం అయిన అంశం కాదు.. ఇందులో రాజకీయ పెద్దల భాగస్వామ్యం కూడా ఉంటుందని ఇటీవల బయటపడ్డ కేసులు చెబుతున్నాయి. మాజీ కేరళ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ ను కూడా పోలీసులు గ్రిల్‌ చేశారు. ఇందులో నాయకులున్నా… ఒత్తిడి కారణంగా అరెస్టులు దాకా వెళ్లలేదు కానీ.. గోల్డ్‌ స్మగ్లింగ్‌ అనేది ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కేరళ కేసులో UAE కాన్సులేట్‌లో పనిచేసే సారిత్‌, స్వప్న సురేష్‌ అనే సీఎం సన్నిహితురాలు అరెస్టు అయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నిఘా పెరిగింది

ఈ విష‌యంలో డైరెక్టేరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలెజెన్స్‌ కూడా అప్రమత్తం అయింది. అయినా గోల్డ్‌ స్మగ్లింగ్‌ ఆగడం లేదు. నిరంతరం జరుగుతూనే ఉంది. నిత్యం కేజీల కొద్దీ బంగారం పట్టుబడుతోంది. కొత్తగా వచ్చిన ట్రెండ్‌ ఏంటంటే.. మనుషుల అవసరం కూడా లేదు.. విదేశాల నుంచి ఈ కామర్స్‌ గూడ్స్‌ ద్వారా, కోరియర్స్‌ ద్వారా కూడా బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు గుర్తించారు.

పరిష్కారం ఏంటి?

దేశంలో వినియోగిస్తున్న బంగారంలో నాలుగొవంతు అక్రమంగా వచ్చిందన్న లెక్కలు చూస్తుంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం తగ్గుతుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే అక్ర‌మంగా దేశంలో బంగారం ‌ అడుగుపెట్టకుండా ఉండాలంటే.. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నది కొందరి వాదన. రియల్‌ స్మగ్లర్స్‌ మాత్రమే కాదు… విదేశాల నుంచి తక్కువ ధరకు వస్తుందని.. సామాన్యులు కూడా బంగారం కొని అక్రమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిష్కార మార్గాలు వెతకాలి. నిపుణులు దీనిపై కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు.‌ దేశంలో బంగారం అంటే జనాలు పడిచస్తారు.. ఇది మనకు సంప్రదాయాలు, వారసత్వంగా వచ్చిందే తప్ప.. పాశ్చాత్య దేశాల నుంచి అలంకారం కాదు.. కాబట్టిడి మాండ్‌ ఉంటుంది.. దీనిని దృష్టిలో పెట్టుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే అక్రమ గోల్డ్‌ రాక తగ్గుతుంది. వాడకంపై ఆంక్షలు కంటే కూడా మార్గదర్శకాలు అవసరం.

ఈ ఏడాదిలో శంషాబాద్‏లో పట్టుబడ్డ బంగారం విలువెంతో తెలిస్తే షాకవుతారు.. మొత్తం కేసులు ఎన్నంటే ?