ఏం ట్యాలెంట్‌రా సామీ.. గుడ్డివాడినంటూ 55ఏళ్లు సర్కార్ పెన్షన్ కాజేసిన ఘనుడు..
ఇటలీలో 70 ఏళ్ల వృద్ధుడు 53 సంవత్సరాలుగా అంధుడిగా నటిస్తూ, వైకల్య పెన్షన్ కింద మిలియన్ యూరోలకు పైగా మోసం చేశాడు. ఆర్థిక పోలీసులు నిఘా పెట్టి అతని సాధారణ కార్యకలాపాలను రికార్డు చేసి మోసాన్ని బయటపెట్టారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందిన ప్రయోజనాలు నిలిపివేయబడ్డాయి.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు నమ్మశక్యం కాని పనులు చేస్తుంటారు. కానీ, అవన్నీ ఎంతవరకు నిజం అనేది ఎప్పటికో గానీ బయటపడవు. అలాంటి నమ్మలేని విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటాలియన్ నగరమైన విన్సెంజాలో 70 ఏళ్ల వ్యక్తి అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఘనకార్యం చేశాడు. 53 సంవత్సరాలుగా అతను పూర్తిగా అంధుడిగా నటించాడు. ఈ వేషంలో వైకల్య పెన్షన్ ద్వారా ఒక మిలియన్ యూరోలకు పైగా లబ్ధి పొందాడు. అతను అర్ధ శతాబ్దానికి పైగా తప్పుడు గుర్తింపు కింద ప్రభుత్వ డబ్బును అందుకున్నాడు.
ఈ వ్యక్తి కార్యకలాపాలపై ఆర్థిక పోలీసులకు అనుమానం వచ్చినప్పుడు ఆరాతీయటం మొదలుపెట్టారు. ఐదు దశాబ్దాల క్రితం పనికి సంబంధించిన ఒక సంఘటన తర్వాత అతను ప్రభుత్వ రికార్డులలో పూర్తిగా అంధుడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత అతను క్రమంగా లక్షలాది యూరోల అంగవైకల్య పెన్షన్ తీసుకున్నాడు. అయితే, పోలీసులు కొంత అనుమానాస్పద ప్రవర్తనను గమనించి అతనిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. వారు అతని ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ దాదాపు రెండు నెలల పాటు అతనిపై నిఘా ఉంచారు. వారు అతను హాయిగా చేస్తున్న తోటపనిని గమనించారు, గృహోపకరణాలు కొనుగోలు చేయటం, మార్కెట్లో నగదు చెల్లింపులు, అతను అనేక ఉత్పత్తులను సరిగ్గా చెక్ చేస్తూ కొనుగోలు చేయటం గమనించారు. ఇవన్నీ అతను నిజమైన అంధుడు కాదని నిరూపించింది.
ఈ సాక్ష్యాల ఆధారంగా విన్సెంజో ప్రాసిక్యూటర్ కార్యాలయం అతనిపై ఇటాలియన్ ప్రభుత్వాన్ని మోసం చేశాడనే అభియోగం మోపింది. తదనంతరం ఆర్థిక పోలీసులు అన్ని సంక్షేమ, సామాజిక భద్రతా ప్రయోజనాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. గత ఐదు సంవత్సరాలుగా అతను సంపాదించిన అక్రమ లాభాలపై ఐటీ అధికారులు కూడా పన్ను విధించారు. ఇది దాదాపు 200,000 యూరోలు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ప్రజలు దీనిపై వివిధ రకాలుగా వ్యాఖ్యానించడం ప్రారంభించారు. ఒకరు అసాధ్యం! ఎవరైనా 55 సంవత్సరాలు అంధుడిగా ఎలా ఉండగలరు?” అని రాశారు. మరొకరు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు? మేము మాత్రమే పేదవాళ్ళమని అనుకున్నాము. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందని రాశారు. వావ్ అతనిది ఏం టాలెంట్..ఏకంగా 55సంవత్సరాల పాటు, ఇటు ప్రజల్ని, అటు ప్రభుత్వానికి కుచ్చు టోపి పెట్టాడు. అంటూ వ్యంగంగా రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




