AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?

భారతీయ దేవాలయాలలో ప్రసాదం సంప్రదాయం మారుతోంది. కొన్ని ఆలయాలు పిల్లల ఆరోగ్య, దీర్ఘాయుష్షు కోసం తల్లిదండ్రుల మొక్కులకు అనుగుణంగా ఆధునిక ఆహారాలైన పిజ్జా, బర్గర్‌లను ప్రసాదంగా అందిస్తున్నాయి. గుజరాత్‌లోని జీవికా మాతాజీ ఆలయం, చెన్నైలోని జై దుర్గా పీఠం ఈ వినూత్న సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అసలు ఈ ప్రసాదం పెట్టడానికి కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?
Pizza, Burgers, Pani Puri As Prasadam
Krishna S
|

Updated on: Nov 30, 2025 | 6:39 PM

Share

భారతీయ దేవాలయాలలో ప్రసాదం అంటే కొబ్బరికాయ, లడ్డూలు, పాయసం లేదా పులిహోర మాత్రమే గుర్తొస్తాయి. కానీ దేశంలో కొన్నిచోట్ల ఈ సంప్రదాయానికి భిన్నంగా, ఆధునిక ఆహారాలను దేవతలకు నైవేద్యంగా పెడుతున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్, చెన్నై సమీపంలోని రెండు ప్రసిద్ధ దేవాలయాలలో దశాబ్దాలుగా పిజ్జా, శాండ్‌విచ్‌లు, బర్గర్లు, పానీపురి, కూల్ డ్రింక్స్ ప్రసాదంగా పంచుతున్నారు. దీని వెనుక ఉన్న కారణం అందరినీ ఆకట్టుకుంటుంది. అది పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, వారి దీర్ఘాయువు కోసం చేసిన ప్రత్యేక ప్రతిజ్ఞ.

 జీవికా మాతాజీ దేవాలయం కథ

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని రపుతానా గ్రామంలో దాదాపు 65-70 ఏళ్ల క్రితం జీవికా మాతాజీ ఆలయం స్థాపించారు. ఈ ఆలయంలో తల్లులు తమ పిల్లల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో ఇక్కడ కొబ్బరి, చక్కెరతో చేసిన సాధారణ ప్రసాదమే ఉండేది. అయితే గుడికి వచ్చే పిల్లలు సాంప్రదాయ స్వీట్లను తినడానికి ఇష్టపడకుండా మొండికేసేవారు. పిల్లలు సంతోషంగా గుడికి రావాలని, ప్రసాదం స్వీకరించాలని ఆలయ కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై పిల్లలు ఇష్టపడే పిజ్జా, బర్గర్, శాండ్‌విచ్, పానీపురిని ప్రసాదంగా పెట్టాలని నిర్ణయించింది. నేడు, భక్తులు ఈ ఆహారాలను స్వయంగా తెచ్చి దేవతకు నైవేద్యంగా సమర్పించి, తిరిగి వాటిని పిల్లలకు సంతోషంగా ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు.

 జై దుర్గా పీఠం అద్భుతం

తమిళనాడులోని చెన్నై సమీపంలోని పడప్పాయ్‌లో ఉన్న జై దుర్గా పీఠం ఆలయం కూడా ఇదే తరహా ప్రత్యేకతను కలిగి ఉంది. హెర్బల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీధర్ ఈ ఆలయాన్ని స్థాపించారు. ఇక్కడ కూడా సాధారణంగా పిజ్జా, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, పానీపురి, కూల్ డ్రింక్స్ దేవతకు నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా భక్తులు తమ పిల్లల పుట్టినరోజులను ఆలయంలో నమోదు చేసుకుంటే, ఆ రోజున ప్రత్యేకంగా కేక్‌ను కట్ చేసి ప్రసాదంగా పంచుతారు. ఈ ఆలయంలోని అన్ని ప్రసాదాలను ఆలయ పవిత్ర వంటగదిలో స్వచ్ఛతతో తయారు చేస్తారు. వీటికి FSSAI సర్టిఫికేషన్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

సంప్రదాయం వెనుక ప్రధాన కారణం

ఈ రెండు దేవాలయాలలో ఇలాంటి విభిన్న నైవేద్యం పెట్టడానికి కారణం ఒకటే.. తల్లులు తమ పిల్లల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం చేసిన ప్రార్థనలు. పిల్లలు గుడికి వచ్చినప్పుడు సంప్రదాయ స్వీట్లు తినడానికి ఇష్టపడరు. కానీ వారికి పిజ్జా బర్గర్లు చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. అందుకే దేవత కూడా ఆధునిక పిల్లల ఆహారాన్ని అంగీకరిస్తుంది అనే భావనతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీనివల్ల పిల్లలు సంతోషంగా ఆలయానికి వస్తారు. తల్లి చేసిన ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. ఈ విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా దేవాలయాలు కూడా నూతన సంప్రదాయాలను పాటిస్తూ ఆకర్షణ కేంద్రాలుగా నిలుస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..